నలుగురూ కలిసి నడుస్తూ..నాగలికి నమస్కరిస్తూ..

‘ఏరు’ అంటే నాగలి అని అర్థం. ఏరువాక అంటే నాగలితో దుక్కి దున్నటం. వ్యవసాయ ప్రారంభ ఉత్సవం అన్నది స్థూలార్థం. ఈ పండుగ వెనుక భారతీయ అంతరాత్మ దాగి ఉంది.

Published : 20 Jun 2024 00:40 IST

జూన్‌ 21 ఏరువాక పూర్ణిమ

‘ఏరు’ అంటే నాగలి అని అర్థం. ఏరువాక అంటే నాగలితో దుక్కి దున్నటం. వ్యవసాయ ప్రారంభ ఉత్సవం అన్నది స్థూలార్థం. ఈ పండుగ వెనుక భారతీయ అంతరాత్మ దాగి ఉంది. కృతజ్ఞత, సర్వభూతదయ అనేవి మన సంప్రదాయంలో ప్రధాన లక్షణాలు. వాటిని వ్యక్తంచేసే విశిష్ట పర్వదినం ఏరువాక. వ్యవసాయం వెన్నెముకగా ఉన్న మనదేశంలో వేదకాలం నుంచి ఇది ఆచరణలో ఉన్నట్లు కనిపిస్తుంది. నాగలికి నమస్కరిస్తూ, నలుగురూ కలిసి నడిచే పండుగ కనుకనే దీనికింత ప్రాధాన్యత చేకూరింది.

భూతదయకు నిదర్శనం

ఏరువాక పున్నమి రోజున ఎడ్లను శుభ్రంగా కడిగి; వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి; మెడకు, కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత కాడిని (బండిని లాగటానికి ఎడ్ల మెడ మీద మోపే అడ్డకొయ్య), నాగలిని కడిగి రంగులు అద్దుతారు. వివిధ పూలతో అలంకరిస్తారు. ఎడ్లకు, నాగలికి, భూమాతకు పూజ చేసి.. ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. ఎడ్లకు పొంగలిని, బొబ్బట్లను పెడతారు. అలాగే వాటికి వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందులను తాగిస్తుంటారు. ఇలా పాయసాన్నాలు, పిండివంటలు పెట్టటం, ఆరోగ్యపరిరక్షణకు మందులివ్వటం వెనుక వాటిని పశువులుగా తక్కువగా చూడక, సర్వభూతదయను కలిగి ఉండాలనే భారతీయ ధర్మం కనిపిస్తుంది. ఆ తŸర్వాత కాడిని, నాగలిని భుజాన ధరించి, ఎడ్లను తీసుకుని.. మంగళ వాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్తారు. భూమాతకు నమస్కరించి ఆ సంవత్సరానికి తొలిగా భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని రైతన్నల నమ్మకం.

జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది..

ఏరువాక పున్నమి రోజునే వ్యవసాయ పనులను ప్రారంభించటానికి కారణం ఒకటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం- జ్యేష్ఠ నక్షత్రం వేళ పొలంలో నాగలి సారించి పనులు ప్రారంభిస్తే ఆ సంవత్సరమంతా వ్యవసాయం అన్ని విధాలా బాగుంటుందంటారు. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తుందని రైతన్నల విశ్వాసం. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు.

ఏరువాక పూర్ణిమను సంస్కృతంలో సీతాయజ్ఞం, ఉద]్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని అంటారు. వేద కాలంలో ప్రతి పనినీ యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుడిని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాలు చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు తదితర మహర్షులు ఎందరో ఈ పండుగ విశిష్టత గురించి ప్రస్తావించారు.

విష్ణు పురాణంలో సీతాయజ్ఞం అంటూ ఏరువాక గురించిన ప్రస్తావన ఉంది. ఇందులో సీత అంటే నాగలిచాలు అని అర్థం. ‘వప్ప మంగళ దివసం, బీజవాపన మంగళ దివసం, వాహణ పుణ్ణాహ మంగళమ్, కర్షణ పుణ్యాహ మంగళమ్‌- పేర్లతో బౌద్ధుల కాలంలో ఈ పండుగను ఆచరించేవారు. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక పండుగను నిర్వహించినట్లు సాహిత్యంలో అనేకచోట్ల కనిపిస్తుంది. ప్రేమ, దయ, ఆదరణ, సామూహిక వ్యవసాయ భావనలు ఈ పండుగ మాటున ఇమిడి ఉన్నాయి.      

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


గోగునార తోరణాలు

కొన్ని ప్రాంతాల్లో ఊరు బయట.. గోగునారతో చేసిన తోరణాలు కడతారు. రైతులు చెర్నాకోలతో ఆ తోరణాలను కొట్టి.. ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్తారు. ఆ నారను నాగళ్లకు, ఎడ్ల మెడలోను కడతారు. వ్యవసాయం, పశు సంపదల వృద్ధికి ఈ సంప్రదాయం దోహదపడుతుందన్నది కర్షకుల నమ్మకం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు