దిష్టిదోషాలు పోగొట్టే శక్తిస్వరూపిణి!

బండె మహంకాళి... పేరుకు ఉగ్రరూపమైనా ప్రసన్న వదనంతో, చల్లని చూపులతో కనిపిస్తూ తనని దర్శించుకునేవారి దోషాలను తొలగించి సకల శుభాలనూ కలిగిస్తుందీ జగన్మాత.

Updated : 30 Jun 2024 08:43 IST

బండె మహంకాళి... పేరుకు ఉగ్రరూపమైనా ప్రసన్న వదనంతో, చల్లని చూపులతో కనిపిస్తూ తనని దర్శించుకునేవారి దోషాలను తొలగించి సకల శుభాలనూ కలిగిస్తుందీ జగన్మాత. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే తప్ప దేవిని ఎవరూ దర్శించుకోలేరని చెప్పే ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని ప్రతీతి. ఏడాది మొత్తం భక్తజన సందోహంతో కిటకిటలాడే ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువుగా ఓ శిలలో కొలువుదీరి కనిపించడం విశేషం.

విశాలమైన ఆవరణలో, సుందరమైన నిర్మాణంతో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది బండె/బండి మహంకాళి ఆలయం. బెంగళూరులో ఉండే ఈ ఆలయంలో అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఒక శిలలోనే చెక్కినట్లుగా కనిపిస్తూ అనుగ్రహిస్తుంది. ఆ రూపానికే అభిషేకాలూ, పూజలూ, అలంకారాలూ చేస్తారు అర్చకులు. చిరునవ్వులు చిందిస్తూ అభయ-వరద ముద్రలతో, శంఖు-చక్రాలను దాల్చి చతుర్భుజిగా దర్శనమిచ్చే ఈ జగజ్జననిని పూజించే భక్తులు తమ కోర్కెలను విన్నవించుకుని అవి తీరాక శక్తికొలదీ చీర-సారె అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మకు ఇష్టమైన ఆషాఢ, శ్రావణ మాసాల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి పునీతులవుతారు. ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే...

స్థలపురాణం

చరిత్ర ప్రకారం ఈ ఆలయం సుమారుగా పన్నెండువందల సంవత్సరాల నుంచి ఉందని అర్చకులు చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కొండగుట్టలతో పొడవాటి చెట్లతో ఉండి అడవిని తలపించేదట. చుట్టుపక్కల గ్రామస్థులు తమ పశువుల్ని ఈ అడవికే తీసుకొచ్చేవారట. అలా ఓ యువతి గొర్రెలను తీసుకొచ్చి కాస్తున్నప్పుడు అమ్మవారు తన ఉనికిని తెలియజేసి, ఆలయాన్ని నిర్మించమంటూ ఆదేశించింది. ఆ మాటల్ని పట్టించుకోని ఆమె తన గొర్రెలను తీసుకుని వెళ్లిపోయిందట. ఇలా రెండుమూడు రోజులు వరుసగా దేవి మాటలు ఆకాశవాణి రూపంలో వినిపించడంతో విషయాన్ని గ్రామస్థులకు చెప్పింది. దాంతో వాళ్లు వచ్చి వెతగ్గా ఓ శిలలో అమ్మవారి రూపం కనిపించడంతో అప్పటి నుంచీ పూజలు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఇక్కడే ఆలయాన్ని నిర్మించారనీ తరత్తర్వాత అభివృద్ధి చేశారనీ కథనం.

కోరిక చెప్పి తాళం వేస్తారు...

అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం మామూలే. ఇక్కడ కొలువైన శక్తిస్వరూపిణికి ఆ దండలు వేయడంతోపాటు.. నిమ్మ దీపాలను వెలిగించి వాటిని అమ్మవారికి చూపిస్తారు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులు శక్తిస్తంభం దగ్గరున్న త్రిశూలానికి నిమ్మకాయల్ని గుచ్చుతారు. ఇలా చేయడం వల్ల తమపైన ఉన్న దిష్టిదోషాలు పోతాయని విశ్వసిస్తారు. ఆ తరువాత అమ్మవారికి తమ కోర్కెను విన్నవించుకుని అక్కడే ఉన్న జాలీలాంటిదానికి తాళాలు వేయడాన్ని చూడొచ్చు. అలా తాళం వేయడం వల్ల అమ్మవారు భక్తుల కోర్కెలను గుర్తుపెట్టుకుని మరీ నెరవేరుస్తుందని ఓ నమ్మకం. ఇవన్నీ దాటి ముందుకెళ్లేకొద్దీ గర్భగుడికి ఎదురుగా ఏనుగు ఆకారంలో ఉన్న శిల కనిపిస్తుంది. దేవి దర్శనానంతరం... పరమేశ్వరుడినీ, వినాయకుడినీ, సుబ్రహ్మణ్యేశ్వరుడినీ, నవగ్రహాలనీ, ఇతర గ్రామదేవతలనీ పూజించి తరిస్తారు. ఉపాధి, వ్యాపార వ్యవహారాలు, వివాహం కావడంలో ఆటంకాలున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే సత్వర ఫలితం లభిస్తుందని చెబుతారు ఆలయాన్ని తరచూ దర్శించుకునే భక్తులు. ఇక, ఇక్కడ, రోజువారీ చేసే పూజలతోపాటు నవరాత్రుల సమయంలో నిర్వహించే బొమ్మల కొలువునూ చూసి తీరాల్సిందే. అలాగే ఆ సమయంలో రోజుకో రూపంలో అమ్మవారికి చేసే అలంకారాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. పౌర్ణమి- అమావాస్య రోజుల్లో... ఆషాఢ-శ్రావణ మాసాల్లో విశేషంగా పూజలు నిర్వహించే ఈ క్షేత్రానికి రావాలంటే అమ్మవారి ఆజ్ఞ ఉండాలని అంటారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం... బెంగళూరు గుట్టహళ్ళిలోని కెంపెగౌడ నగర్‌లో ఉంటుంది. బెంగళూరు వరకూ విమానంలో చేరుకుంటే ఆలయానికి దాదాపు గంటలో వెళ్ళొచ్చు. అదే రైల్లో రావాలనుకునేవారు బెంగళూరు కె.ఎస్‌.ఆర్‌. రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..