Chandrababu: ఇసుక విధానంపై సీఎం కీలక భేటీ

రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.

Updated : 03 Jul 2024 06:01 IST

గనుల శాఖ అధికారులతో సమీక్ష
వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంపై దృష్టి
నేడు మరోసారి సమావేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలకు ఇబ్బందిలేని మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనులశాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గతంలో తెదేపా హయాం (2014-19)లో అమలైన విధానాలు, 2019-24 మధ్య వైకాపా అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. మరోవైపు, ప్రస్తుతం ఇసుక గుత్తేదార్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రాలను తప్పిస్తే, న్యాయపరంగా వచ్చే చిక్కులపై చర్చించారు. ఈ రెండు సంస్థలు టెండరు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకోసారి డబ్బులు చెల్లించకుండా, చాలాకాలంగా బకాయి ఉన్నాయని, ఈ కారణంగా వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.  

ఉచితమైనా పర్మిట్ల ద్వారానే..

‘ఉచిత ఇసుక విధానం’ అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే, అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు.  

పర్మిట్లు ఆపేయడంతో భారీగా నష్టం 

రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్‌లైన్‌ పర్మిట్ల జారీని కొద్ది రోజులుగా నిలిపేశారు. సిమెంట్‌ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపు రాయికి మాత్రమే పర్మిట్లు ఇస్తున్నారు. గ్రానైట్, రోడ్‌ మెటల్, సిలికా శాండ్, క్వార్ట్జ్‌ తదితర అన్ని ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రోజుకు సగటున రూ.5 కోట్ల చొప్పున రాబడి కోల్పోవాల్సి వస్తోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో బుధవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.  

ఐదేళ్లలో రోడ్లు సర్వనాశనం: చంద్రబాబు 

రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రహదారులను సర్వనాశనం చేసిందని, కనీసం గుంతలు పూడ్చలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంతల రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయడంపై ఆర్‌అండ్‌బీ అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి? ఎక్కడెక్కడ గుంతలమయంగా ఉన్నాయో ఆరా తీశారు. వీటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఫ్లై యాష్‌ ద్వారా గుంతలు పూడ్చే అవకాశముందా? మన వద్ద అలాంటి సాంకేతికత ఉందా? అనేది పరిశీలించాలని ఆదేశించారు. తొలుత ఒకట్రెండు కిమీలలో ఫ్లైయాష్‌ ద్వారా గుంతలు పూడ్చి, దాని ఫలితాలను పరిశీలించాలని ఇంజినీర్లను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని