Pension: ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్‌ మొత్తం, ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.7 వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.

Updated : 26 Jun 2024 08:37 IST

సచివాలయ సిబ్బందితో చేపడతాం
జులై 1 నుంచి పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం 
తొలి దశలో 183 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ 
కష్టపడ్డ వారికి త్వరలో నామినేటెడ్‌ పదవులు 
పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్‌ మొత్తం, ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి రూ.7 వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో.. అది సాధ్యమని నిరూపించడానికే పంపిణీలో వారిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తానూ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొనాలని సూచించారు. తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పరిశీలకులు, ముఖ్యనేతలతో చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వీటి నిర్వహణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగి తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వైకాపా నేతల్ని తెదేపాలోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి కృషి చేసిన వారిని నామినేటెడ్‌ పోస్టుల్లో నియమించనున్నట్లు తెలిపారు. వారి వివరాల్ని సేకరిస్తున్నామన్నారు. ‘పార్టీ నేతలు ఇచ్చే వివరాలతో పాటు, ఇతర మార్గాల్లోనూ నివేదికలు తెప్పించుకుంటున్నాను. కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చూస్తాను. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది’ అని చంద్రబాబు తెలిపారు. 

అన్యాయం చేసిన వారిని ఉపేక్షించం

గత ప్రభుత్వంలో తెదేపాకు నష్టం చేసిన వారిని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారినీ వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మనకు అధికారం వచ్చిందని స్వలాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘ప్రజలు నమ్మి, మనల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పొత్తులో భాగంగా 31 మంది ఇన్‌ఛార్జులకు సీట్లు ఇవ్వలేకపోయాం. అయినా వారు వెనకడుగు వేయకుండా ఎన్డీయే గెలుపు కోసం పనిచేశారు. అందుకే చరిత్ర తిరగరాసేలా ఫలితాలు వచ్చాయి. 57 శాతం ఓట్లు సాధించి.. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిచాం’ అని చంద్రబాబు అన్నారు. రైట్‌ మ్యాన్‌.. రైట్‌ పొజిషన్‌ అనే విధంగా భవిష్యత్తు నిర్ణయాలు ఉండబోతున్నాయని, 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. 

బీసీలకు ఎప్పుడూ సముచిత స్థానం

‘గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి గౌరవించాం. మరో బీసీ నేత అయ్యన్నపాత్రుణ్ని స్పీకర్‌గా నియమించాం. తెదేపాలో ఎప్పుడూ బీసీలకు సముచిత స్థానం ఉంటుంది. మంత్రిమండలి కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించాం’ అని చంద్రబాబు తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని