Rains: తొలకరి ‘జోరు’

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ ఆరంభం నుంచి అంటే జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి.

Updated : 01 Jul 2024 06:19 IST

జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటున సాధారణం కంటే 59% అధికంగా వానలు
రాయలసీమలో మరింత ఎక్కువగా..

గుంటూరు ఏటీ అగ్రహారం 14వ లైనులో నిలిచిన వర్షం నీరు 

ఈనాడు, అమరావతి-గుంటూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ ఆరంభం నుంచి అంటే జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాలోనూ సాధారణం కంటే అధికంగా వానలు కురిసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పల్నాడు వరకు చాలాచోట్ల ఎడతెరపిలేని జల్లులు పడుతున్నాయి. వర్షాలు అనుకూలిస్తుండటంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కి దున్నించి విత్తనం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

నంద్యాల జిల్లాలో 152% అధికంగా 

నంద్యాల జిల్లాలో సాధారణం కంటే 152% అధికంగా వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయి. అనంతపురం 141.1%, చిత్తూరు 131.3, శ్రీసత్యసాయి 122.4, అన్నమయ్య 105.4,  వైఎస్సార్‌ 95.8, కర్నూలు 79.8, తిరుపతి 60.5% చొప్పున అధికంగా వానలు కురిశాయి. కృష్ణా జిల్లాలోనూ సాధారణం కంటే 101% ఎక్కువ వర్షపాతం నమోదైంది. 

శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమ మండలంలో 113 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా బుట్టాయగూడెంలో 94.75 మి.మీ వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 83.0, బాపట్ల జిల్లా కూచినపూడిలో 72.75, రాజధాని అమరావతిలో 66.75, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో 54.25, పల్నాడు జిల్లా చాగల్లులో 54.0, ఏలూరులో 51.25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఎడతెరపి లేకుండా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి.


గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం 

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌ పైనుంచి ప్రవహిస్తున్న నీరు

పోలవరం, న్యూస్‌టుడే: పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఆదివారం సాయంత్రానికి 24.40 మీటర్లకు నీరు చేరుకుంది. దీంతో స్పిల్‌వేలోని రివర్‌ స్లూయిజ్‌ గేట్ల నుంచి స్పిల్‌ ఛానల్‌లోకి నీరు ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరుగుతుండటంతో స్పిల్‌ ఛానల్‌పై రాకపోకలకు వీలుగా వేసిన అడ్డుకట్టకు కొంత మేర గండి కొట్టినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని