ఈ హెయిర్‌ ప్రొడక్టులు మెప్పించాయి

జుట్టు అందంగానూ, ఆరోగ్యంగానూ ఉండాలని కోరుకోని వారెవరుంటారు. అలాంటి అమ్మాయిల కోసమే మార్కెట్లో ఎప్పటికప్పుడు బోలెడన్ని హెయిర్‌ ప్రొడక్టులూ వస్తుంటాయి.

Published : 30 Jun 2024 00:25 IST

జుట్టు అందంగానూ, ఆరోగ్యంగానూ ఉండాలని కోరుకోని వారెవరుంటారు. అలాంటి అమ్మాయిల కోసమే మార్కెట్లో ఎప్పటికప్పుడు బోలెడన్ని హెయిర్‌ ప్రొడక్టులూ వస్తుంటాయి. వాటిల్లో అందర్నీ మెప్పించినవే ఇవి!


దువ్వెనలోనే సాంబ్రాణి!

తలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరడంతోపాటూ సువాసనా వస్తుందని సాంబ్రాణి ధూపాన్ని వేస్తుంటారు. ఎక్కువగా పసి పాపాయిల తలలకు పట్టించే ఈ సాంబ్రాణి పొగను కొంతమంది పెద్దవాళ్లూ వేసుకుంటారు. కానీ అదంతా పెద్ద తతంగం. ఆ పని అంతా లేకుండా దువ్వెనతోనే సాంబ్రాణి సువాసనలు జుట్టు కుదుళ్లను తాకితే ఎంత సులువుగా ఉంటుంది కదా. ఇప్పుడా వీలును తీసుకొచ్చింది ‘టూ ఇన్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ కోమ్‌ ఇన్‌సెన్స్‌ బర్నర్‌’. దీంట్లో సాంబ్రాణి పొడిని వేసి బటన్‌ నొక్కితే, అందులోంచి గుబాళించే పొగలు బయటకొస్తుంటాయి. ఏమాత్రం శ్రమ పడకుండా తల దువ్వుకుంటూనే ఎంచక్కా సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు.


ఇది లేజర్‌ కోమ్‌!

జుట్టు పలచబడటం, కుదుళ్లు మూసుకు పోవడం... లాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాటన్నింటినీ పోగొట్టడానికి మార్కెట్లో రకరకాల హెయిర్‌ ప్రొడక్టులు దొరుకుతాయి. అందులో భాగంగా వచ్చిందే ఈ లేజర్‌ కోమ్‌ కూడా. లేజర్‌ కాంతిని ప్రసరించే ఈ దువ్వెన- చూడ్డానికి మామూలుగానే కనిపించినా... దీంతో దువ్వుకున్నప్పుడు లేజర్‌ కాంతి తలలోకి వెళ్లి కుదుళ్లు దృఢంగా మారతాయి, జుట్టురాలే సమస్యలు చాలావరకూ అదుపులోకి వస్తాయి.


మర్దన చేసే దువ్వెన! 

కురుల కుదుళ్లు దృఢంగా ఉండాలంటూ చాలామంది తలకు నూనె పెట్టి మర్దన చేస్తుంటారు. కానీ సొంతంగా ఎవరికివాళ్లు మర్దన చేసుకోవడం కాస్త ఇబ్బందే. అలా అనీ ప్రతిసారీ ఎవరో ఒకరు అందుబాటులో ఉండరు కదా. అందుకు పరిష్కారం చూపిస్తూ వచ్చింది ‘ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్‌ అండ్‌ హెయిర్‌ ఆయిల్‌ అప్లికేటర్‌’. దీంట్లో నూనెపోసి తలపైన పెడితే- జుట్టంతా నూనె పట్టిస్తూనే మర్దనా చేసేస్తుంది. ఈ వస్తువుతో చేతికి నూనె అంటకుండానే పనైపోతుంది మరి.


ఒకే వస్తువు... ఐదు పనులు!

అమ్మాయిలున్న ప్రతి ఇంట్లో చాలావరకూ మేకప్‌ కిట్‌లో అద్దం ముంద]ు- దువ్వెనతోపాటూ హెయిర్‌ డ్రైయర్‌, స్ట్రెయిటనర్‌, కర్లర్‌లాంటివీ ఉంటాయి. జుట్టు ఆరడానికి ఒకటీ, హెయిర్‌స్టైళ్లు వేసుకోవడానికి మరొకటీ అంటూ రకరకాల వస్తువుల్ని వాడేస్తుంటారు. కానీ అవన్నీ విడివిడిగా తీసుకోకుండా అన్నీ ఒకదాంట్లోనే ఉండేలా ‘ఫైవ్‌ ఇన్‌ వన్‌ హెయిర్‌ డ్రైయర్‌ స్టైలింగ్‌ టూల్‌’ దొరుకుతోంది. దీన్ని దువ్వెనగా వాడుకుంటూనే డ్రైయర్‌గా ఉపయోగించుకోవచ్చు, ఇంకా స్ట్రెయిటనర్‌, కర్లర్‌గా చేసి జుట్టును నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఒకే వస్తువు ఐదు రకాల పనులు చేస్తే ఎవరికి మాత్రం నచ్చదు! 


క్షణాల్లో వేడి నూనె సిద్ధం!

కొంతమంది కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసుకునే తలకు పట్టిస్తారు. వేడి నూనెతో మర్దన చేస్తే హాయిగా ఉంటుంది కానీ అందుకూ కొంచెం సమయం కావాలి. అలాంటి వారి సమస్యను తీర్చడానికే ‘ఆయిల్‌ వార్మర్స్‌’ అందుబాటులో ఉన్నాయి. నూనె సీసాని వీటిల్లో ఉంచి కావాల్సినంత ఉష్ణోగ్రతతో వేడి చేసుకోవచ్చు. నూనె తలకు పెట్టుకోవాలనుకున్నప్పుడు అలా బటన్‌ నొక్కి ఇలా ఆఫ్‌ చేస్తే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..