వీళ్లేం తక్కువ కాదు!

కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే హీరోల భార్యలను చూస్తే- అబ్బ వీళ్లకేంటి, హాయిగా కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు అనిపిస్తుంది ఎవరికైనా. అది వాస్తవమే అయినా, కొందరు హీరోల భార్యలు మాత్రం ఇంటికే పరిమితం కాకుండా ఆసక్తులకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తూ తమదైన ముద్రవేస్తున్నారు.

Updated : 30 Jun 2024 12:36 IST

కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే హీరోల భార్యలను చూస్తే- అబ్బ వీళ్లకేంటి, హాయిగా కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు అనిపిస్తుంది ఎవరికైనా. అది వాస్తవమే అయినా, కొందరు హీరోల భార్యలు మాత్రం ఇంటికే పరిమితం కాకుండా ఆసక్తులకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తూ తమదైన ముద్రవేస్తున్నారు. వాళ్లెవరంటే...


 ఫొటోలు తీయిస్తూ...
- అల్లు స్నేహారెడ్డి

ప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో రకరకాల ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది అల్లు అర్జున్‌ భార్య స్నేహ. ఎన్నో మధురానుభూతుల్ని ఫొటోల్లో బంధించడం ఎంతో ఇష్టమనే ఆమె ‘పిక్‌ ఏ బూ’ పేరుతో ఓ ఫొటోగ్రఫీ స్టార్టప్‌ను పెట్టింది. వ్యాపార కుటుంబానికి చెందిన స్నేహ పెళ్లైన కొత్తలో- తన తండ్రికున్న ఇంజినీరింగ్‌ కాలేజీల బాధ్యతలు నిర్వహించేది. ఆ తరవాత తన ఆసక్తులకు అనుగుణంగా- రకరకాల థీమ్‌లతో ఫొటో స్టూడియోని ఏర్పాటు చేసింది. మెటర్నిటీ, పిల్లల ఫొటో షూట్‌ల కోసం పలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలానే, ఆ స్టూడియోలో డిజైనర్‌ దుస్తుల్నీ, ఫొటో షూట్‌ ప్రోపర్టీస్‌నీ అందిస్తోంది.


ఫ్యాబ్రిక్‌ తయారీ
-విరూప కంఠమనేని

టుడు అల్లరి నరేశ్‌ చెన్నైకి చెందిన విరూప కంఠమనేనితో ఏడడుగులు వేశాడు. పెళ్లప్పటికే విరూప సొంతంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నడిపిస్తోంది. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమె- కొంతకాలానికి ‘అర్నిసియా స్టోర్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. దుప్పట్లూ, బెడ్‌షీట్లూ, టవళ్ల తయారీకి ఉపయోగించే కాటన్‌ ఫ్యాబ్రిక్‌ను, ఆయా ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తోంది. ఆ సంస్థ ద్వారానే అలంకరణ కోసం ఉపయోగించే రాగి, ఇత్తడి వస్తువుల్నీ విక్రయిస్తోంది. దాంతోపాటు ఓ స్నేహితురాలితో కలిసి హైదరాబాద్‌, చెన్నై, దుబాయ్‌లలో ఓ ఆర్కిటెక్చరల్‌ డిజైనింగ్‌ సంస్థను కూడా నిర్వహిస్తోంది విరూప.


తనదైన గుర్తింపు
-అనూష శెట్టి

ర్ణాటకకు చెందిన అనూష శెట్టిని ప్రేమించి- రెండేళ్ల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు హీరో నాగశౌర్య. కర్ణాటకలోని కుందాపుర్‌కు చెందిన అనూష- పెళ్లికి ముందే, 2019లో ‘అనూషశెట్టి డిజైన్స్‌’ పేరుతో ఓ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను ప్రారంభించింది. చిన్నగా మొదలైన ఆ సంస్థ ఏడాది తిరిగేసరికి కర్ణాటక ప్రభుత్వం నుంచి ‘డిజైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకుంది. మరుసటి ఏడాది దేశంలోని నలభై ఏళ్లలోపు 40 మంది బెస్ట్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌లలో ఒకరిగానూ గుర్తింపు పొందిన అనూష పెళ్లి తరవాత హైదరాబాద్‌కూ సేవల్ని విస్తరించి తనదైన మార్గంలో దూసుకుపోతోంది.


నచ్చిన బొమ్మలు చేస్తూ...
- భూమా మౌనిక

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూమా మౌనికను మంచు మనోజ్‌ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తరవాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె కొన్నాళ్లకి వ్యాపారంలో అడుగు పెట్టింది. ‘నమస్తే వరల్డ్‌’ పేరిట’ బొమ్మల తయారీ సంస్థను స్థాపించి- బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌, కల్కి వంటి సినిమాల పాత్రలతో వీడియో గేమ్స్‌, కార్టూన్లూ, బొమ్మలూ తయారు చేస్తోంది. పిల్లలు వేసిన డ్రాయింగ్‌లనూ, పెయింటింగ్‌లనూ వాళ్ల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు... దాన్ని బొమ్మగా చేసి ఇంటికి పంపుతుంది ‘నమస్తే వరల్డ్‌’.


వ్యాపారం.. సేవ
- మిహీక బజాజ్‌ దగ్గుబాటి

మ జీవితంలోని మధురానుభూతులను నెటిజన్లతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది హీరో రానా భార్య మిహీక బజాజ్‌. నగల తయారీ సంస్థలను నడిపించే కుటుంబానికి చెందిన ఆమె చిన్నప్పట్నుంచీ వ్యాపారం చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. లండన్‌లో ఉన్న చెల్సియా యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ చేసి- ‘డ్యూ డ్రాప్‌ డిజైన్‌ స్టూడియో’ పేరుతో ఓ సంస్థను నెలకొల్పింది. దానిద్వారా ఇంటీరియర్‌ డిజైనింగ్‌తోపాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చేస్తోంది. హైదరాబాద్‌, ముంబయిలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న మిహీక- పేదలకు అండగా ఉండాలని ‘ముదిత’ పేరుతో ఓ ఎన్జీఓను స్థాపించింది. విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాల్లో సౌరవిద్యుత్తును ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలనూ కల్పిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు