AP news: తెచ్చిన పెట్టుబడులెన్ని.. నంజుకున్న భూములెన్ని?

రాష్ట్ర పారిశ్రామికరంగంపై ప్రభుత్వం జులై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్‌ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది.

Updated : 26 Jun 2024 07:13 IST

కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలపైనా ప్రభుత్వం దృష్టి
జగన్‌ జమానాపై  తయారవుతున్న నివేదిక.. జులై 4న ప్రజల ముందుకు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగంపై ప్రభుత్వం జులై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్‌ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోల ద్వారా చేసిన భూ కేటాయింపులు, పెట్టుబడులు, ఇతర వివరాలతో జగన్‌ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఎంతగా విధ్వంసం చేసిందో, దాని వల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, పెట్టుబడుల ఆకర్షణ కోసం అప్పట్లో నిర్వహించిన సదస్సుల ద్వారా సాధించిన ప్రయోజనాలేంటో ప్రభుత్వానికి వివరించేలా సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నివేదిక తయారీలో కేపీఎంజీ సంస్థ సహకారం అందించనుంది.  దీనిపై సీఎం దగ్గర చర్చించిన తర్వాత ప్రభుత్వం శ్వేతపత్రంగా ప్రజల ముందు ఉంచనుందని ఒక అధికారి తెలిపారు. 

ప్రత్యేక జీవోల మతలబు ఏంటి? 

జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో అస్మదీయులకు భూములను ఇష్టారాజ్యంగా చౌక ధరకు పంచిపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక జీవోలను ఇచ్చింది. ఇలా ఎన్ని సంస్థలకు భూములను కట్టబెట్టింది.. వాటి కేటాయింపులో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా.. రాయితీ ధరకు భూములిచ్చి సొంత ప్రయోజనాలు పొందారా.. ఐదేళ్లలో జరిగిన భూ దోపిడీ విలువ ఎంత.. వంటి వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది. ఏపీఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపుల వివరాలు బయటకు వెల్లడించకుండా గత ప్రభుత్వం గుట్టుగా వ్యవహరించింది. అదేసమయంలో పారిశ్రామికవేత్తలకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలను కూడా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ దృష్ట్యా కేపీఎంజీ సంస్థకు అధికారులు తగిన సూచనలను ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? పరిశ్రమలు ఎన్ని? వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి లభించింది? వంటి వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019కి ముందున్న ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తమ హయాంలోనే వచ్చాయని జగన్‌ చెప్పేవారు. అందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 జూన్‌ నుంచి 2022 ఆగస్టు వరకు రూ. 46,280 కోట్ల పెట్టుబడులతో 99 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రూ. 39,655 కోట్లతో మరో 55 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయంటూ మాజీ సీఎం జగన్‌ చెప్పారు. ఆ మాటల్లో వాస్తవం ఎంతో ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

  • పెట్టుబడుల ఆకర్షణ కోసం గత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల ఎంతమేర ప్రయోజనం చేకూరిందో అధికారులు లెక్కతేల్చే పనిలో ఉన్నారు. దావోస్‌ దాకా వెళ్లి రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు గత ప్రభుత్వం చెప్పింది  అలాగే వివిధ ఔట్‌ రీచ్‌ కార్యక్రమాలు.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎక్స్‌పోలకు హాజరు కావడానికి ఎంత మొత్తం ఖర్చు చేశారో లెక్కేస్తున్నారు.  
  • పెట్టుబడుల ఆకర్షణ పేరుతో గత ప్రభుత్వం ఎంతోమంది సలహాదారులను ఏర్పాటు చేసి.. ప్రతి నెలా వారికి రూ.లక్షల్లో జీతభత్యాలు చెల్లించింది. సలహాదారులుగా వ్యవహరించిన వారు చేసిన పనులు ఏంటి? వారికి చెల్లించిన జీతాల మేరకు రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందా? కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలు ఎంత ఉన్నాయి.. వాటిని సంస్థ అభివృద్ధి కోసం వెచ్చించారా? ఇతర అవసరాల కోసం మళ్లించారా? తదితర ప్రశ్నలన్నింటికీ శ్వేత పత్రం ద్వారా సమాచారం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని