Cholera: కలరా కలకలం..

గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Published : 04 Jul 2024 05:07 IST

80 గ్రామాల్లో కలుషిత నీటి ఘటనలు
గత వైకాపా సర్కారు నిర్లక్ష్యం ఫలితం

ఈనాడు, అమరావతి: గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 14 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది మార్చిలో గుంటూరు నగరంలో తొలుత రెండు కేసులు బయటపడ్డాయి. తరువాత క్రమంగా ఇతర జిల్లాల్లోనూ నమోదు కావడం మొదలైంది. చిత్తూరు జిల్లా కొలమాసినపల్లిలో 4, తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో రెండు, కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో 1, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో 4, విజయవాడ నగరం మొగల్రాజపురంలో ఒకటి చొప్పున కలరా కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కలుషిత నీటి కారణంగా డయేరియా కేసులూ పెరిగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇటీవల వరకు సుమారు రెండు వేల మంది అతిసారం బారినపడ్డారు. ఇవి కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో డయేరియా కేసులు 30 వేల వరకు రికార్డయ్యాయి. 

మురుగు నీటిలో పైపులైన్లు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మురుగు నీటిలోనే మంచినీటి పైపులు ఉంటున్నాయి. క్రమంగా వాటికి తుప్పుపట్టి రంధ్రాలు పడటంతో వాటిలో నుంచి మురుగు మంచినీళ్లలో కలిసి సరఫరా అవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం తాగునీరు సరఫరా విషయంలో బాధ్యతా రహిత్యంగా వ్యవహరించింది. పాడైన పైపులైన్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసినట్లయితే ఖర్చు కూడా తగ్గేది. కానీ.. స్థానిక సంస్థల వద్ద నిధులు లేనందున ఆ పనులు చేయలేదు. చివరికి పైపులు శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నిచోట్ల మురుగు కలిసిన నీరు కూడా రక్షితనీటిలో కలుస్తోంది. ఆ నీటినే స్థానికులు తాగి. అనారోగ్యం పాలవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని