శ్రమే దైవం

ఏ పని సాధించాలన్నా మొదట కృషి చేయాలి. ఆనక దైవం అనుగ్రహించాలి. పట్టుదలతో శ్రమిస్తూ.. పర్యావరణంలో గాలిలా వ్యాపించి ఉన్న దైవానుగ్రహాన్ని ప్రాణశక్తిగా స్వీకరించి అనుకున్న పనిని నెరవేర్చుకోవాలి.

Updated : 25 Apr 2024 00:09 IST

మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

ఏ పని సాధించాలన్నా మొదట కృషి చేయాలి. ఆనక దైవం అనుగ్రహించాలి. పట్టుదలతో శ్రమిస్తూ.. పర్యావరణంలో గాలిలా వ్యాపించి ఉన్న దైవానుగ్రహాన్ని ప్రాణశక్తిగా స్వీకరించి అనుకున్న పనిని నెరవేర్చుకోవాలి. మన కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వహించగలిగితే మానవత్వం నుంచి దైవత్వం దిశగా పయనించవచ్చు. కర్తవ్యాన్ని విస్మరిస్తే మట్టుకు.. దైవత్వం మాట అటుంచి మనిషి స్థాయి నుంచి కూడా దిగజారడం తథ్యం.

దేవుడు ఎక్కువగా కొండల మీదే ఎందుకు వెలుస్తాడు?- ఒక భక్తుని సందేహమిది. కొండ ఎక్కడానికి ఆత్మవిశ్వాసం, శారీరక శ్రమ అవసరం. కొండ పైకి చేరుకున్నాక దృష్టి విశాలమైనట్లే, పరమాత్మ సన్నిధిలో మనసు విశాలమవుతుంది. దైవాన్ని దర్శించాలన్న సంకల్పం, శ్రమతోనే అది సాధ్యమన్న సత్యాన్ని బోధపరిచేందుకే భగవంతుడు కొండలపై వెలుస్తాడు- అన్నది ఆ ప్రశ్నకు జవాబు.

కర్తవ్యాన్ని విస్మరిస్తే..

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః  
తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ

భగవద్గీతలోని ఈ శ్లోకానికి యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుస్సును ధరించిన అర్జునుడు ఎక్కడుంటే అక్కడ సంపద, విజయం, శక్తి, నీతి నిశ్చయం- అనేది భావం. ఇక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడంటే దైవానుగ్రహం, ధనుర్ధారి అయిన అర్జునుడంటే మానవ ప్రయత్నం. ఆ రెండూ ఉంటే విజయం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. ధనుర్ధారి అనడంలో కర్తవ్యోన్ముఖుడు అని అర్థం. ధనుస్సును జారవిడిస్తే.. అంటే కర్తవ్యాన్ని విస్మరిస్తే అర్జునుడి స్థితి ఏమిటో ఊహించగలం కదా!

ఉడుత నుంచి ఖాండిక్యుడి దాకా..

వారధి నిర్మాణంలో వానరులు పెద్దపెద్ద శిలల్ని మోయడం ద్వారా తోడ్పడ్డారు. అల్పప్రాణి అయిన ఉడుత నీటిలో మునిగి, ఇసుకలో దొర్లి.. ఆ రేణువుల్ని విదిల్చింది. తన వంతు శ్రమించి దైవానుగ్రహాన్ని పొందింది. సీత తన మిత్రుడైన దశరథుడి కోడలు. అంతకుమించి ఆమె మహా సాధ్వి. అటువంటి ఆమెని బలవంతంగా ఎత్తుకెళ్తున్న రావణాసురుడు తనకంటే బలవంతుడని జటాయువుకు తెలుసు. అయినప్పటికీ సాధుజన రక్షణ తన కర్తవ్యంగా భావించి, శ్రమకోర్చి పోరాడాడు. భగవంతుడి ఒడిలో కన్ను మూశాడు. దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి ద్వారా మరణానంతరం నెరవేరాల్సిన అపరకర్మలు చేయించుకుని ముక్తిని పొందాడు. తద్వారా జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.

మతంగ మహర్షి ఆశ్రమంలో రుషులకు సేవలందిస్తూ ఆశ్రమ నిర్వహణకై శ్రమిస్తున్న శబరిని వెతుక్కుంటూ దైవమే నడిచి వచ్చాడు. దాసిగా ఉన్న తల్లికి పుట్టినందున గరుత్మంతుడు జన్మతః దాసుడయ్యాడు. తనకంటే అల్పులైన నాగజాతికి, సవతితల్లికి ఊడిగం చేయాల్సి వచ్చింది. తన సాధనతో, శ్రమతో, తండ్రియైన కశ్యపుని అనుగ్రహంతో అమృతాన్ని సాధించాడు. అలా తల్లికి, తనకు కూడా దాస్య బంధనాలను తొలగింపచేసుకున్నాడు. అలాంటి కఠోర సాధనతోనే- లోక భారాన్ని మోస్తున్న భగవంతుణ్ణి తాను మోసే గొప్ప అదృష్టాన్ని పొందాడు. పరమాత్మ చరణ సన్నిధిలో స్థానం సంపాదించుకున్నాడు. కపిల మహర్షి ఆగ్రహానికి గురైన సగరపుత్రులకు ముక్తిని కలిగించటానికి భగీరథుడు చేసిన ప్రయత్నం శ్రమశక్తికి గీటురాయి. ఆకాశగంగను భూమిపైకి తీసుకురావడానికి, భూమిమీదికి దిగుతున్న గంగను శివుడు భరించడానికి, శివ జటాజూటం నుంచి ప్రవహిస్తూ జహ్నుమహర్షి ఆగ్రహానికి గురైన గంగను విడిపించడానికి, విడుదల పొందిన గంగను పాతాళానికి రప్పించి తన పూర్వీకులకు ముక్తి కలిగించటానికి భగీరథుడు పడిన శ్రమ.. తనకే కాదు, తనవారికీ దైవత్వాన్ని ప్రసాదించింది.

ఖాండిక్యుడు అనే రాజు పినతండ్రి పుత్రుడైన కేశిధ్వజుడి చేతిలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. శత్రువే అయినప్పటికీ.. తనను ఆశ్రయించాడని కేశిధ్వజునికి సాయం చేశాడు ఖాండిక్యుడు. ప్రతిఫలంగా ఖాండిక్యుడికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నాడు కేశిధ్వజుడు. కానీ ఖాండిక్యుడు రాజ్యాన్ని స్వీకరించలేదు. సంపదలను శ్రమశక్తితో సాధించాలే గానీ ఒకరి దయాదాక్షిణ్యాలతో కాదు. కష్టపడి సంపాదించి, అలా వచ్చిన సొమ్మును సద్వినియోగం చేసినప్పుడు దైవత్వం సిద్ధిస్తుందని చెప్పాడు ఖాండిక్యుడు. అలా ఉడుత నుంచి ఖాండిక్యుడి దాకా.. అందరూ శ్రమశక్తి ఘనతను తెలియజేసిన వారే.

దేవుడూ శ్రమించాడు

దైవ స్వరూపుడైన రాముడు- అవతార పరమార్థాన్ని నెరవేర్చేందుకు శ్రమనే సాధనంగా చేసుకున్నాడు. చిన్నతనం నుంచీ శ్రమించాడు. ఉపనయన సంస్కార సమయంలో తనకు అత్యంత ప్రియమైన కైకేయిమాత నుంచి ప్రారంభించి అహల్య, అనసూయది సాధ్వులు, శబరీమాత లాంటి సాధకులు, వశిష్ట, విశ్వామిత్ర, పరశురామ, భరద్వాజ, శరభంగ, సుతీక్ష్ణుడు తదితర మహర్షుల శ్రేయస్సుకై శ్రమించి, వారి నుంచి అవతార పరమార్థ ప్రయోజనం కోసం తపశ్శక్తిని అందుకుంటూ వచ్చాడు. అరణ్యకాండలో శ్రీరాముడు ఒక మహర్షిని కలవడం, ఓ రాక్షసుణ్ణి సంహరించటం; మరో మహర్షిని కలవడం, ఇంకో రాక్షసుణ్ణి సంహరించటం.. ఆయన పయనం ఇలానే కొనసాగుతుంది. రావణాసురుడు తపశ్శక్తి సంపన్నుడు. అతణ్ణి ఓడించటానికి తన శక్తియుక్తులన్నీ జోడించి లక్ష్యాన్ని సాధించాడు. భగవంతుడైన రాముడే అంతగా శ్రమించినప్పుడు ఇక సామాన్యుల జీవితంలో శ్రమ విలువ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానవ ప్రయత్నం + దైవానుగ్రహం = విజయం, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే దైవం కూడా. కనుక శ్రమలో దైవం ఉంది. శ్రమే దైవం.


స్వార్జనతోనే సంతృప్తి

తండ్రి ఆదేశంతో అడవికి బయల్దేరాడు శ్రీరాముడు. రాముణ్ణి విడిచి ఉండలేని సీతా లక్ష్మణులు కూడా అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. రాముడి సూచన మేరకు అయోధ్యలో తమకంటూ ప్రత్యేకంగా ఉన్న సంపదనంతా దానం చేశారు. ఆ సమయంలో త్రిజటుడు అనే వృద్ధ పేద బ్రాహ్మణుడు తనకేదైనా దానం చేయమని అర్థించాడు. రాముడు ఎదురుగా ఉన్న ఆవులమందను చూపించి.. ‘నీ చేతి కర్రను ఎంత దూరానికి విసిరితే.. అక్కడి వరకూ ఉన్న ఆవులన్నీ నీవే’ అన్నాడు. శక్తిని కూడదీసుకుని కర్ర విసిరాడు బ్రాహ్మణుడు. రాముడు ఆ ప్రాంతంలో ఉన్న ఆవులన్నింటినీ ఇచ్చేశాడు. ఒకరి దయాదాక్షిణ్యాల మీద కాక శ్రమశక్తితో సాధించుకుంటేనే ఆత్మసంతృప్తి, దైవానుగ్రహం లభిస్తాయని చెప్పడానికే వృద్ధుణ్ణి అలా పురమాయించాడు.


ఎంగిలాకులు తీసిన కన్నయ్య

ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సమయంలో కృష్ణుడు అందరికీ ఒక్కో బాధ్యత అప్పగించాడు. రాజులు తెచ్చిన కానుకలను స్వీకరించే పని దుర్యోధనుడిది. రారాజునైన నాకు కృష్ణుడు పని చెబుతాడా? అందరికీ పనులు పురమాయిస్తున్న ఈ మాయలమారి తనేం పని చేస్తున్నాడు- అని చూడబోతే.. మహర్షులు తిన్న ఎంగిలి విస్తళ్లు ఎత్తుతూ కనిపించాడు కృష్ణుడు. ఇక దుర్యోధనుడు మారు మాట్లాడకుండా వెనుతిరిగాడు. శ్రమతో దైవాన్ని చేరుకోవటం కాదు.. సాక్షాత్తు దైవమే శ్రమిస్తున్నప్పుడు- ఆ ఔన్నత్యం గురించి చెప్పేదేముంది!


డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు