Ladakh Tank Accident: లద్దాఖ్‌ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు

లద్దాఖ్‌ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు.

Published : 01 Jul 2024 06:21 IST

పెడన, రేపల్లె అర్బన్‌-న్యూస్‌టుడే: లద్దాఖ్‌ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్‌కు 148 కి.మీ. దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్‌ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు.

నాలుగు రోజుల కిందట కుమార్తె పుట్టినరోజు వేడుకలను నాగరాజు వీడియోకాల్‌లో చూసి కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. అంతలోనే దుర్మరణం చెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన సుభాన్‌ఖాన్‌ (40) కూడా ప్రమాదంలో మృతి చెందారు. 17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరిన సుభాన్‌ఖాన్‌ అంచెలంచెలుగా హవల్దార్‌ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానిల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా కన్నుమూయడంతో కుటుంబసభ్యులతోపాటు స్వగ్రామం కైతేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జులై 7న స్వగ్రామానికి వచ్చేందుకు విమానం టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఇంతలో విషాదం చోటుచేసుకుంది. ఇస్లాంపూర్‌లో సుమారు వంద ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులుగా ఎంపికయ్యారు. వీరిలో కొందరు పదవీ విరమణ చేశారు. లద్దాఖ్‌ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలకు సోమవారం సైనిక, పోలీసు లాంఛనాలతో స్వగ్రామాల్లో అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని