మరదలి తీరు.. బావ బేజారు

బావామరదళ్ల ప్రేమకు వారధిగా నిలిచిన ఫోనే.. అంతులేని అనుమానాలకూ తావుగా మారింది.

Updated : 29 Jun 2024 06:39 IST

బావామరదళ్ల ప్రేమకు వారధిగా నిలిచిన ఫోనే.. అంతులేని అనుమానాలకూ తావుగా మారింది. మరి ఆ అనుమాన భూతాన్ని తరిమేయడానికి ఆ బావ ఏం చేశాడు?
అది కరోనా విజృంభిస్తున్న కాలం. కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. నాలుగు గోడల మధ్యే రోజంతా ఫోన్‌తోనే కాలక్షేపం. నేస్తాలు, బంధువులందరికీ మెసేజ్‌లు పెట్టేవాడిని. కాల్స్‌ చేసేవాడిని. అలా చేసి, మర్చిపోయిన కొద్దిరోజులకి ‘ఎవరు?’ అని ఒక మెసేజ్‌. తను మా దూరపు బంధువుల అమ్మాయనీ.. వరుసకు మరదలు అవుతుందనీ నాకు తెలుసు. ఆ విషయం తనకి చెప్పి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. నా పుట్టుపూర్వోత్తరాలు, చిన్నప్పుడు మేం ఓ ఫంక్షన్‌లో కలిసిన గురుతులు చెబితేగానీ తను నమ్మలేదు. అలా మా పరిచయం నెమ్మదిగా పట్టాలెక్కినా త్వరగానే పరుగులు పెట్టింది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు.. సినిమా సంగతులు.. కాలేజీ అనుభూతులు అన్నీ పంచుకునేవాళ్లం. ఎప్పుడూ ఫోన్‌లు.. అప్పుడప్పుడు కలుసుకోవడాలు మామూలే అయ్యింది. ఒకర్నొకరం పూర్తిగా చదివేసుకున్నాం అనుకున్నాక.. ఓ శుభసమయాన నా మనసులో మాట తనకి చెప్పేశా. బెట్టు చేయకుండా తనూ ‘ఐ టూ లవ్యూ’ అంది. 

నచ్చిన చిన్నది ఓకే అన్నాక జిందగీ కలర్‌ఫుల్‌గా మారిపోతుందని కలలు కన్నా. కానీ అక్కడినుంచే సీన్‌ రివర్స్‌ అయ్యింది. తన తీరు నన్ను ఆకాశం నుంచి నేలకి దించింది. ఆమె ఫోన్‌ చేసినప్పుడు నా ఫోన్‌ ఎప్పుడైనా బిజీ వస్తే ఇరిటేట్‌ అయ్యేది. ‘ఎవరితో మాట్లాడుతున్నావ్‌?’ అని నిలదీసేది. ‘ఫ్రెండ్‌’, ‘ఆఫీసు పని’.. ఏం చెప్పినా వినదే! నాకు ఇంకెవరో ఉన్నారనేది. నేను మాట్లాడిన ప్రతి కాల్‌ హిస్టరీ, వాట్సాప్‌ చాట్‌.. స్క్రీన్‌షాట్‌ తీసి పంపమనేది. తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో.. ఎప్పుడు బాంబు పేల్చుతుందో తెలీక టెన్షన్‌తో గుండెలదిరిపోయేవి. ఎంత ఇష్టపడ్డ అమ్మాయైతే మాత్రం.. ఇలా చేయడం ఎవరికి నచ్చుతుంది? నేనూ కసురుకునే వాడిని. ఓరోజైతే మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేసింది. వస్తూనే నా ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ తెరిచింది. అందులో నేను ఇద్దరు అమ్మాయిలతో చనువుగా చేసిన మెసేజ్‌లు చూసింది. ‘ఎంత క్లోజ్‌ కాకపోతే మరీ ఇంత సన్నిహితంగా మాట్లాడుకుంటారా?’ అని నిలదీసింది. నిజానికి తను చెబుతున్నట్టు వాళ్లతో క్లోజ్‌గా మాట్లాడింది ఏమీ లేదు. పైగా అందులో ఒకమ్మాయి నాకు చెల్లి వరుస, మరొకరు ఫ్రెండ్‌. అదే మాట చెప్పినా వినలేదు. అప్పట్నుంచి నా ఫోన్‌ ఎంగేజ్‌ వచ్చినా.. నేను ఆన్‌లైన్‌లో ఉన్నా.. ‘వాళ్ల కోసమే కదా.. వాళ్లతోనే చాట్‌ చేస్తున్నావ్‌ కదా?’ అంటూ గోల.

మొదట్లో తను నాపై ఎంతో ప్రేమ చూపించేది? ఇప్పుడేమో మాట్లాడితే గొడవలు, గిల్లికజ్జాలు. నాకు పిచ్చెక్కిపోయేది. ఏ ఫోన్‌ అయితే మా ఇద్దరిని కలిపిందో.. ఆ ఫోన్‌ని చూస్తేనే నాకు విరక్తి కలిగేది. అయినా తనని వదిలి ఉండటం నావల్ల కాదని నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితం తనతోనే అని ఎప్పుడో ఓ నిర్ణయానికొచ్చేశా. సో.. ఆమె ప్రేమ దక్కాలి.. అనుమానాలకు, అపార్థాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. అందుకో మార్గం ఆలోచించా. ఓరోజు ఆదివారం నేరుగా తనని ట్యాంక్‌బండ్‌ దగ్గరికి రమ్మన్నా. తనతోపాటు తను అనుమానిస్తున్న ఆ ఇద్దరు అమ్మాయిల్నీ పిలిపించా. వాళ్లు నాతో ఉన్న రిలేషన్‌ ఏంటో తనకి వివరించారు. ఒకమ్మాయి నన్ను సొంత అన్నయ్యలా భావిస్తున్నానంది. ఇంకోకామె మా స్నేహం, నాలోని పాజిటివ్స్‌ చెప్పింది. అప్పుడుగానీ మరదలు మనసు శాంతించలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి నన్ను హత్తుకుంది. తన అనుమానం అనే పెనుభూతాన్ని అక్కడే హుస్సేన్‌సాగర్‌లో కలిపేశాం. ఒకరి చేయి మరొకరం వీడకుండా ఆ సాయంత్రం ప్రేమపక్షుల్లా విహరించాం. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్నాం. ప్రతి బంధంలో సమస్యలుంటాయి. మనల్ని పరీక్షిస్తుంటాయి. వాటికి సమాధానాలు ఇస్తూ.. సందేహాలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ ముందుకెళ్తేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. - రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని