కదలకుండానే కాశీ యాత్ర!

కాశీ విశ్వేశ్వరుడితోపాటు అక్కడున్న ఆలయాలన్నిటినీ క్షణాల్లో దర్శించుకోవచ్చు... పర్వతపు అంచుల్లో కొలువుదీరిన వైష్ణోదేవి ఆలయాన్నే కాదు, ఆ పరిసరాల్నీ సులువుగా చుట్టిరావొచ్చు...

Published : 29 Jun 2024 23:42 IST

కాశీ విశ్వేశ్వరుడితోపాటు అక్కడున్న ఆలయాలన్నిటినీ క్షణాల్లో దర్శించుకోవచ్చు... పర్వతపు అంచుల్లో కొలువుదీరిన వైష్ణోదేవి ఆలయాన్నే కాదు, ఆ పరిసరాల్నీ సులువుగా చుట్టిరావొచ్చు...  లక్షలాది భక్తులు బారులుకట్టినా ఓంకారేశ్వరుడి అభిషేకాలన్నీ ఎలాంటి తొక్కిడి లేకుండా తిలకించేయొచ్చు... ‘బాబోయ్‌, అక్కడివరకూ చేరుకుని ఆ దేవుడి దర్శన భాగ్యమే కష్టమనుకుంటే ఇవన్నీ ఎలా కుదురుతాయీ’ అంటారేమో...  ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటుచేసిన వర్చువల్‌ రియాలిటీ దర్శనాలతో ఇవన్నీ సాధ్యమే మరి!

తీర్థయాత్రలకు వెళ్లడం అంటేనే ఒక పెద్ద ప్రయాస. ఎలా వెళ్లాలి... ఎక్కడ ఉండాలి... దర్శనం ఎప్పుడు చేసుకోవాలి... ఇలా అన్నీ ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటూ టికెట్లూ, హోటళ్లూ బుక్‌ చేసుకుంటాం. తీరా వెళ్లాక అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే దేవుడి దర్శనం కోసం గంటలు-గంటలు క్యూలో వేచి ఉండాల్సిందే. అంతాచేస్తే కాసేపు నిలబడి దేవుడిని దర్శించడమూ కష్టమే. అంతేకాదు, సమయమంతా ఇలా క్యూలైన్‌కే పట్టేస్తే ఆలయం చుట్టుపక్కల ప్రదేశాల్ని చూసేదెలా. అందుకే ఒకవైపు భక్తుల ఈ కష్టాల్ని తొలగిస్తూనే మరోవైపు గుడిలోని మూల విరాట్‌ని కళ్లారా చూపిస్తూ- మరిచిపోలేని మధురానుభూతిని అందించడానికి కొన్ని పుణ్యక్షేత్రాల్లో త్రీడీ వర్చువల్‌ రియాలిటీ
(వీఆర్‌) దర్శనాల్ని తీసుకొచ్చారు.

దూరంగా ఉన్న ప్రపంచాన్ని మన కళ్లముందుకు తీసుకొచ్చే వీఆర్‌ సాంకేతికత- తెలిసిందే కదా. షాపింగ్‌ దగ్గర్నించి ఆటల వరకూ అన్నింట్లోకీ చేరిపోయి ఆదరణ పొందిన ఈ టెక్నాలజీ- ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి భక్తుల మనసునూ ఆహ్లాదపరచడానికి వచ్చేసింది. మొన్నీమధ్యే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ప్రారంభమైన ఈ ‘వీఆర్‌ దర్శన్‌’ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉన్నచోట నుంచే భక్తుల్ని నేరుగా గర్భగుడిలోకి తీసుకెళుతూ ఆలయమంతా తిప్పేస్తుంది. నిత్య అభిషేకాలూ, అర్చనలూ, హారతులూ కళ్లారా చూపిస్తూ శివయ్య సేవలో పాల్గొన్న అనుభూతిని అందిస్తుంది. అంతేనా ప్రధాన ఆలయంతోపాటూ చుట్టూ ఉన్న గుళ్లూగోపురాలూ, పవిత్ర గంగా హారతీ, పుష్కర ఘాట్లూ, ప్రత్యేక ప్రదేశాలూ... ఇలా కాశీ చుట్టూ ఉన్నవన్నీ కళ్లకు కట్టేస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ తిరిగి చూడలేని పెద్దవాళ్లూ, పుణ్యక్షేత్రాన్ని 360 డిగ్రీల కోణంలో చూడాలనుకునేవాళ్లూ, స్వామిని కళ్లారా తిలకించాలనుకునే భక్తులూ... ఈ వీఆర్‌ దర్శనం చేసుకోవచ్చు. ఉదయం సుప్రభాత సేవ మొదలు గుడి తలుపులు మూసేవరకూ జరిగే అన్ని పూజల్నీ చూసేయొచ్చు.

జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల గుళ్లలోనూ భక్తుల కోసం ఈ త్రీడీ వర్చువల్‌ రియాలిటీ దర్శనాల్ని ఏర్పాటు చేశారు. పది నిమిషాల నుంచి గంట వరకూ సాగే ఈ డిజిటల్‌ దర్శనాల వల్ల నేరుగా వెళ్లలేని ప్రదేశాలన్నీ చూసేయొచ్చన్నమాట.

ఎలా ఉంటుంది...

ఆలయప్రాంగణాల్లోనే ప్రత్యేక గదుల్లో ఈ వర్చువల్‌ రియాలిటీ దర్శనాల్ని ఏర్పాటు చేశారు. కుర్చీలో కూర్చునో, ఉన్నచోట నిలబడో వీఆర్‌ హెడ్‌సెట్‌ని కళ్లకు పెట్టుకుంటే చాలు, భగవంతుడి నిలువెత్తు రూపం కనిపిస్తూనే, భక్తిపాటలూ వినిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వీఆర్‌ దర్శనాలు సరికొత్త ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళుతూ భక్తుల్ని పరవశింపజేస్తాయంటే నమ్మండి. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలనుకునేవాళ్లూ, జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటూ ఆ పరమేశ్వరుడిని తిలకించే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూసే భక్తులూ... ఆయా పుణ్యక్షేత్రాల దర్శనంతోపాటూ ఈ వీఆర్‌ దర్శనాన్నీ చేసుకున్నారంటే ‘మా జన్మధన్యం’ అనేస్తారంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..