హిమగిరుల్లో పంచ ప్రయాగలు!

‘ధవళవర్ణంలో ప్రకాశించే హిమగిరులూ పూల లోయలూ పవిత్ర చార్‌ధామ్‌ క్షేత్రాలూ పంచ కేదార్‌లూ సప్త బద్రీ దేవాలయాలూ పంచ ప్రయాగలూ... ఇలా అడుగడుగునా ప్రకృతి సౌందర్యాన్నీ ఆధ్యాత్మికతనీ నింపుకుని దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్‌లో చూడదగ్గ ప్రదేశాలెన్నో.

Published : 02 Dec 2023 23:45 IST

‘ధవళవర్ణంలో ప్రకాశించే హిమగిరులూ పూల లోయలూ పవిత్ర చార్‌ధామ్‌ క్షేత్రాలూ పంచ కేదార్‌లూ సప్త బద్రీ దేవాలయాలూ పంచ ప్రయాగలూ... ఇలా అడుగడుగునా ప్రకృతి సౌందర్యాన్నీ ఆధ్యాత్మికతనీ నింపుకుని దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్‌లో చూడదగ్గ ప్రదేశాలెన్నో. వాటిల్లో పవిత్ర నదీసంగమాలుగా పేరొందిన పంచ ప్రయాగల సందర్శన... నేత్రానందాన్నీ ముక్తినీ ప్రసాదిస్తుంది’ అంటున్నారు బెంగళూరుకు చెందిన జి.జగదీశ్వరి.

త్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌లోని త్రివేణీ సంగమం తరవాత ఉత్తరాఖండ్‌లోని పంచ ప్రయాగల్ని పవిత్ర సంగమ ప్రదేశాలుగా భావిస్తారు భక్తులు. ప్రయాగ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నదులు కలిసే ప్రదేశం అని అర్థం. ఆ నీటిలో మునిగితే బుద్ధి, శరీరం శుద్ధి అయి మోక్షానికి చేరువ అవుతారన్నది నమ్మకం. విష్ణు, నంద, కర్ణ, రుద్ర, దేవ ప్రయాగలుగా పిలిచే ఈ పంచ ప్రయాగలు- రిషీకేశ్‌ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లే దారిలో ఉంటాయి. వీటిని దర్శించేందుకు సాగిన మా యాత్ర ఆద్యంతం మనోహరం. 

భగీరథుడు గంగను భువిపైకి తెచ్చేందుకు ఘోర తపస్సు చేస్తాడు. ఆ ప్రవాహ వేగానికి భూమాత తట్టుకోలేదని శివుడు గంగను తన జటాఝూటంలో బంధించి ఒక్క పాయను మాత్రమే విడిచిపెడతాడు. ఆ ఒక్క పాయ వేగాన్ని కూడా భూదేవి తట్టుకోలేదని ఆ గంగామాత- అలకనంద, ధౌలిగంగ, నందాకిని, పిండార్‌, మందాకిని, భాగీరథి... అనే పాయలుగా చీలిందన్నది పౌరాణిక కథనం. అలా ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి అనే హిమానీ నదం నుంచి ఉద్భవించిన భాగీరథి, గంగగా మారే క్రమంలో ఆయా నదులతో సంగమించిన ప్రదేశాలే ఈ పంచ ప్రయాగలు.

దేవప్రయాగ: రుషీకేశ్‌ నుంచి బయల్దేరి దేవ ప్రయాగ చేరుకున్న మాకు బద్రీనాథ్‌కు వెళ్లే దారిలో కనిపించిన మొదటి సంగమం ఇది. చార్‌ధామ్‌ క్షేత్రాలకు ప్రవేశద్వారం. వేగంగా ప్రవహించే భాగీరథి ప్రశాంతంగా ఉన్న అలకనందలో కలిసే దృశ్యం చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా ఇక్కడ  రెండు నదులూ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సంగమం తరవాత నుంచే భాగీరథిని గంగానదిగా పిలుస్తారు. ఇక్కడే శ్రీరామచంద్రుడూ దశరథుడూ యాగాలు చేశారని ప్రతీతి. ముందుగా అక్కడున్న మెట్లమీదుగా వెళ్లి నదీసంగమంలో మునకలేశాం. తరవాత ఇక్కడ ఉన్న వేల ఏళ్ల నాటి రఘునాథ మందిరాన్నీ బేతాళ, బ్రహ్మ, సూర్య, వశిష్ట కుండ్‌లనూ దర్శించి రుద్రప్రయాగకి చేరుకున్నాం.

రుద్రప్రయాగ: అలకనందా, మందాకినీ నదుల సంగమ క్షేత్రమైన ఈ ప్రాంతంలోనే నారదముని, సంగీతంకోసం తపస్సు చేయగా- ఆ పరమేశ్వరుడు రుద్ర రూపంలో దర్శనమిచ్చాడట. శంకరుడు నారదునికి సంగీతం నేర్పిన ప్రదేశంగానూ రుద్రవీణను ఆలపించిన చోటుగానూ ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో పరమశివుడి కోటేశ్వర మందిరాన్నీ చాముండా దేవి ఆలయాన్నీ దర్శించి అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణ ప్రయాగకు బయల్దేరాం.

కర్ణప్రయాగ: నందాదేవి పర్వత శ్రేణి కింద ఉన్న హిమానీ నదం నుంచి ఉద్భవించిన పిండార్‌ నదితో అలకనంద కలిసే ప్రదేశం ఇది. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రాంతంలో పశ్చిమాన ఓ శిలా ఖండం ఉంది. ఇక్కడే కర్ణుడు తపస్సు చేశాడనీ, కర్ణుడి కోరిక మేరకు కృష్ణుడు ఆయన దహన క్రియలు ఇక్కడే చేశాడనీ చెబుతారు. ఇక్కడున్న కర్ణమందిరం, ఉమా మందిరాల్ని చూసి నంద ప్రయాగ చేరుకున్నాం.

నంద ప్రయాగ: ఇది నందాకినీ అలకనందల సంగమం. నందుడు శ్రీమన్నారాయణుని పుత్రుడుగా పొందేందుకు యాగం చేసిన ప్రదేశంగానూ చెబుతారు. కృష్ణుడు పెరిగిన నందుని ఊరు ఇదే అన్నది స్థానికుల కథనం. అందుకు గుర్తుగా నందగోపాలుని ఆలయం ఉందిక్కడ. దుష్యంతుడు శకుంతలను వివాహమాడిన కణ్వాశ్రమం ఇక్కడే ఉండేదనీ అంటారు.

విష్ణుప్రయాగ: నందప్రయాగకి 70 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. అలకనంద, ధౌలిగంగల సంగమక్షేత్రం. ఇక్కడ అష్టభుజి ఆకారంలో ఉన్న శ్రీమహావిష్ణు ఆలయం చూడముచ్చటగా ఉంది. నారదుడు అష్టాక్షరీ మంత్ర జపంతో శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నం చేసుకున్నాడనీ చెబుతారు. ఇక్కడికి 32 కి.మీ. దూరంలోనే ఉంది పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం. పర్వతారోహకులకు ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడి నుంచి పూలలోయ, హేమకుండ్‌ సరస్సులకీ వెళ్లవచ్చు. అవన్నీ చూసే సమయం లేదని మా బృందం బద్రీనాథ్‌కు చేరుకుని నారాయణుడిని దర్శించుకుని వెనుతిరిగాం.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..