భక్తుడి కోసం వెనుతిరిగిన భగవంతుడు

భగవంతుడు భక్తప్రియుడు. భాగవతుల హృదయమే ఆయనకు మందిరం. తనను నమ్మినవారిని తప్పకుండా రక్షిస్తాడు. పురాణేతిహాసాలు ఈ విషయాన్ని కథల రూపంలో మనసుకు హత్తుకునేలా వివరించాయి.

Updated : 30 May 2024 00:55 IST

గవంతుడు భక్తప్రియుడు. భాగవతుల హృదయమే ఆయనకు మందిరం. తనను నమ్మినవారిని తప్పకుండా రక్షిస్తాడు. పురాణేతిహాసాలు ఈ విషయాన్ని కథల రూపంలో మనసుకు హత్తుకునేలా వివరించాయి. భక్తులందరూ భగవంతుడికి కన్నబిడ్డలే. ఎలాంటి విభేదాలూ ఉండవు. భక్తుడికీ, భగవంతుడికీ నడుమ ఏవీ అడ్డు రావు. ఎవరిని, ఎప్పుడు, ఏ విధంగా ఆదుకోవాలో స్వామికి బాగా తెలుసు. 

రామదాసు, కనకదాసు- ఇద్దరూ భక్తులే. ఒకరు రాముణ్ణి, ఇంకొకరు కృష్ణుణ్ణి నమ్ముకున్నారు. ఉడుపి బాలకృష్ణుణ్ణి కనులారా చూసి ఆనందించాలి అనుకున్న కనకదాసు బయల్దేరాడు. ఆనాటి ఆచారాలను బట్టి ఆయనకు దేవాలయ ప్రవేశం కలగలేదు. జాత్యహంకారులు కనకదాసును కట్టేసి, కనీసం నోరారా శ్రీకృష్ణుని పిలవడానికి వీల్లేకుండా హింసించారు. అయినా కనకదాసు వెనకాడలేదు. గళమెత్తి పాడాడు. ప్రహ్లాదకుమారుణ్ణి తండ్రి హిరణ్యకశిపుడు ‘ఏడీ శ్రీహరి?’ అని గర్జించగా.. ఇందు గలడు, అందు లేడు అనే సందేహం లేకుండా స్తంభం లోంచి నరహరిగా ప్రత్యక్షమయ్యాడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి. లోకకంటకుడైన హిరణ్యకశిపుని తుదముట్టించి, తన భక్తుణ్ణి రక్షించాడు. దేవతలు ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఇక గజేంద్రుడు మొసలినోట చిక్కి ‘నువ్వే నాకు దిక్కు’ అని మొరపెట్టుకున్నాడు. వెంటనే వైకుంఠం నుంచి హరి దిగివచ్చి ఏనుగును మొసలి బారినుంచి రక్షించి, మోక్షప్రాప్తి కలిగించాడు. కనకదాసు కూడా ఆ గజేంద్రుడిలా నీవే శరణని ప్రార్థించాడు. ‘దేవా! తలుపు తీసి, నీ దర్శనభాగ్యం కలిగించు’ అని ఎలుగెత్తి పిలిచాడు. ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక వింత జరిగింది. అహంకారాల అడ్డుగోడ బద్దలయ్యింది. స్వామి వెనుదిరిగి.. కనక దాసుకు దివ్యరూప సందర్శనం ప్రసాదించాడు. కరిరాజు కోసం హడావుడిగా విష్ణువు బయల్దేరినప్పుడు.. వైకుంఠపురంలోని పరివారం అంతా కదిలి వచ్చినట్లు ఉడుపి క్షేత్రంలోని కృష్ణ విగ్రహం తిరిగిన దిశలో హారతి పళ్లేలు, తీర్థప్రసాదాలు మలుపు తిరిగాయి. గుడిగంటలు గణగణ మోగాయి. భక్తి మహిమ ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. భక్తి ఉన్నచోట జ్ఞానవైరాగ్యాలూ ఉంటాయి. భక్తులు జీవన్ముక్తులు అవుతారు.

ఉప్పు రాఘవేంద్ర రావు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని