మోమోలు... రుచి చూస్తే వదలరు!

చూడ్డానికి ఆవిరి కుడుముల్లా కనిపించినా... ఇవి ఎదురుగా ఉన్నాయంటే వరుసపెట్టి అయిదారు లాగించేయాలనిపిస్తాయి. చాట్‌, పానీపూరీ, నూడుల్స్‌, మంచూరియా వంటి వంటకాలతో పోటీపడుతూ... కోరుకున్న రుచుల్లో దొరికేస్తూ మళ్లీమళ్లీ తినాలపిస్తాయివి.

Published : 29 Jun 2024 23:48 IST

చూడ్డానికి ఆవిరి కుడుముల్లా కనిపించినా... ఇవి ఎదురుగా ఉన్నాయంటే వరుసపెట్టి అయిదారు లాగించేయాలనిపిస్తాయి. చాట్‌, పానీపూరీ, నూడుల్స్‌, మంచూరియా వంటి వంటకాలతో పోటీపడుతూ... కోరుకున్న రుచుల్లో దొరికేస్తూ మళ్లీమళ్లీ తినాలపిస్తాయివి. ఈ ఉపోద్ఘాతమంతా - ఈ మధ్య ఎక్కడ చూసినా కనిపిస్తూ పిల్లల నుంచి పెద్దలవరకూ అందరికీ నచ్చేస్తూ నోరూరిస్తున్న మోమోల గురించే. కొంతకాలంగా ఆహారప్రియుల ఫేవరెట్‌ ఫుడ్‌గా మారిపోయిన ఈ మోమోల ముచ్చట్లేంటో కాస్త చూద్దామా...

వీధి చివరన ఉండే చాట్‌బండి కమ్మని వాసనతో స్వాగతిస్తే... మరో నాలుగు అడుగులు ముందుకేశామా... చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో తయారుచేసే వేడివేడి నూడుల్స్‌, మంచూరియా ఘుమఘుమలు నోరూరిస్తాయి. లేదూ స్నేహితులంతా ఏ బేకరీలోనో సరదాగా సిట్టింగ్‌ వేసి కబుర్లు మొదలుపెడితే... ఆ మాటల మధ్యలోనే పిజ్జా, బర్గర్‌, వెజ్‌రోల్స్‌... ఇలా ఎన్నెన్నో బేకరీ పదార్థాలను రుచి చూసేయొచ్చు. ఇవన్నీ తెలిసినవే, ఎప్పుడూ ఉండేవే కాబట్టి ఇంకాస్త వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని కోరుకునే ఫుడీలకు ఇప్పుడు మోమోస్‌ తయారీ సెంటర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆవిరిమీద ఉడికించడం నుంచీ గ్రిల్‌ చేయడం వరకూ రకరకాల పద్ధతుల్లో తయారుచేసే ఈ మోమోలు కోరుకున్న రుచుల్లో, రంగుల్లో, షేపుల్లో వచ్చేస్తూ అన్ని వయసులవారినీ మెప్పిస్తున్నాయి.

ఒకప్పుడు కేవలం పెద్దపెద్ద రెస్టరంట్లలో మాత్రమే లభించిన మోమోలు ప్రస్తుతం ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ మాదిరి అన్నిచోట్లా దొరుకుతుండటంతో ఇవి అందరికీ ఫేవరెట్‌ అయిపోయి... ఏ వేళప్పుడైనా తినేందుకు చక్కని ఎంపికవుతున్నాయి. ఇదంతా బానే ఉంది కానీ నూడుల్స్‌ అనగానే చైనీస్‌ వంటకమని టక్కున చెప్పేస్తాం. మరి ఈ మోమోల సంగతి... ఇవి ఎక్కడ పుట్టాయో కూడా తెలియాలిగా... మోమోస్‌/డంప్లింగ్స్‌... ఇలా ఏ పేరుతో పిలిచినా వీటిని తొలిసారి తయారుచేసింది టిబెట్‌వాసులేనట. అవును, పద్నాలుగో శతాబ్దంలో ఈ మోమోలను టిబెటన్లు వండారు. కొన్నాళ్లకు నేపాల్‌కు వలస వెళ్లి స్థిరపడిన కొందరు టిబెట్‌ వాసులు అక్కడా వీటిని చేయడంతో నేపాలీలూ తమ వంటకాల జాబితాలో మోమోలను చేర్చుకుని పండుగలూ, ప్రత్యేక వేడుకల్లో వీటిని తయారుచేయడాన్ని ఓ సంప్రదాయంగా పెట్టుకున్నారట. అలా అలా 1960 ప్రాంతంలో భారత్‌కు టిబెటన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చి లద్దాక్‌, డార్జిలింగ్‌, ధర్మశాల, సిక్కిం... తదితర ప్రాంతాల్లో స్థిరపడటంతో అవన్నీ మోమోల తయారీ కేంద్రాలుగా మారిపోయి నెమ్మదిగా ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. మరో కథ ప్రకారం కాఠ్‌మాండూకు చెందిన నేవార్‌ వర్తకులు టిబెట్‌ నుంచి ఇండియాకు సిల్క్‌ రూట్‌ ద్వారా వస్తూ మోమోలనూ తీసుకురావడంతో అప్పటినుంచీ నేటి వరకూ ఇవి రకరకాలుగా మారుతూ వచ్చి... ఇప్పుడు కోరుకున్నట్లుగా దొరికేస్తున్నాయి.

నచ్చినట్లుగా వండేస్తూ...

నేవార్‌ భాషలో మోమ్‌ అంటే... ఆవిరిమీద ఉడికించడం అని అర్థం. ఒకప్పుడు గోధుమపిండితో చపాతీని తయారుచేసి అందులో మాంసాన్ని పెట్టి అంచుల్ని ఓ పద్ధతి ప్రకారం మూసి ఆవిరిమీద ఉడికించడంతో మోమోలు రూపుదిద్దుకున్నాయి. రోజులు మారేకొద్దీ వీటి తయారీతోపాటు ఫిల్లింగ్స్‌ కూడా మారుతూ రావడంతో రూపం, రంగు, రుచుల్లోనూ తేడా వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా మైదాను వాడుతున్నా ఫిల్లింగ్‌లుగా నచ్చిన పదార్థాలను వాడేస్తున్నారు.

మాంసాహారాన్ని ఇష్టపడేవారికోసం చికెన్‌, మటన్‌, ప్రాన్స్‌ మోమోస్‌ దొరుకుతుంటే... శాకాహారులకోసం క్యాబేజీ, క్యారెట్‌, బీన్స్‌, పనీర్‌, టోఫు, మష్రూమ్స్‌, చీజ్‌... ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక, వీటిల్లో వైవిధ్యం తీసుకొచ్చేందుకు ఆకృతిని కూడా గుండ్రంగానే కాకుండా కుడుముల తరహాలోనూ మార్చేస్తున్నారు షెఫ్‌లు. అలాగే గులాబీ పూల మాదిరి తయారుచేసినవీ దొరుకుతున్నాయి. సాధారణంగా మోమోలంటే తెల్లగానే ఉంటాయి. అయితే అందులోనూ వెరైటీ ఉండాలని పిండికి పాలకూర, బీట్‌రూట్‌, క్యారెట్‌, గుమ్మడి, పసుపు... తదితరాలను కలిపి రెయిన్‌బో రంగుల్లోనూ తీసుకొచ్చేస్తున్నారు. పిల్లలకోసం ప్రత్యేకంగా చాక్లెట్‌, డ్రైఫ్రూట్స్‌, కోవా తదితరాల రుచుల్లోనూ వస్తున్నాయి. వీటి తయారీలో మరిన్ని ప్రయోగాలు చేస్తున్న మాస్టర్‌ షెఫ్‌లు మోమోలను కేవలం ఆవిరిమీదే ఉడికించి వదిలేయకుండా... డీప్‌ఫ్రైడ్‌, గ్రిల్డ్‌, పాన్‌ ఫ్రైడ్‌, తందూరీ, ఓపెన్‌... ఇలా ఎన్నోరకాలుగా వండేస్తున్నారు. అంతేనా... మంచూరియా తరహాలో చేసే చిల్లీగార్లిక్‌ రకమూ, సూప్‌లో వేసే వెట్‌ మోమోస్‌ కూడా వస్తున్నాయి. వీటిని ఏ పద్ధతిలో తయారుచేసినా... కాంబినేషన్‌గా పక్కన చట్నీ లేదా సాస్‌ ఉంటేనే నిండుదనం కాబట్టి ఇప్పుడు దాన్నీ రకరకాలుగా అందిస్తున్నారు. అలా వస్తున్న వాటిల్లో మోమోల కోసమే ప్రత్యేకంగా సాస్‌లు ఉంటున్నాయి. అలాగే మయొనైజ్‌, టొమాటో గార్లిక్‌ క్రష్డ్‌ చట్నీ, గ్రీన్‌చట్నీ.. వంటివీ అందిస్తున్నారు. సాధారణంగా మోమోలను ఉడికించే పాత్రను మక్‌టూ అంటారు. ఒకప్పుడు దీన్ని వెదురుతోనే తయారుచేసేవారు. ఇప్పుడు వీటి వినియోగం పెరగడంతో ఈ పాత్ర కూడా రెండు మూడు వరుసల్లో, స్టీల్‌లోనూ దొరుకుతోంది. ఇక అప్పటికప్పుడు మోమోలు తినాలని కోరుకునేవారికోసం సాస్‌లతో కలిపి ఉండే ఇన్‌స్టంట్‌ మోమో ప్యాకెట్లూ అందుబాటులో ఉన్నాయి.

అదండీ సంగతి... వాతావరణం చల్లగా ఉన్నా... నాలుగు చినుకులు పడుతున్నా.. గబగబా వంటింట్లోకి వెళ్లి బజ్జీ/పకోడీ.. ఏం చేసుకుందామని ఆలోచించకుండా మోమోస్‌ ట్రై చేశామనుకోండి... ఓ వైపు వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూనే, మరోవైపు వేడివేడిగా వీటిని తింటూ ‘మోమోలా మజాకా’ అనుకుంటూ రుచినీ ఆస్వాదించేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..