The Ocean: అనంతం అద్భుతం సముద్రం

‘సాగర స్సాగరోపమః’ అన్నాడు వాల్మీకి మహర్షి. సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంత. అంతే! కాదూ కూడదంటే జీవితమంత! అవును.. సముద్రానికి, జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, సంక్లిష్టమైందో, ఆహ్లాదమైందో, ఆనందదాయకమైందో.. సాగరం కూడా అంతే.

Published : 06 Jun 2024 00:15 IST

జూన్‌ 8 సాగర దినోత్సవం

‘సాగర స్సాగరోపమః’ అన్నాడు వాల్మీకి మహర్షి. సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంత. అంతే! కాదూ కూడదంటే జీవితమంత! అవును.. సముద్రానికి, జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, సంక్లిష్టమైందో, ఆహ్లాదమైందో, ఆనందదాయకమైందో.. సాగరం కూడా అంతే.

సముద్రం.. అపురూపం, అనంతం, అద్భుతం. కష్టానికీ, పట్టుదలకూ ప్రతిఫలాన్ని ముట్టజెబుతుంది. కష్టపడినవారికి ఆహారాన్ని ఇస్తుంది. ఇంకాస్త లోనికెళ్లి శ్రమిస్తే ముత్యాలు, రత్నాలు మొదలైన వాటిని అందిస్తుంది. నిలబడి చూస్తే.. ఒరిగేదేమీ లేదు. జీవితమూ అంతే. అందరికీ ఒకటే. మన కృషి, పట్టుదల, సామర్థ్యాలను బట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత. వ్యర్థ కాలయాపన నిష్ఫలమని సముద్రం స్పష్టంగా తెలియజేస్తుంది.

లాలిస్తుంది.. కబళిస్తుంది..

మన ఊహలు, వాస్తవాలు, అనుభవాలు, అనుభూతులు, ఆహారం, ఐశ్వర్యం.. అన్నిటికీ ఆలవాలం సముద్రం. తత్వవేత్తలు, పండితుల పరిభాషలో దుఃఖసముద్రం, ఆనందసముద్రం, ఆశలసముద్రం, విషాదసముద్రం, శాంతసంద్రం, క్రోధజలధి, సంసారసాగరం, నిశ్శబ్దసంద్రం, విప్లవసముద్రం- ఇలా ఉద్వేగపరంగా సముద్రం సహస్రముఖి. తనను ఆశ్రయించిన వారిని అమ్మలా లాలించడమే కాదు ఆగ్రహించినప్పుడు అమ్మవారిలా కబళించనూ గలదు.

కళ్ల ముందున్నా అందుకోలేడు..

చంద్రుడు సముద్ర తనయుడు. తండ్రి గుణాలైన వృద్ధి, క్షీణతలు చంద్రుడికీ సంక్రమించినందునే శుక్ల, బహుళ పక్షాలు- అనేది శ్రీనాథుని ఊహ. నిండు పున్నమిరోజు పండువెన్నెల వెదజల్లుతున్న బిడ్డను అందుకోవాలని అలల చేతులతో ఎగసిపడే సముద్రుడికి నిరాశ మిగులుతుందే కానీ అందుకోలేదు. ‘ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః.. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం పుట్టాయి’ అంటూ సృష్టిక్రమాన్ని చెబుతోంది వేదం. అలా చూసినప్పుడు జలరూపమైన సముద్రానికి జన్మనిచ్చింది అగ్ని. తనను కన్న అగ్నినే రూపుమాపు తుంది జలం. అంటే సముద్రం మాతృహంతకి. అంత ద్రోహం చేసినందునే కళ్ల ముందున్న కన్నబిడ్డను అందుకోలేకపోయింది సాగరం- అంటారు గరికపాటి వంటివారు.

అర్థం అంతరార్థం

పౌరాణిక గాథల్లో కొన్ని నేరుగా, ఇంకొన్ని ప్రతీకాత్మకంగా, నిగూఢంగా ఉంటాయి. ఆ కథల్లో- జీవుల పుట్టుక, మనుగడ వంటి సృష్టి రహస్యాలు, కర్తవ్య నిర్వహణ, నెరవేర్చాల్సిన బాధ్యతలు.. ఇలా ఎన్నో అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. వాటిని గ్రహించగలిగితే శ్రేయోదాయకం. పుక్కిటి పురాణాల్లా భావించి, వదిలేస్తే నష్టపోయేది మనమే. ఈ నేపథ్యంలో సప్తసముద్రాల భావనను అర్థం చేసుకున్నప్పుడు అందులో దాగి ఉన్న జ్ఞానానికి ముక్కున వేలు వేసుకోవాల్సిందే! పురాణేతిహాసాలను అనుసరించి- లవణ (ఉప్పు), ఇక్షు (చెరకురసం), సురా (మద్యం), ఘృత (నెయ్యి), దధి (పెరుగు), క్షీర (పాలు), శుద్దోదక (మంచినీరు) అంటూ ఏడు సముద్రాలున్నాయి. కానీ మనకు తెలిసింది ఉప్పుసముద్రం మాత్రమే. తక్కిన వాటిని ఎందుకు ప్రస్తావించారో, అందులో ఉన్న అంతరార్థమేమిటో గ్రహించేందుకు ప్రయత్నించాలి.

శరీరంలో సప్తసముద్రాలు

సప్త సముద్రాల భావన శరీరానికి సంబంధించింది. ఆరోగ్యం, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకలివి. మనకు సప్త సముద్రాల్లా సప్త ద్వీపాలూ ఉన్నాయి. లవణసముద్రం జంౠద్వీపంలో, ఇక్షుసముద్రం ప్లక్షద్వీపంలో, సురాసముద్రం శాల్మలీద్వీపంలో, నేతిసంద్రం కుశద్వీపంలో, పెరుగు సముద్రం శాకద్వీపంలో, పాలసముద్రం క్రౌంచద్వీపంలో, మంచినీటి సముద్రం పుష్కరద్వీపంలో ఉంటాయన్నది రుషివాక్యం.

ఈ సప్తసముద్రాలు మన శరీరంలో సప్తద్రవాల రూపంలో కొలువై ఉంటాయి. లవణసముద్రం మూత్రజల రూపంలో, ఇక్షుసముద్రం స్వేదజల రూపంలో, సురాసముద్రం శుక్రద్రవ రూపంలో, ఘృతసముద్రం మోహద్రవ రూపంలో, దధిసముద్రం పైత్యరస రూపంలో, క్షీరసముద్రం అశ్రుజల రూపంలో, శుద్ధోదకసముద్రం లాలాజల రూపంలో నిక్షిప్తమై మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంటాయి. అర్థం చేసుకోలేని గిరీశాలకు హాస్యాస్పదంగా కనిపించే సప్తసముద్రాల వెనక ఇంత కథ ఉంది.

అన్నీ సంకేతాలే!

సప్త సముద్రాలను శాస్త్రపరంగా శరీరానికి సమన్వయించుకుంటే లవణసముద్రం జంబుద్వీపంలో ఉన్నట్లు మన శరీరంలో మూత్ర రూపంలో ఉంటుంది. జంబూఫలం అంటే నేరేడుపండు. ఇది మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధం. అలానే స్వేద సంబంధి రుగ్మతలకు ప్లక్ష (జువ్వి), శుక్ర సంబంధికి శాల్మలీ (బూరుగ), మోహద్రవ సంబంధికి కుశ (దర్భ), పైత్యరస సంబంధికి శాక (టేకు), లాలాజల సంబంధికి పుష్కరం (బ్రహ్మ కమలం, శంకు పుష్పం) ఔషధాలుగా పనిచేస్తాయి. అంటే సముద్రాలు, ద్వీపాల పేర్లలో సంకేతం దాగి ఉంది.

దత్తాత్రేయుని పదో గురువు సముద్రం

అనేక నదులు చేరినా సముద్రం పొంగిపొర్లదు. నదీజలాలు రాకున్నా ఎండిపోదు. నీటిమట్టం స్థిరంగా ఉంటుంది. ఎల్లలు దాటదు. ఆనందాలకు పొంగిపోకుండా, కష్టాలకు కుంగిపోకుండా, నైతికతను అతిక్రమించకపోవడం, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సముద్రంలా స్థిరంగా, గంభీరంగా ఉండే తత్వాన్ని నా పదో గురువైన సముద్రం నుంచే నేర్చుకున్నాను... అన్నాడు దత్తాత్రేయ స్వామి.

లంకా నగరానికి దారిమ్మని సముద్రుని ప్రార్థించాడు భగవత్‌ స్వరూపుడైన శ్రీరాముడు. కానీ సముద్రుడు దారివ్వలేదు. ధర్మకార్య సాధనకు ఆటంకమని ఆగ్రహించి, రాముడు విల్లు ఎక్కుబెడితే.. మార్గాంతరాన్ని సూచించాడే కానీ తన నియమాన్ని ఉల్లంఘించలేదు. అదే సమయంలో ధర్మాన్ని పరిరక్షించేందుకు తన మీదుగా ప్రయాణించిన రామదండును లాలించి, గమ్యం చేర్చిన ఉన్నత వ్యక్తిత్వం సముద్రుడిది. విష్ణుమూర్తి తొలి అవతారమైన మత్స్యానికి ఆశ్రయం కల్పించిందీ, మర్రి ఆకుపై శయనించిన వటపత్ర శాయిని పొత్తిళ్లలో బిడ్డలా అక్కున చేర్చుకున్నదీ సముద్రమే.

రామాయణంలో హనుమంతుడు లక్ష్యసాధనకు గొప్ప నిదర్శనం. సీతాన్వేషణలో సముద్రాన్ని లంఘించబోయాడు. ఆ సమయంలో ఆతిథ్యాన్ని స్వీకరించమంటూ మైనాకుడు సాత్విక ఆటంకాన్ని, తనను గెలిస్తేనే కానీ ముందుకు వెళ్లలేవంటూ సురస రాజస ఆటంకాన్ని, సంహరిస్తానంటూ ఛాయాగ్రాహి తామస ఆటంకాన్ని కలిగించారు. అన్నిటినీ అధిగమించి ఏకాగ్రతతో ముందుకు దూసుకువెళ్లాడు హనుమ.

త్రేతాయుగంలో రామచంద్రమూర్తి రావణసంహారం కోసం చేసిన ప్రయాణంలో, ద్వాపర యుగంలో ద్వారక రక్షణలో, పతనంలో సముద్రుని ఆగ్రహ, అనుగ్రహాలు అనేకం. ఇలా.. సముద్రం గురించిన విషయాలు ఎన్ని చెప్పినా తరగవు. అవి సముద్రంలా అనంతం.    


హృదయంలో దేవుడు..

క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలు స్వచ్ఛతకు ప్రతీక. అది వైకుంఠంలో ఉంటుంది. అందులో తరంగాలు ఉండవు. విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ‘కుంఠం’ అంటే నిరాశానిస్పృహలు. ‘వికుంఠం’ అంటే అందుకు విరుద్ధం. వికుంఠ వాతావరణం కలిగింది వైకుంఠం. సాగరంలో ఉండే తరంగాలు ఆలోచనలకు ప్రతీక. కానీ విష్ణుమూర్తి కొలువైనందున పాలసముద్రంలో నిరాశ నిస్పృహలు, ఆలోచనల అలలు ఉండవు. తత్త్వపరంగా చూసినప్పుడు.. స్వచ్ఛమైన హృదయం క్షీరసాగరం వంటిది, అందులో భగవంతుడు కొలువై ఉంటాడని అర్థం.


క్షీరసాగర మథనం దేనికి చిహ్నం..

మనసు అనేది మహాసముద్రం. మంథర పర్వతం ఏకాగ్రత. తాబేలు లక్ష్యసాధనకు ఆధారం. వాసుకి లక్ష్యం దిశగా నడిపించే సాధనం. ఎదురైన కష్టనష్టాలను స్వీకరిస్తూనే అంటనట్లుగా ఉండటం హాలాహలం. లక్ష్యాన్ని దూరంచేసే ప్రలోభం మోహిని. ఈ సూత్రాన్ని అర్థంచేసుకుని.. కృషి, పట్టుదలతో సాగాలి. అప్పుడిక అనుకున్నది సాధించి, అమృతాన్ని అందుకుంటాం.

డా.కరుణశ్రీ, నెల్లూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని