Ramoji Rao: పనిలోనే విశ్రాంతి పొందిన.. నిర్విరామ శ్రామికుడు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవిత ప్రస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లఘుచిత్రం (ఏవీ) స్ఫూర్తిదాయకంగా ఉంది.

Published : 28 Jun 2024 06:45 IST

తెలుగునాట.. ఆయన పేరు  తెలియని ఊరు లేదు
రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించిన లఘుచిత్రం

ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జీవిత ప్రస్థానంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లఘుచిత్రం (ఏవీ) స్ఫూర్తిదాయకంగా ఉంది. రామోజీరావు అకుంఠిత దీక్ష, పట్టుదల, కార్యసాధన.. తెలుగునేలపై సాగించిన అక్షరయజ్ఞం, మాతృభాషా పరిరక్షణ కోసం తపించిన విధానం, భారతీయ పత్రికారంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు, పాత్రికేయ విలువలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంబిగించడం, తెలుగునాట ప్రకంపనలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అద్భుతమైన విజయం సాధించేవరకూ ఎన్టీఆర్‌కు అందించిన సహకారం, తెలుగు ప్రజల ఘనకీర్తిని ప్రపంచ పటంపై చాటడం, ప్రజాసమస్యల పరిష్కారానికి సమరయోధుడిలా సాగించిన పోరు, ఆఖరి వరకూ ప్రజల పక్షాన నిలబడిన విధానం.. ఇవన్నీ తెలుగుజాతి ఉన్నంత వరకూ అఖండంగా వెలుగుతూనే ఉంటాయి.. అని రామోజీరావు జీవితంలోని అన్ని దశలనూ కళ్ల ముందు కదలాడేలా రూపొందించిన లఘుచిత్రం ఆహూతులను కట్టిపడేసింది. లఘుచిత్రంలో స్ఫూర్తిదాయకమైన అంశాలివీ..

దీక్షాదక్షుడు...

రామోజీరావు.. ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడాయన. భారతీయ పత్రికారంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ స్టూడియోను నిర్మించిన మహా స్వాప్నికుడు. ప్రజాస్వామ్యం పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారీ కలం పట్టి కదంతొక్కి దుర్మార్గాలను ఎండగట్టిన దీక్షాదక్షుడు.

ప్రజాప్రయోజనం తప్ప ఏదీ ముఖ్యం కాదు..

1936లో జన్మించి, 2024లో తన 88వ ఏట మహాప్రస్థానం చేరే వరకూ.. పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజాప్రయోజనం తప్ప ఏదీ.. మరేదీ ముఖ్యం కాదని చెప్పొచ్చు. ఈ ఒక్క లక్ష్యం.. లక్షణమే రామోజీరావును నాడు నందమూరి తారకరామారావుకు, నేడు నారా చంద్రబాబునాయుడికి చేరువ చేసింది. ఆనాడు.. 1982లో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించినప్పుడు.. కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులు పారుతున్నా.. అన్నపూర్ణ ఒడిలో ఆకలి కేకలు వినిపించే దురవస్థ ఎందుకని ప్రశ్నించిన ఎన్టీఆర్‌కు ‘ఈనాడు’ పత్రిక వీరతిలకం దిద్దింది. తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించాలనే ఎన్టీఆర్‌ ఆశయమే.. రామోజీరావును ఆయనకు ఆప్తుడిని చేసింది. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్‌హిట్‌ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది ఆయన ఏ స్వప్రయోజనమూ ఆశించి చెయ్యలేదు. ఏడాదికోసారి ముఖ్యమంత్రులను మారుస్తూ, తెలుగు నేతలను కించపరుస్తూ, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి.. నిప్పులతో కడిగేసి.. తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన. అపూర్వమైన వీరి కలయిక తెలుగునేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది. 

తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మార్మోగాలని..

తెలుగు ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలి. తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మార్మోగాలని కలలు కనేవారు రామోజీరావు. అందుకే నారా చంద్రబాబునాయుడి ఆలోచనలను, ముందుచూపును అభినందించేవారు. ప్రజాసమస్యలను గుర్తించడం, పరిష్కార మార్గాలను అన్వేషించడం, వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం, సాధించే వరకూ సేదతీరకుండా శ్రమించడం వంటి లక్షణాలే చంద్రబాబును.. రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంలా మలచడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం.. వంటి అంశాలలో చంద్రబాబు విజన్‌ను, విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు. ఎంత ఆత్మీయత ఉన్నా.. ఏరోజూ ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో, ఒక ప్రయోజనం కోసమో పత్రికను అణుమాత్రం కూడా వినియోగించలేదాయన. అన్ని రాజకీయపక్షాల ఆలోచనలకు, అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు. ఒక్కసారి 2004 నాటి రాజకీయ పరిస్థితులను, ‘ఈనాడు’ వివిధ పక్షాల వార్తలకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది.

అఖండ కీర్తి....

ఏరోజైనా ఏనాడైనా.. ప్రజలే ఆయనకు ప్రథమం. అందుకే.. చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు. ఆయన మన మధ్య లేకపోయినా.. ఆ ఖ్యాతి.. తెలుగుజాతి ఉన్నంత వరకూ అఖండంగా వెలుగుతూనే ఉంటాయి. వారి ఆశయాలు, ఆలోచనలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ఉంటాయి.. అని రామోజీరావు జీవితంలోని అన్ని దశలనూ లఘుచిత్రంలో స్పృశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని