AP News: 7,092 కిలోమీటర్ల మేర.. రోడ్లు గుంతలమయం

జగన్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయినా.. వారి నిర్వాకం ఇంకా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. రహదారుల మరమ్మతులకు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఆయా పద్దుల కింద నిధులేవీ కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది.

Updated : 28 Jun 2024 05:05 IST

తక్షణం పూడ్చాలంటే రూ.283 కోట్లు అవసరం
ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించని జగన్‌ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయినా.. వారి నిర్వాకం ఇంకా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. రహదారుల మరమ్మతులకు ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఆయా పద్దుల కింద నిధులేవీ కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా వచ్చే నెలలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిధులు కేటాయించే వరకు గుంతలు పూడ్చటం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. వైకాపా ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా రోడ్లు అత్యంత అధ్వానంగా మారాయి. రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్న రోడ్ల వివరాలను ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు తాజాగా సిద్ధం చేశారు. 4,153 కి.మీ. గుంతలమయంగా ఉండటంతో వీటిని పూడ్చాల్సి ఉందని, 2,939 కి.మీ. భారీ గుంతలు ఉండటంతో ఆ ప్రాంతాల్లో 5-15 మీటర్ల మేర పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుందని గుర్తించారు. మొత్తంగా 7,092 కి.మీ.లలో గుంతలు లేకుండా చేయాలంటే రూ.283 కోట్లు అవసరమని నివేదిక రూపొందించారు.

నిధులు ఎలా?

రహదారుల మరమ్మతుల పనులకు బడ్జెట్‌లో.. సాధారణ మరమ్మతులు, ప్రత్యేక మరమ్మతులు అనే పద్దుల కింద నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఫిబ్రవరిలో గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఈ రెండు పద్దులకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఇపుడు 7,092 కి.మీ. మరమ్మతులు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా వీటికి నిధులు మంజూరు చేయడం సాధ్యంకాదని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించాక.. వెనువెంటనే పనులు చేసేందుకు వీలుంటుందని పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని