అత్యాశ ఫలితం!

పూర్వం అవంతీపుర రాజ్యాన్ని ఆనందవర్మ పరిపాలిస్తుండేవాడు. తన ఏకైక కుమార్తె నందితా దేవి పెళ్లి సందర్భంగా రాజధానిలోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు.

Published : 30 Jun 2024 00:20 IST

పూర్వం అవంతీపుర రాజ్యాన్ని ఆనందవర్మ పరిపాలిస్తుండేవాడు. తన ఏకైక కుమార్తె నందితా దేవి పెళ్లి సందర్భంగా రాజధానిలోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు. నగలు, ఆవులు, గేదెలు, డబ్బు.. ఇలా ఎవరు ఏవి కోరుకుంటే వాటిని, వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అందిస్తున్నారు సైనికులు. అంతలోనే అక్కడికి ఓ అత్యాశపరుడైన వడ్డీ వ్యాపారి తన వేషం మార్చి వచ్చాడు. ‘రాజా, నేను ఈ రాజ్యంలోనే అందరికంటే పేదవాణ్ని. నాకు మిగిలిన వారి కన్నా ఎక్కువ నగలూ డబ్బూ ఇప్పించరూ!’ అని రాజును ప్రాధేయపడ్డాడు. కూతురి వివాహం సంతోషంలో ఉన్న ఆనందవర్మ, అతడి కోరికను కాదనలేకపోయాడు. ‘ఎవరక్కడ?... ఈ వ్యక్తికి అతడు మోయగలిగేంత ధనం, నగలూ కానుకగా ఇచ్చి పంపించండి’ అని సైనికులను ఆదేశించాడు. రాజాజ్ఞ మేరకు భటులు ఒక సంచి నిండా నగలూ డబ్బూ ఇచ్చారు. మారువేషంలో ఉన్న వడ్డీ వ్యాపారి దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా పెద్ద మొత్తంలో ధనం, నగలూ తీసుకోవాలనుకున్నాడు. సైనికులు ఇస్తున్న కొద్దీ ఇంకొంత, మరికొంత అంటూ అడగసాగాడు. స్వయంగా రాజుగారే చెప్పారు కాబట్టి భటులు సైతం ఎదురు చెప్పకుండా ఇవ్వసాగారు. రెండు మూడు సంచులు నింపుకున్న తర్వాత వాటిని తన భుజానికి ఎత్తుకుని ఆ వడ్డీవ్యాపారి ముందుకు కదిలాడు. కొన్ని అడుగులు ముందుకు నడవగానే బరువుకు తాళలేక కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. ఆస్థాన వైద్యులు వడ్డీ వ్యాపారిని పరీక్షించి వైద్యం చేశారు. ఇంతలోనే ఎవరో ఆ వ్యాపారిని గుర్తించి, విషయాన్ని భటులకు చెప్పారు. వారు రాజుకు ఫిర్యాదు చేశారు. ఆనందవర్మకు విపరీతమైన కోపం వచ్చినా, శిక్షించకుండా మన్నించాడు. కానీ వడ్డీ వ్యాపారికి మాత్రం అతడి అత్యాశే శిక్ష విధించింది. కిందపడ్డప్పుడు వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. మంచానికే పరిమితమయ్యాడు. తన దురాశే దుఃఖానికి కారణమైందని జీవితాంతం బాధపడ్డాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..