Andhra university: వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా

వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Published : 29 Jun 2024 06:30 IST

అదే బాటలో రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌
స్వేచ్ఛ లభించిందంటూ ఏయూలో కేక్‌ కోసిన ఉద్యోగులు

రాజీనామాలు చేసిన కృష్ణా, ఉర్దూ, ద్రవిడ వర్సిటీల వీసీలు

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొందరు ఉద్యోగులు శుక్రవారం కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరుగా వీసీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డితో పాటు కృష్ణా వర్సిటీ వీసీ జి.జ్ఞానమణి, ఉర్దూ వర్సిటీ వీసీ ఎఫ్‌.రెహ్మాన్, ద్రవిడ వర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేశారు. వీరందరి స్థానాల్లో ఇన్‌ఛార్జులను నియమించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్డదారిలో ఆంధ్ర వర్సిటీలోకి అడుగుపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్‌ పదవి చేపట్టిన జేమ్స్‌ స్టీఫెన్‌ కూడా రాజీనామా సమర్పించారు. వీసీ, రిజిస్ట్రార్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 14 రోజులుగా నిరసన చేయడం.. అదే సమయంలో ఉద్యోగ, దళిత, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం కావడంతో వీసీ పదవికి ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు.

ఉన్నత విద్యలో అరాచకశక్తి

ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిభను వీసీ ప్రసాదరెడ్డి మసకబార్చారు. ఫక్తు వైకాపా నాయకుడిలా.. అరాచకశక్తిగా వ్యవహరించారు. వర్సిటీలో జగన్‌ పుట్టినరోజు వేడుకలు, వైఎస్సార్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైకాపా నేత విజయసాయిరెడ్డితో కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో.. వైకాపా విజయానికి వ్యూహాలు రచించారు. ఆ పార్టీ తరఫున టికెట్లు ఎవరికి కేటాయించాలో కూడా ఆయనే చెప్పారనే ఆరోపణలున్నాయి. తర్వాత ఉత్తరాంధ్ర వైకాపా ఇంఛార్జిగా వైవీ సుబ్బారెడ్డిని నియమించడంతో ఆయన మెప్పు పొందేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఏయూ పరిధిలోని కళాశాలల అధ్యాపకులతో దసపల్లా హోటల్‌లో సమావేశం నిర్వహించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని విద్యార్థులతో సర్వేలు చేయించినట్లు ఆరోపణలున్నాయి. 

శిష్యుడికి కీలక పదవి

ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్‌ స్టీఫెన్‌కు అర్హత లేకున్నా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు. కొద్దిరోజులకే ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్‌ (టీడీఆర్‌) హబ్‌ డీన్‌గానూ బాధ్యతలు అప్పగించారు. సీనియర్‌ ఆచార్యులను పక్కనపెట్టి గతేడాది సెప్టెంబరులో రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసాదరెడ్డి శిష్యుడు కావడంతో మిగిలిన ఆచార్యులెవరూ దీనిపై నోరు మెదపలేదు.

బెదిరింపులు.. అక్రమ కేసులు

వైకాపా నేతల అండతో గత ఐదేళ్లు ప్రసాదరెడ్డి నియంతలా వ్యవహరించారు. ఆయన అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే స్థానిక పోలీసుల సహకారంతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రతిపక్షాలతో సంబంధమున్న, ఆ పార్టీల నాయకులను అభిమానించే ఉద్యోగులను ఏదో కారణంతో ఇబ్బంది పెట్టేవారు. టీడీఆర్‌ హబ్‌ పేరిట పీహెచ్‌డీ సీట్లు విక్రయించారు. వర్సిటీ ఇంజినీరింగ్‌ హాస్టళ్లకు సమీపంలోని చెట్లను నరికించి, నీటి గెడ్డలను పూడ్చేశారు. దీనిపై ఫిర్యాదు వెళ్లడంతో అటవీశాఖ అధికారులు వర్సిటీ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఆచార్యులను వేధింపులకు గురిచేశారు.

ప్రైవేటు సైన్యం ఏర్పాటు

తన నియంతృత్వ పోకడలకు ప్రతీకగా ప్రసాదరెడ్డి ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేనివిధంగా ఏయూలో భద్రత అవసరాల పేరిట ‘చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌’ పదవిని సృష్టించారు. ఆ పదవిలో విశ్రాంత పోలీసు అధికారి మొహమ్మద్‌ ఖాన్‌ను నియమించారు. రూసా నిధుల నుంచి ఆయనకు నెలకు రూ.లక్ష వరకు జీతం చెల్లిస్తున్నారు. అప్పటికే వర్సిటీలో 100 మంది వరకు భద్రతాసిబ్బంది పనిచేస్తుండగా.. తన మనుషులు 100 మందిని విధుల్లోకి తీసుకున్నారు. వీసీ చుట్టూ ఐదుగురు సిబ్బందిని పెట్టి, ఆయన రాగానే కారు డోర్‌ తీయడం, సెల్యూట్‌ చేయడం వంటివి చేయించేవారు.

ప్రసాదరెడ్డి హయాంలో ఎలాంటి ప్రకటనా లేకుండా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 45 మందికి పైగా ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మరో 15మంది సహాయ ఆచార్యులను ఒప్పంద ప్రాతిపదికన నియమించారు. అడ్మిషన్లు తగ్గాయనే సాకుతో దాదాపు 28 కోర్సులను మూసేసి, 15 ఏళ్లుగా పనిచేస్తున్న 250 మంది అతిథి అధ్యాపకులను రోడ్డున పడేశారు.


వైకాపాకు జైకొట్టిన కృష్ణా వీసీ

వైకాపా మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సిఫార్సులతో ఔట్‌సోర్సింగ్‌లో చాలామందిని ఉద్యోగాల్లో నియమించినట్టు కృష్ణా వీసీ జ్ఞానమణిపై ఆరోపణలున్నాయి. రూ.10 కోట్ల విశ్వవిద్యాలయ నిధులను ప్రభుత్వానికి మళ్లించారు. విశ్వవిద్యాలయంలో వసతిగృహాలు, ఫార్మసీ కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాల, ఫుడ్‌కోర్టు వంటి నిర్మాణాల విషయంలో తీవ్ర జాప్యం చేశారనే విమర్శలున్నాయి.


వీరి పరిస్థితి ఏంటి?

వైకాపాతో అంటకాగిన ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్, విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి రాజీనామాలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తున్నాయి. నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్‌ మూడు రాజధానులకు మద్దతుగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించేవేళ జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వైకాపా ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. వర్సీటీకి సెలవులు ఇచ్చి, పరీక్షలనే వాయిదా వేసిన వైకాపా వీరవిధేయుడు రాజశేఖర్‌. 

విక్రమ సింహపురి వీసీ సుందరవల్లి మాజీ సీఎం జగన్‌కు సమీప బంధువు. పరిపాలన భవనానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు, ఆ భవనంలో ఆయన విగ్రహాన్ని పెట్టి స్వామిభక్తి చాటుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. పదోన్నతుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని