అన్యమనస్కులు.. ఆధ్యాత్మికత!

అన్యమనస్క స్వభావం ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం అనేవారు రామకృష్ణ పరమహంస. మనసు లగ్నం చేయకుండా ఏ గుడికి వెళ్లినా, ఏ ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించినా ఫలితం శూన్యమని హితపు పలికేవారు. ఒకరోజు పరమహంస పూజారిగా ఉన్న కాళికాలయానికి ధర్మకర్త అయిన రాణీరాస్మణి వచ్చారు.

Published : 13 Jun 2024 00:45 IST

న్యమనస్క స్వభావం ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం అనేవారు రామకృష్ణ పరమహంస. మనసు లగ్నం చేయకుండా ఏ గుడికి వెళ్లినా, ఏ ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించినా ఫలితం శూన్యమని హితపు పలికేవారు. ఒకరోజు పరమహంస పూజారిగా ఉన్న కాళికాలయానికి ధర్మకర్త అయిన రాణీరాస్మణి వచ్చారు. పూజాదికాలు పూర్తయ్యాక ‘అయ్యా! తమరు ఆలపించే భక్తిగీతాలు వినాలని అనుకుంటున్నాం. దయచేసి పాడగలరా?’ అని అభ్యర్థించారు. ఆయనను దైవస్వరూపంగా భావించేవారామె. రామకృష్ణులు అంగీకరించి కాళికాదేవి స్తుతి గీతాలను ఆలపించసాగారు. కొన్ని క్షణాలయ్యాక హఠాత్తుగా పాడటం ఆపి, రాణీరాస్మణి వైపు తిరిగి ‘ఏమిటి ఇక్కడ కూడా ఆ పాడు ఆలోచనలేనా?’ అంటూ గట్టిగా గద్దించారు. రాస్మణి మనసు అక్కడ లేదని, ఆ క్షణం ఆమె ఆస్తి వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నారని పరమహంస గుర్తించారు. అప్పుడు ఆలయంలో పెద్ద గందరగోళం చెలరేగింది. ఆలయ కాపలాదారులు, అధికారులు ఒక్క పరుగులో అక్కడికి చేరుకొని రామకృష్ణులను ఆలయం నుంచి గెంటేయబోయారు. కానీ రాస్మణీదేవి ప్రసన్నంగా ‘వారి పొరపాటు ఏమీ లేదు. తప్పంతా నాదే! వారిపై ఎలాంటి చర్యా తీసుకోవద్దు’ అని ఆదేశించారు. అంతే కాదు.. పరమహంసకు నమస్కరించి, క్షమాపణలు కోరుకున్నారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు