మైదానం మహాలక్ష్మి...

మా గల్లీలో పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడుతున్నప్పుడు మొదటిసారి నిన్ను చూశాను. అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం అందంగా ముస్తాబు చేసిన మైదానంలా మెరిసిపోతూ కనిపించావు. నీ అందానికి అప్పుడే నా గుండె క్లీన్‌బౌల్డ్‌ అయ్యింది.

Published : 11 May 2024 00:06 IST

వెరైటీ ప్రేమలేఖ

మా గల్లీలో పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడుతున్నప్పుడు మొదటిసారి నిన్ను చూశాను. అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం అందంగా ముస్తాబు చేసిన మైదానంలా మెరిసిపోతూ కనిపించావు. నీ అందానికి అప్పుడే నా గుండె క్లీన్‌బౌల్డ్‌ అయ్యింది. నీ చిరునవ్వుకు నేను పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. అప్పట్నుంచి నిన్ను చూసిన ప్రతిసారీ స్ట్రైట్‌ డెలివరీలా నీ దగ్గరికే రావాలనిపించేది. కానీ నన్ను ఎక్కడ బ్లాక్‌ చేస్తావో అని వైడ్‌లా దూరంగా వెళ్లిపోయేవాడిని. నువ్వు కాస్త ఓరగా చూస్తే ఇన్‌స్వింగర్‌లా నిన్ను హత్తుకోవాలి అనిపించేది. కళ్లెర్రజేస్తే.. ఔట్‌స్వింగర్‌లా ఎడంగా ఉండిపోయేవాడిని. నిజం చెబుతున్నా.. నీపై నా ప్రేమ భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ఉన్నంత క్రేజ్‌లా గాఢమైంది. నా మనసులో మాటని ఏదో ఒకరోజు యార్కర్‌లా సూటిగా చెప్పాలని ఉంది. అయితే ఓ బౌలర్‌కు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ ఎంత ముఖ్యమో.. నీకు నేను ప్రపోజ్‌ చేసే టైమింగ్‌ అంతే ముఖ్యమైనదని భావిస్తున్నా. ఐపీఎల్‌లో అదగొట్టిన ఆటగాడు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూసినట్టు వేచి చూస్తున్నా. నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటే త్వరలోనే బ్రహ్మచారి జీవితాన్ని డిక్లేర్‌ చేసి, సంసారిగా మారిపోతా. ఈడెన్‌ గార్డెన్‌లాంటి వేదికలో.. కిక్కిరిసిన ప్రేక్షకులలాంటి అతిథుల సమక్షంలో మనం మ్యాచ్‌ ఫిక్స్‌ చేసుకుందాం. ఇద్దరం కలిసి జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిద్దాం. నువ్వు నా ప్రతిపాదనకు ఒప్పుకుంటే బ్యాట్‌మన్‌ తలకు హెల్మెట్‌లా.. కాళ్లకు ప్యాడ్స్‌లా.. చేతులకు గ్లౌజులా నిత్యం నిన్ను కాపాడుకుంటా. నీ నిర్ణయాలను సమీక్షించే రివ్యూనవుతా. జీవితాంతం నీ తోడుగా ఉంటూ, నిన్ను రనౌట్‌ కాకుండా చూసుకుంటా. దయచేసి నీ నిర్ణయాన్ని టెస్ట్‌మ్యాచ్‌లా నాన్చకుండా.. సూపర్‌ ఓవర్‌లో ఫలితం వచ్చే మ్యాచ్‌లా తేల్చేస్తావని ఆశిస్తున్నా.

ఇట్లు
సిక్సర్ల శివ

ఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌, ఒంగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు