Sonakshi Sinha-Zaheer Iqbal: డబుల్‌ ఎక్సెల్‌ ప్రేమ

ఒకరు ప్రశాంతతకు మారుపేరు... మరొకరు మాటల జలపాతం... ఒకరు టాప్‌ హీరోయిన్‌.. మరొకరు కెరియర్‌లో వెనకబడ్డ హీరో... ఇద్దరి నేపథ్యం సినిమానే. తెరపై ఒక్కసారే ప్రేమ పంచుకున్నా.

Published : 29 Jun 2024 01:08 IST

ఒకరు ప్రశాంతతకు మారుపేరు... మరొకరు మాటల జలపాతం... ఒకరు టాప్‌ హీరోయిన్‌.. మరొకరు కెరియర్‌లో వెనకబడ్డ హీరో... ఇద్దరి నేపథ్యం సినిమానే. తెరపై ఒక్కసారే ప్రేమ పంచుకున్నా.. తెర వెనక ఏడేళ్లుగా పీకల్దాకా ప్రేమించుకున్నారు. కడదాకా తోడుండాలని ఈమధ్యే పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ జంటే సోనాక్షి సిన్హా- జహీర్‌ ఇక్బాల్‌. వాళ్ల ప్రేమ ప్రయాణం కథాకమామీషు ఇది. 

  • బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చిన ఓ విందులో మొదటిసారి ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డారు. గుండెల్లో గిటార్లు మోగాయి. స్నేహం, పరిణయంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. 2017 నుంచి ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోంది. సంజయ్‌దత్‌ నిర్వహించిన ‘గార్బా’ వేడుకల్లో.. ముంబయి బాస్టియన్‌ రెస్టరంట్‌లో ఓ పెళ్లిలో.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్నేహితులతో కలిసి చిందేసిన వేడుకల్లో జంటగా కనిపించారు. అయినా వాళ్ల మధ్య ప్రేమ ఉందని బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
  • రెండేళ్ల కిందట ఇద్దరూ కలిసి ‘డబుల్‌ ఎక్సెల్‌’ చిత్రం చేశారు. ఆ సమయంలో మరింత సన్నిహితమయ్యారు. అప్పుడే ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిందనీ.. ఇద్దరి చేతివేళ్లకి ఒకేలాంటి ఉంగరాలు ఉన్నాయని గుసగుసలు వినిపించినా స్పందించలేదు. ఆపై సోనాక్షి కెరియర్‌లో దూసుకెళ్లగా.. జహీర్‌ వెనకబడ్డాడు. అయినా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ రోజురోజుకీ పెరుగుతూనే ఉండేది. 
  • చాలా సినిమాల్లో హీరోహీరోయిన్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. నిజ జీవితంలోనూ ఈ జంటకి అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. సినిమా అమ్మాయి వద్దని ఇక్బాల్‌ ఇంట్లో.. సంప్రదాయాలు వేర్వేరని సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హా ఒప్పుకోలేదని సోషల్‌మీడియాలో వార్తలొచ్చాయి. ఆ నిజానిజాలను పక్కన పెడితే.. ఏం మ్యాజిక్‌ చేశారోగానీ ఆఖరికి పెద్దల్ని ఒప్పించే ఒక్కటయ్యారు. 
  • ఇద్దరిలో ముందు ప్రపోజ్‌ చేసింది ఇక్బాల్‌నే. సోనూ రెండేళ్ల కిందటి పుట్టినరోజున ‘హ్యాపీ బర్త్‌డే సోన్జ్‌.. నన్ను చంపేంత ప్రేమ చూపిస్తున్న నీకు కృతజ్ఞతలు. ఐలవ్యూ..’ అంటూ తొలిసారి ప్యార్‌ని బహిర్గతం చేశాడు. తర్వాత ఆయుష్‌ శర్మ- అర్పితా ఖాన్‌ ఈద్‌ వేడుకలకు చేతిలో చేయేసుకొని వచ్చారు. ఇక్బాల్‌ చివరి పుట్టినరోజుకి ‘నా పర్సనల్‌ సైకో’ అంటూ ముద్దుగా పిలుస్తూ ఇద్దరూ ఉన్న ఫొటోని పంచుకోవడంతో, వాళ్ల మధ్య ఉన్నది ప్రేమేనని రూఢీ అయిపోయింది. 
  • ఇద్దరూ భిన్న మతాలకు చెందినవారు. అయినా ఒకరి మతాల్ని మరొకరు గౌరవించుకుంటారు. రెండు సంప్రదాయాలనూ పాటిస్తారు. ‘మతం వ్యక్తిగతం. సోనాక్షి ఎలాంటి సంప్రదాయాలు పాటించాలన్నది ఆమె ఇష్టం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మమ్మల్ని ఒక్కటి చేసింది’ అంటూ పెళ్లికి ముందు ప్రకటించాడు జహీర్‌. పెళ్లి కూడా హిందూ-ముస్లిం సంప్రదాయాల ప్రకారం కాకుండా.. అత్యంత సన్నిహితుల సమక్షంలో స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ ప్రకారం రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు. 
  • పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఐ7 కారును బహుమతిగా ఇచ్చాడు జహీర్‌. వాళ్లది సంపన్న కుటుంబం. ముంబయిలో నగల వ్యాపారం చేస్తారు. సల్మాన్‌ఖాన్‌ కుటుంబానికి చాలా దగ్గర. జహీర్‌ నాన్న ఇక్బాల్‌ రతన్సీని ‘నా పర్సనల్‌ బ్యాంక్‌’ అంటుంటాడు సల్మాన్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని