Ramprasad Reddy: విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం

విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.

Updated : 01 Jul 2024 07:13 IST

రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి

విశాఖపట్నం(ఎన్‌ఏడీ కూడలి), న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జగన్‌ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను ఇప్పుడు స్థాపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. 

అక్రమాల్లో జగన్‌ తర్వాత పెద్దిరెడ్డే

వైకాపా పాలనలో జగన్‌ తర్వాత ఎక్కువ అక్రమాలకు పాల్పడింది, అధిక మొత్తంలో అక్రమార్జన కూడబెట్టింది పెద్దిరెడ్డేనని మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి తెదేపాపై చేసిన విమర్శలను ఖండించారు. రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డిదే అతిపెద్ద మాఫియా కుటుంబమని, మొత్తం ఖనిజ సంపదను దోచేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ల్యాండ్, వైన్, మైన్‌ కుంభకోణాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే మిథున్‌రెడ్డికి అన్నమయ్య జిల్లా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని