జీవితానికి యోగబలం

మానవాళికి పతంజలి ప్రసాదించిన అద్భుత వరం యోగ విజ్ఞానం. మనిషిలో రుగ్మతలు తొలగించి ఆనందతీరాలకు చేర్చే అత్యుత్తమ మార్గం యోగ మార్గం. యోగాభ్యాస అంతిమ లక్ష్యం మనసుపైనే కాదు శరీరంపై పట్టుసాధించటం.

Published : 20 Jun 2024 00:40 IST

రేపు యోగా దినోత్సవం

మానవాళికి పతంజలి ప్రసాదించిన అద్భుత వరం యోగ విజ్ఞానం. మనిషిలో రుగ్మతలు తొలగించి ఆనందతీరాలకు చేర్చే అత్యుత్తమ మార్గం యోగ మార్గం. యోగాభ్యాస అంతిమ లక్ష్యం మనసుపైనే కాదు శరీరంపై పట్టుసాధించటం.

ఆధ్యాత్మిక పురోగతి కూడా యోగఫలమేనని ఎందరో సాధకులు నిరూపించారు. దేహం, మనసు, భావోద్వేగాలను సమన్వయపరచటమే యోగ లక్ష్యం. అది పారమార్థిక ఉన్నతికి కూడా తోడ్పడుతుంది. 
పతంజలి ప్రతిపాదించిన అష్టాంగ యోగంలో యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేవి ప్రధాన అంశాలు. ఇది ఆహార, విహార నియమాలతో, ఇంద్రియ నిగ్రహంతో సాగించాల్సిన సాధన. అలాగే ఆనంద పారవశ్య రహస్యమంతా యోగంలోనే ఉందని యోగసాధకులు నిర్ధరించారు. ‘యోగంతో మనోదోషాలను, వ్యాకరణంతో శబ్దదోషాలను, ఆయుర్వేదంతో శరీరదోషాలను తొలగించిన మునిపుంగవుడైన పతంజలికి అంజలి ఘటిస్తున్నాను’ అంటూ మహర్షికి వందనాలు చెల్లించుకుంటారు. 

యమనియమాల ద్వారా చెడు ఆలోచనలు, ప్రేరణలను నియంత్రించటం, సదాలోచనల దిశగా మనసును మరలించటం, మంచి అలవాట్లను అలవరచుకోవటం సాధ్యపడుతుంది. ఆసన, ప్రాణాయామాల ద్వారా దీర్ఘకాల ధ్యానానికి కావలసిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను అభ్యసించవచ్చు. ప్రత్యాహార ధారణల ద్వారా విషయ లోలత్వం కలిగించే వస్తువులపై నుంచి ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నిరంతర ధ్యానంతో మనసును ఆత్మలో లయం చేయటం సాధ్యమవుతుంది. 

ఇది అనాది ‘యోగ’ం

వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగవాశిష్టం, పతంజలి యోగసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ‘యోగ’ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.పూ.3000 నాటి సింధులోయ నాగరికతలో యోగ సంప్రదాయానికి చెందిన ఆనవాళ్లు లభించాయంటారు. భగవద్గీతలో యోగ సంప్రదాయంపై సాధికారిక వ్యాఖ్యానాలున్నాయి. స్వామి వివేకానంద 1893లో అమెరికా పర్యటన సందర్భంగా వెలువరించిన ప్రసంగాల్లో యోగవిద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ‘వీరోచిత కార్యం, తొణికిసలాడే జీవకళ, ఆశావహ దృక్పథం, ఆరోగ్యలక్షణాలు, సద్గుణ ప్రకాశం ఇవన్నీ శక్తికి సంకేతాలు. అందుకే మనం ఉన్నంత వరకూ దేహం, మనసు దృఢంగా ఉండాలి’ అన్నారాయన. ఇలాంటి ప్రసంగాలతో ఆయా దేశాల్లో యోగసాధనల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత పరమహంస యోగానంద వంటి ఆధ్యాత్మిక గురువులు విదేశాల్లో యోగాను విస్తృతంగా ప్రచారం చేశారు.

శాశ్వత స్వస్థత

‘యోగం’ అంటే సంస్కృతంలో లయం అని అర్థం. అంటే భగవంతుడిలో లయమవ్వాలి. అది యోగసాధనల లక్ష్యమని పతంజలి మహర్షి ఉద్ఘాటించారు. అందుకే యోగాభ్యాసం శరీరంతో ఆరంభమై మనసుతో కొనసాగి, చివరికి ఆత్మలో.. అంటే భగవంతుడితో అంతం కావాలి. తొలుత యోగసాధనతో మనిషికి శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుంది. తుదకు ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యపడుతుంది. అందుకే ముందు శరీరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే 200 పైచిలుకు ఆసనాలు, భంగిమలు, శ్వాసక్రియల్ని పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో ప్రస్తావించారు. యోగాసనాలు ఎన్నో రుగ్మతల్ని రూపుమాపుతాయని వివరించారు మహర్షి. ఉదాహరణకు సుఖాసనం, పద్మాసనం, సిద్ధాసనాలు ఆధ్యాత్మిక సాధనలకు ఉపకరిస్తాయని ఎందరో సాధకులు నిరూపించారు. 

