Ramoji Rao: అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు

అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది.

Updated : 28 Jun 2024 07:07 IST

మహామనీషికి ఘనంగా నివాళులు
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన దిగ్గజాలు
రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగం

ఈనాడు, అమరావతి: అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది. ఆయన గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడలో గురువారం అత్యంత ఘనంగా సంస్మరణ సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో... రాజకీయ, మీడియా, సినిమా, వ్యాపార రంగాల నుంచి అతిరథ మహారథులు పాల్గొన్నారు. రామోజీరావు కుమారుడు, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌.కిరణ్‌ సహా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా పెదపారుపూడితో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచీ సన్నిహితులు, బంధువులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చారు. శిఖర సమానులైన రామోజీ వ్యక్తిత్వాన్ని, ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో కొనసాగాలన్న ఆయన పట్టుదలను, సమున్నత వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అహరహం ఆయన పడిన తపనను ఆహూతులు కొనియాడారు. ఆయనతో తమకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, వృత్తిగతమైన అనుభవాల్ని నెమరువేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు, ఎన్టీఆర్‌ ఇద్దరూ ఇద్దరేనని... వారు సాధించిన అసాధారణ విజయాల్ని చేరుకోవడం ఎవరి వల్లా కాదని చంద్రబాబు కొనియాడారు. ‘‘ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైనప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి ప్రజల తరఫున ముందుండి పోరాడిన వ్యక్తి రామోజీరావు’’ అని ఆయన పేర్కొన్నారు. రాజధానికి ‘అమరావతి’ పేరు సూచించింది ఆయనేనని గుర్తుచేశారు.

రామోజీ సంస్మరణ సభలో మౌనం పాటిస్తున్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌

రాజధానిలో ‘రామోజీ విజ్ఞాన కేంద్రం’

వివిధ రంగాల్లో రామోజీరావు చేసిన విశేషకృషికి గాను ఆయనను ‘భారతరత్న’తో గౌరవించడం సముచితంగా ఉంటుందని రాజమౌళి తదితరులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్, రామోజీరావులకు ‘భారతరత్న’ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అద్భుత నగరంగా నిర్మించాలని రామోజీరావు ఆకాంక్షించారని, ఆయన స్మృతికి నివాళిగా దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ తరహాలో అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రాజధానిలోని ఒక రహదారికి ‘రామోజీ మార్గం’గా పేరు పెడతామని చెప్పారు. సినిమా రంగానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను విశాఖలో ఏర్పాటు చేసే చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతామని వెల్లడించారు. రామోజీరావు సంస్మరణ సభను ఇంత ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌.కిరణ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన నమ్మిన, పాటించిన విలువల్ని తామంతా త్రికరణ శుద్ధితో కొనసాగిస్తామని తెలిపారు. అమరావతిని ఐకానిక్‌ నగరంగా నిర్మించాలని రామోజీరావు బలంగా ఆకాంక్షించేవారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి తమ కుటుంబం తరఫున రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తానికి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు అందజేశారు. 


సభలో నిలబడి రామోజీరావుకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు, ప్రజలు

హాజరైన అతిరథ మహారథులు

విజయవాడ కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో జరిగిన రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ఏర్పాట్లు చేసింది. ఐదుగురు మంత్రుల కమిటీ.. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 6.35 వరకు సభ జరిగింది. భారీ వేదికపై రామోజీ చిత్రపటాన్ని ఉంచారు. సభకు హాజరైన ప్రముఖులంతా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలు, సాధించిన విజయాల్ని తెలియజెప్పే వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు. ఆయన మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హిందూ పత్రిక మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్, రాజస్థాన్‌ పత్రిక సంపాదకుడు గులాబ్‌ కొఠారి హాజరయ్యారు. మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్‌ పాల్గొన్నారు. రామోజీరావు కోడళ్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, మనుమరాళ్లు సహరి, ఆమె భర్త రేచస్‌ వీరేంద్రదేవ్, బృహతి, ఆమె భర్త వెంకట్‌ అక్షయ్, సోహన, ఆమె భర్త వినయ్, దివిజ, మనవడు సుజయ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రముఖ వ్యాపారవేత్త బొల్లినేని కృష్ణయ్య, భాజపా నాయకుడు, ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు, పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు కంభంపాటి రామ్మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, మురళీమోహన్, ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కీరవాణి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, జయసుధ, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి, ఎన్నారై తెదేపా మీడియా సమన్వయకర్త సాగర్‌ దొడ్డపనేని సహా పలువురు ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో సమాచార, పౌరసంబంధాల శాఖ ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తదితర ప్రముఖులు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ ఉంచిన రామోజీరావు భారీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు... సభ ముగిశాక కూడా ఛాయాచిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

నివాళులర్పిస్తున్న మంత్రులు లోకేశ్, అనిత

ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచారు: లోకేశ్‌

ఎమర్జెన్సీని ప్రకటించిన 1975 నుంచి నిన్నటి జగన్‌ పాలన వరకు.. పాలకులు ప్రజల హక్కుల్ని కాలరాసినప్పుడు రామోజీరావు ధైర్యంగా ఎదురుతిరిగారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే క్రమంలో వ్యక్తిగతంగా ఎంత నష్టం వాటిల్లినా లెక్క చేయలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం మార్గదర్శి మీద ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు చేసింది. ప్రజల సొమ్ముకు గ్యారెంటీ లేదని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. అయినా ఒక్క ఖాతాదారూ మార్గదర్శిని అనుమానించలేదు. ఈటీవీలో ఒక వార్త వచ్చిందంటే అది నిజమేనని జనం నమ్ముతారు. ఇవన్నీ ఆయన విశ్వసనీయతకు నిదర్శనం. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి రామోజీరావు జీవితాన్ని మించిన పాఠ్యాంశం దొరకదు. తెలుగువారికి రామోజీరావు పెద్దదిక్కు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని