పీసీఓడీకి కొత్త చికిత్స వచ్చింది!

పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌... క్లుప్తంగా పీసీఓడి... మనదేశంలో కనీసం పదిశాతం మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారట. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇది ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

Published : 30 Jun 2024 00:13 IST

పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌... క్లుప్తంగా పీసీఓడి... మనదేశంలో కనీసం పదిశాతం మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారట. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇది ఎక్కువగా ఉందని చెబుతున్నారు. నెలసరి క్రమం తప్పిపోతుండటం, ఊబకాయం, సంతానలేమి, అవాంఛనీయ రోమాలూ మొటిమలూ పెరగడం... ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి పీసీఓడి బాధితుల్లో. శరీరంలోని టెస్టోస్టిరాన్‌, యాంటీ ములేరియన్‌ హార్మోన్‌ల స్థాయులు అకస్మాత్తుగా పెరగడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటారు. ఈ హార్మోన్‌లు ఆకస్మికంగా ఎందుకిలా పెరుగుతాయో శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మలేరియాకి వాడుతున్న ఆర్టెమిసినిన్‌ మందు ఈ సమస్యలని చాలావరకూ తగ్గిస్తోందని గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు. అక్కడి ఫుడాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ముందుగా పీసీఓడీతో బాధపడుతున్న ఎలుకలపైన పరిశోధన చేశారు. ఆర్టెమిసినిన్‌తో వాటిలోని హార్మోన్‌ స్థాయులు స్థిరంగా మారడం గమనించారు. ఆ తర్వాత- పీసీఓడీతో బాధపడుతున్న మహిళలపైన దీన్ని ప్రయోగిస్తే... నెలసరి క్రమంగా రావడం గమనించారు. టెస్టోస్టిరాన్‌ తదితర హార్మోన్‌ల తీవ్రత గణనీయంగా తగ్గడం చూశారు. దానితోపాటూ ఇతర ఇబ్బందులూ తగ్గుతున్నాయని నిరూపించారు. ఆర్టెమిసినిన్‌ అన్నిరకాలా సురక్షితమైన మందుకాబట్టి పీసీఓడీకీ దీన్ని వాడొచ్చని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..