జ్ఞానార్జనకూ దోహదం 

జ్ఞానాన్ని ఆర్జించటంలో యోగాభ్యాసం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థి దశలో ఆరోగ్యం, చురుకుదనమే కాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. యువతీయువకుల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలకు యోగసాధన తరుణోపాయాన్ని చూపుతుంది. అయితే మనలో చాలామంది ఆసనాలు మాత్రమే యోగాభ్యాసమని భ్రమపడుతుంటారు. నిజానికి నియమాలను పాటించడం, క్రమశిక్షణ, మనసును ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్లడం, ఏకాగ్రత- ఇవన్నీ యోగాలో భాగమే.

సాధకులు మూడు రకాలు

యోగసాధకులు మూడు రకాలుగా ఉంటారని మహర్షులు నిర్ధరించారు. అత్యున్నత ఆధ్యాత్మిక ఫలాల కోసం యోగమార్గాన్ని అనుసరించేవారు మొదటిరకం. వీరి లక్ష్యం మోక్షప్రాప్తి. రెండో రకం వారికి శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవటమే ప్రధానం. ఇక మూడో రకం వారు మానసిక, శారీరక రోగ నివారణ కోసం యోగాసనాలు వేస్తారు. తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందటమే వీరి లక్ష్యం. 

తరిగొండ వెంగమాంబ రచనల్లో యోగా

తిరుమల శ్రీవేంకటేశ్వరుని పరమభక్తురాలైన తరిగొండ వెంగమాంబ కావ్యాల్లో యోగాసనాల ప్రస్తావన కనిపించడమే కాదు.. యోగవిద్యకు సంబంధించిన అనేక విశేషాలు కనిపిస్తాయి. ‘అష్టాంగయోగసారం’ అనే కావ్యం కూడా రచించింది. అందులో గోముఖాసనం, కూర్మాసనం, కుక్కుటాసనం- ఇలా అనేక ఆసనాల గురించి వివరించింది. బాల్యంలో సుబ్రహ్మణ్య యోగి నుంచి యోగసిద్ధిని, జ్ఞానాన్ని పొందింది. తరిగొండ నృసింహాలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక రహస్యంగా యోగసాధన చేసేదట. బ్రహ్మవిద్యకు, యోగశాస్త్రానికి పరస్పర సంబంధం ఉందని స్పష్టం చేసిందామె. 
తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు, యోగులు ఇంద్రియ విషయాల నుంచి మనసును మరల్చుకుని అంతర్ముఖులు కావాలి. ఆ స్థితికి చేరినప్పుడు.. గాలికి రెపరెపలాడే దీపంలా కాకుండా స్థిరంగా ఉంటుంది మనసు. యోగాభ్యాసం చేసేవారు నిత్యం ప్రశాంతంగా కనిపిస్తారు. కర్మయోగి, భక్తియోగి, రాజయోగి, జ్ఞానయోగి.. అందరూ కూడా నిశ్చలంగా ఉంటారు. ఉద్వేగాలకు లోనవక, ప్రలోభాలకు లొంగక మనసును ఆ సర్వేశ్వరుడిపై లగ్నంచేసి ఉంచటం యోగి లక్షణం. మానసికంగా, శారీరకంగా తనను తాను ఉద్ధరించుకునేవాడు అసలైన యోగి అని నిర్వచించింది భగవద్గీత. అందువల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు కలగలసిన యోగసాధనకు ఉపక్రమిద్దాం. ఆ మార్గంలో పురోగమిస్తూ ఆనందతీరాలకు చేరుకుందాం! 
చైతన్య


మానసిక ప్రశాంతత

మనలోని అంతర్గత శక్తి స్రవంతులను, అతీంద్రియ కేంద్రాలను తెరవగలిగే శారీరక భంగిమలే ఆసనాలు. ఇవి శారీరక, మానసిక స్థితిని తెలియజేస్తాయి. వీటివల్ల బాధ, ఒత్తిడి, ఆందోళనలను అధిగమించే అవకాశం కలుగుతుంది. మనసును శాంతపరిచి సమతుల్యత సాధించటానికి యోగాభ్యాసం ఉపకరిస్తుంది. 


యోగా తమకెందుకన్నవిదేశీయుడు

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ యోగా దినోత్సవం సందర్భంగా యురోపియన్‌ పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారు. ఓ సభ్యుడు లేచి- ‘యోగా హిందూమత సంప్రదాయం కదా! అన్య మతస్థులమైన మేమెలా ఆమోదించి, అభ్యసించి, అనుసరించగలం?’ అనడిగాడు. అప్పుడు రవిశంకర్‌ ‘ఇది భారతీయ మతం కాదు, ధర్మం. జీవనవిధానం. మత విశ్వాసాలతో దీనికి సంబంధం లేదు. ‘చైనీయుల ఆహారం’ తింటే చైనా దేశస్థుడిగా, బీతోవన్‌ సంగీతాన్ని వింటే జర్మన్‌ దేశస్థుడిగా మారం కదా! ఇతర దేశాల ఆహారాన్నీ, సంగీతాన్నీ గౌరవించి, స్వీకరించ గలిగినప్పుడు.. ఒత్తిడి లేని జీవితం కోసం, జ్ఞానాన్నీ, జీవననైపుణ్యాన్నీ అందించే ఈ విధానాన్ని ఎందుకు స్వీకరించకూడదు?!’ అంటూ జవాబిచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని