Free Sand: ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం

ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. 

Updated : 04 Jul 2024 07:02 IST

ఇకపై టన్ను ఇసుకపై రూ.287 మిగులు
సీనరేజ్‌ కింద రూ.88 మాత్రమే వసూలు
ఆ మొత్తమూ స్థానిక సంస్థల ఖాతాలకే

ఈనాడు, అమరావతి: ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. 

  • ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఇప్పటి వరకు టన్ను రూ.475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేయగా, మిగిలిన రూ.375 ప్రభుత్వానికి చేరేది.
  • ఇకపై రూ.375 కాకుండా.. కేవలం రూ.88 వసూలు చేస్తారు. ఆ మొత్తమూ స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో.. సీనరేజ్‌ ఛార్జి కింద తీసుకునే రూ.66(టన్నుకు) నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్‌ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ.1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుంది.
  • ఈనెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ.88తోపాటు, ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్‌ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్‌ పాయింట్‌లో లోడింగ్‌ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్‌ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
  • బోట్స్‌మెన్‌ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ.625కి విక్రయించారు. ఇందులో బోట్స్‌మెన్‌ సొసైటీకి.. టన్నుకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్‌మెన్‌ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ.200, సీనరేజ్‌ రూ.88 కలిపి రూ.288కే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు.
  • సెప్టెంబరు వరకు ఆన్‌లైన్‌ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు.
  • అక్టోబరు నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీచేసి, ఆన్‌లైన్‌ చెల్లింపులు తీసుకురానున్నారు.
  • ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్‌ గనులశాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఓ రూట్‌కు అనుమతి తీసుకొని, మరో మార్గంలో వెళితే చర్యలు తీసుకుంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని