ఈ డాక్టర్లు దేవుళ్లు!

ఆర్థిక సమస్యలవల్లో,  సరైన రవాణా సదుపాయం లేకనో-  సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులెందరో.

Published : 30 Jun 2024 00:01 IST

ఆర్థిక సమస్యలవల్లో,  సరైన రవాణా సదుపాయం లేకనో-  సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులెందరో. అలాంటి వారి బాధల్ని  చూసి కదిలిపోయిన ఈ డాక్టర్లు మానవ సేవే మాధవ సేవగా భావించి రోగుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలు నిలబెడుతున్నారు.


ఇంటికే వైద్యం

యసుపైబడిన వారిని పలు అనారోగ్య సమస్యలు బాధిస్తుండటంతో నిత్యం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంటుంది. పేద వారికీ, కొన్ని రకాల సమస్యల వల్ల మంచం దిగలేనివారికి తరచూ హాస్పిటల్‌కి వెళ్లడమంటే సాధ్యమయ్యే పనికాదు. మదురైలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో డయాబెటాలజిస్టుగా పని చేసే సమయంలో స్వామినాథన్‌ చంద్రమౌళి అలాంటి వాళ్లెందర్నో దగ్గరగా చూసి బాధపడ్డాడు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఆసుపత్రిలో ఉద్యోగం మానేసి సొంతంగా ఓ క్లినిక్‌ పెట్టుకున్నాడు. ఓ సెకండ్‌హ్యాండ్‌ వ్యానును కొనుగోలు చేసి- అందులో ఆక్సిజన్‌, మందులు, ఎక్స్‌రే యంత్రం, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌, బ్లడ్‌ శాంపిళ్లు సేకరించి నిల్వ చేసే బాక్సు వంటివి ఉంచి ఓ మొబైల్‌ ఆసుపత్రిగా మార్చేశాడు. హాస్పిటల్‌కి రాలేని వారు ఎవరైనా తనని సంప్రదిస్తే... ఇంటికే వెళ్లి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం తెల్లవారు జామున మూడు గంటలకే వ్యానుతో బయల్దేరి ఉదయం పదింటి వరకూ రోగుల్ని చూస్తాడు. అప్పటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ, తన క్లినిక్‌లో సేవలు అందించే స్వామినాథన్‌- ఆ తరవాత  కూడా ఇంటింటికీ వెళ్లి ఏడింటి వరకూ రోగుల్ని చూస్తుంటాడు. పేదలకు మాత్రం ఉచితంగానే సేవలు అందించడంతోపాటు మందులూ, ఆహారం కూడా తీసుకెళ్లి ఇస్తాడు. పూట గడవని వారికి నెలవారీ సరకులూ అందజేస్తాడు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ఉచితంగా అంబులెన్స్‌ సేవల్నీ కల్పిస్తున్నాడు. అలానే మదురై చుట్టుపక్కల గ్రామాలకూ పలువురు వైద్యుల్ని తీసుకెళ్లి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాడు.


ఉచితంగా గుండె చికిత్స!

చాలామంది చిన్నారులు పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారు. కొందరు ఆ సమస్యను గుర్తించే లోపే ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు ఆర్థిక సమస్యల వల్ల చికిత్స అందక కన్నుమూస్తున్నారు. అలాంటి పసికందుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు పుణెకి చెందిన మనోజ్‌ దురైరాజ్‌. ఆర్మీలో వైద్యుడిగా పని చేసి రాష్ట్రపతి అవార్డులు అందుకున్న మనోజ్‌ తన తండ్రి స్ఫూర్తితో కార్డియాలజిస్టు అయ్యాడు. సొంతంగా ఓ హాస్పిటల్‌ని పెట్టి ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లల గుండెలో రంధ్రం ఉన్న విషయం గుర్తించకపోవడం వల్ల పసివాళ్లెందరో మనోజ్‌ చేతుల్లోనే కన్నుమూశారు. ఆ దుస్థితికి కారణం ప్రధానంగా ఆర్థిక సమస్యలే అని తెలుసుకుని వారికి ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయడం ప్రారంభించాడు మనోజ్‌. అందుకోసం ఓ ఫౌండేషన్‌ను స్థాపించి ఇప్పటి వరకూ దాదాపు 400 మంది చిన్నారులకు పునర్జన్మ నిచ్చాడు. చికిత్సతో నయంకాని వారికీ, దీర్ఘకాలం మందులు వాడాల్సిన వారికీ- నెలనెలా మందులూ పోషకాహారం ఇంటికే పంపుతుంటాడు. వారి అవసరాన్ని బట్టి నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల భృతినీ అందిస్తున్నాడు. అలాంటి యాభై మంది చిన్నారులకోసం ప్రత్యేకంగా టీచర్లని ఏర్పాటు చేసి పాఠాలు కూడా చెప్పిస్తున్నాడు.


గర్భిణులకు ఫోన్లు!

సాధారణంగా వైద్యాధికారులు హాస్పిటల్‌లో ఉండి... అక్కడకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవల్ని అందిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని బర్సూర్‌ ప్రాథమిక వైద్యశాల్లో పని చేస్తున్న గణేశ్‌ బాబు మాత్రం హాస్పిటల్‌కి రాలేని వారికి కూడా వైద్య సేవలు అందిస్తూ... వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. బర్సూర్‌లోని ప్రభుత్వాసుపత్రికి వచ్చే దాదాపు ఇరవై గ్రామాల రోగులు అక్కడున్న ఇంద్రావతి నదిని దాటుకుని రావాల్సి ఉంటుంది. అందుకోసం పడవలు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందక ప్రసవానికి ముందే ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే, పురిటి నొప్పులు పడుతూ ఆసుపత్రికి చేరుకోలేక కన్నుమూసేవారు మరికొందరు. గర్భిణులకు అలాంటి సమస్యలు ఎదురు కాకుండా వారిని కాపాడాలనుకున్నాడు గణేశ్‌. అందుకోసం తన సొంత డబ్బుతో ఓ యాభై సెల్‌ఫోన్లను కొనుగోలు చేసి గర్భిణులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆసుపత్రిలోని సిబ్బందితో ఓ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆశావర్కర్ల సాయంతో వారికి కావల్సిన మందుల్నీ, పోషకాహారాన్నీ ఇంటికి పంపుతున్నాడు. ముందస్తుగా ఆసుపత్రిలో చేరేలా చూస్తున్నాడు. అలాంటి వారికి ఉచితంగా ఆహారమూ అందించి సుఖప్రసవమై... బిడ్డతో ఇంటికెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ 24/7 సేవలు అందేలా ఏర్పాట్లు చేసిన గణేశ్‌ను అక్కడి వారంతా ‘మొబైల్‌వాలా డాక్టర్‌’ అని పిలుస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..