ఏ యాత్రల్ని మెచ్చారంటే...

సెలవులు వస్తే ఎక్కడో అక్కడికి నాలుగైదు రోజులు వెళ్లొచ్చేద్దాం అని కాకుండా... ఈ సంవత్సరం తాము ఎంచుకునే ప్రయాణాలు వీలైనంత వైవిధ్యంగా, కొత్తగా ఉండాలని కోరుకున్నారు ట్రావెల్‌ లవర్స్‌. వాటిల్లో ఏమేం ఉన్నాయంటే...

Updated : 31 Dec 2023 03:06 IST

సెలవులు వస్తే ఎక్కడో అక్కడికి నాలుగైదు రోజులు వెళ్లొచ్చేద్దాం అని కాకుండా... ఈ సంవత్సరం తాము ఎంచుకునే ప్రయాణాలు వీలైనంత వైవిధ్యంగా, కొత్తగా ఉండాలని కోరుకున్నారు ట్రావెల్‌ లవర్స్‌. వాటిల్లో ఏమేం ఉన్నాయంటే...

ప్రతి యాత్రకీ ఓ అర్థం ఉండాలనుకోవడం, ఓ మంచి జ్ఞాపకంగా మిగలాలనుకోవడం, ఒత్తిడి నుంచి బయటపడాలనుకోవడం... ఇలా రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ ప్రయాణాల్ని ఎంచుకున్నారీ సంవత్సరం. ఆ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది ‘ఫ్యామిలీ లేదా గ్రూప్‌ ట్రిప్స్‌’ గురించి. బంధువులు/స్నేహితులతో కలిసి సరదాగా నాలుగైదు రోజులు గడపడం వల్ల సత్సంబంధాలు పెరగడంతోపాటూ ఓ మంచి జ్ఞాపకం మిగులుతుందనే ఉద్దేశంతోనే చాలామంది ఈ తరహా ట్రిప్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీని తరువాత రోజువారీ పనుల ఒత్తిడి నుంచి కాస్త విరామం పొందేందుకూ, తమని తాము రీఛార్జి చేసుకునేందుకూ, ఆరోగ్యంగా ఉండేందుకూ ‘వెల్‌నెస్‌ టూరిజం’కి ఓటేశారు. అంటే... ఓ వైపు ప్రయాణాలు చేస్తూనే మరోవైపు శారీరక-మానసిక ఆరోగ్యాన్ని పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా యోగా తరగతులు, సాత్విక ఆహారం, ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు, ధ్యానం, ఫిట్‌నెస్‌ వర్క్‌షాప్‌లు... వంటి అంశాలపైన దృష్టిపెట్టారు. దీంతోపాటూ ‘స్లీప్‌ టూరిజం’, ‘వెల్‌నెస్‌ హాలిడే’ పేర్లతో ఒకటిరెండు రోజులు నచ్చిన ప్రాంతానికి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకున్నవారూ లేకపోలేదు.

ప్రకృతితో గడిపారు!

బిజీ జీవనవిధానం నుంచి కాస్త విరామం కోరుకున్నవారిలో ఎక్కువమంది ప్రకృతి మధ్య గడిపేందుకే ఇష్టపడ్డారు. అలా వెళ్లిన ట్రిప్పుల్లో ‘సన్‌ టూరిజం’ ఒకటి. సూర్యుడి ఎదురుగా వీలైనంత ఎక్కువ సేపు ఉండటం అన్నమాట. అలాంటివాళ్లకోసం రిషికేష్‌, మనాలీ వంటి ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు తమ రూముల్లో నేరుగా సూర్యరశ్మి పడేలా ప్రత్యేక ఏర్పాటు కూడా చేశాయట. దీంతోపాటు మంచుకొండలమధ్యా, అడవుల్లోనూ విహారయాత్రలు చేసినవారూ ఉన్నారు. ఇక, ఉద్యోగస్తులూ, వ్యాపారరంగాల్లో ఉన్నవారు ‘డిజిటల్‌ నొమాడిజం’, ‘బ్లీజర్‌ టూర్స్‌’పైనా దృష్టిపెట్టారు. ఓ వైపు వృత్తిగత పనుల్ని చూసుకుంటూనే.. మరోవైపు సరదాగా ఆనందించడం అన్నమాట. ఈ టూర్స్‌లో భాగంగా ఇంటర్నెట్‌ సదుపాయాలున్న ప్రాంతాలూ, వర్క్‌థాన్లపైన ఆసక్తి చూపించారు. అలాగే ఒకేసారి నాలుగైదు ప్రదేశాలు చూడాలనుకోకుండా ఒకసారి ఒకే మజిలీ చేసేవిధంగా ‘సింగిల్‌ డెస్టినేషన్‌ ట్రిప్స్‌’, ఎక్కడికి వెళ్లినా ఓ ప్రయోజనం ఉండే ‘పర్పస్‌ రిలేటెడ్‌ ట్రావెలింగ్‌’... అంటే స్కూబా డైవింగ్‌, కయాకింగ్‌, మౌంటెనీరింగ్‌, గోల్ఫ్‌... లాంటివీ ఎంచుకున్నారు.

వీటినీ ప్రయత్నించారు

గ్లోబల్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌ ప్రకారం... 2022తో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువమంది భారతీయులు విదేశాలకూ పర్యటించాలనుకున్నారు. అందులో భాగంగా వియత్నాం థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, శ్రీలంక, ఇటలీ, స్విట్జర్లాండ్‌, నేపాల్‌, భూటాన్‌, మలేసియా, మాల్దీవులు, యుకె, యుఏఈ తదితర దేశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.

పర్యటకులు లక్షల్లో...

ఏడాదికోసారి ప్రత్యేకంగా వెళ్లే టూర్లు కొన్ని ఉంటాయి. అలాంటివాటిలో ఒకటి పూరీజగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్రలో ఈసారి దాదాపు పదిలక్షలమంది భక్తులు పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే గడిచిన రెండేళ్లతో పోలిస్తే 2023లో చార్‌ధామ్‌ యాత్రకూ సుమారు యాభైలక్షల మంది భక్తులు వెళ్లారట.కొవిడ్‌, ఆ తరువాత రొటీన్‌ జీవితానికి అలవాటు పడటం వల్ల చాలామంది భక్తులు ఈ సారి చార్‌ధామ్‌ యాత్రను ఎలాగైనా పూర్తిచేయాలనుకోవడమే అందుకు కారణమట.

పర్యావరణానికే ఓటు 

పర్యటకుల్లో చాలామంది ఏ ఊరికి వెళ్లినా సరదాగా గడిపి వచ్చేయకుండా పర్యావరణానికీ, సమాజానికీ మేలుచేసేలా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నించారట. ఎకోఫ్రెండ్లీ నివాసాల్లోనూ ఉండేందుకు ఆసక్తి చూపించారు. ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలనూ గౌరవించారు. స్థానికుల ఆదాయాన్ని పెంచేందుకు అక్కడి వస్తువుల్ని కొనడం, స్థానికులు వండిపెట్టిన వంటకాలను తినడం, వాళ్లమధ్యే గడపడం వంటివెన్నో చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..