నెయిల్‌ పాలిష్‌...రూ. 8 కోట్లు!

‘ఎంత ధనవంతులైతే మాత్రం ఒళ్లంతా బంగారం పూసుకుంటారా, వజ్రాలు అతికించుకుంటారా’ అన్న డైలాగులు ఇప్పుడు ఎవరైనా అన్నారంటే ఆ మాటలు వెనక్కి తీసుకోక తప్పదు. అవునుమరి, శ్రీమంతులు తమ గోళ్లపైకి బంగారం, వజ్రాలూ, ప్లాటినంల తళుకుల్ని తీసుకొచ్చేస్తున్నారు.

Published : 29 Jun 2024 23:57 IST

‘ఎంత ధనవంతులైతే మాత్రం ఒళ్లంతా బంగారం పూసుకుంటారా, వజ్రాలు అతికించుకుంటారా’ అన్న డైలాగులు ఇప్పుడు ఎవరైనా అన్నారంటే ఆ మాటలు వెనక్కి తీసుకోక తప్పదు. అవునుమరి, శ్రీమంతులు తమ గోళ్లపైకి బంగారం, వజ్రాలూ, ప్లాటినంల తళుకుల్ని తీసుకొచ్చేస్తున్నారు. అత్యంత విలువైన ఆ లోహాలతో తయారుచేసిన లగ్జరీ నెయిల్‌ పాలిష్‌లెన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఆ గోళ్ల రంగుల సంగతులు విన్నారంటే ఆశ్చర్యంతో  నోరెళ్లబెట్టాల్సిందే!

సొగసరి చేతివేళ్లను ఇంకాస్త అందంగా చూపడానికి- గోళ్లకు అద్దే నెయిల్‌ పాలిష్‌ల ధర ఎంత ఉంటుంది... మామూలువి రూ.వందో, రెండొందలకో వస్తే- కాస్త లగ్జరీ బ్రాండ్‌వి పది వేల రూపాయల వరకూ దొరుకుతాయి కదా. కానీ కోట్ల రూపాయల విలువతో విల్లా ధరకు సమానమైన ఖరీదుతో ఉన్న నెయిల్‌ పాలిష్‌లూ వచ్చాయండోయ్‌. నగల ధగధగలతో పోటీపడే వాటి వివరాల్లోకి వెళితే... తమ అందచందాలతో ఆకట్టుకునే మోడళ్లూ, సెలెబ్రిటీలూ హెయిర్‌స్టైల్‌ నుంచి చెప్పుల వరకూ అన్నీ ప్రత్యేకంగానే ఉండాలనుకుంటారు. ఆ అలంకరణలో గోళ్లసోకులు ఏమాత్రం తగ్గకూడదనో, అన్నిట్లోనూ ఉండే విలాసం నెయిల్‌పాలిష్‌ల్లోనూ తీసుకురావాలనో ఫ్యాషన్‌ డిజైనర్లు- ఖరీదైన నెయిల్‌పాలిష్‌లకు రూపమిస్తుంటారు. అలా వచ్చినవే ప్రపంచంలోనే ఖరీదైన ఈ గోళ్ల రంగులు కూడా.

ఎంత ఖరీదో...

జిగేళ్ల గౌనుకు తగ్గట్టు గోళ్లనూ మెరిపించడానికి వచ్చిందే ‘ఆజచర్‌ వైట్‌ డైమండ్‌ నెయిల్‌ పాలిష్‌’. లాస్‌ ఎంజెలెస్‌కు చెందిన ప్రత్యేకమైన లగ్జరీ జ్యువెలరీ సంస్థ ‘ఆజచర్‌’ దీన్ని తయారుచేసింది. 98 క్యారెట్ల వజ్రాల పొడిని కలిపి ప్లాటినమ్‌ మూతతో మెరుపులు దిద్ది రూపొందించిన దీని ధర ఇంచుమించు ఎనిమిదికోట్ల ముప్ఫై లక్షల రూపాయలు. వజ్రాల చమక్కులతో ఎంత దూరం నుంచైనా అతిథుల కళ్లను అమాంతం తనవైపు లాగేసుకునే ఈ నెయిల్‌ పాలిష్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన గోళ్ల రంగు!.

ఇంకా ఎంత కాదనుకున్నా ఫ్యాషన్లో నలుపు రంగుదే హవా కదా. అందుకే ఆ రంగును మరింత అందంగా చూపుతూ బ్లాక్‌ డైమండ్లతో ఈ కంపెనీనే ‘బ్లాక్‌డైమండ్‌ నెయిల్‌ పాలిష్‌’ను తీసుకొచ్చింది. 267 క్యారెట్ల నలుపు రంగు వజ్రాల పొడిని చేర్చి రూపొందించిన ఈ గోళ్ల రంగు ధర- దాదాపు రెండుకోట్ల  ఇరవైలక్షల రూపాయలు. బాబోయ్‌ అంత ధర పెట్టి ఎవరు కొంటారనుకుంటున్నారేమో... సెలెబ్రిటీలు చాలామందే దీన్ని కొనుగోలు చేశారట.
బంగారంతో వచ్చే కళే వేరు కదా. అందుకే గోటిపైకీ ఆ పసిడి కాంతి పాకిపోయింది. యూకేకి చెందిన ‘మోడల్స్‌ ఓన్‌ నెయిల్‌ పాలిష్‌’ కంపెనీ ‘గోల్డ్‌ రష్‌’ పేరుతో గోల్డ్‌ నెయిల్‌ పాలిష్‌ను తయారుచేసింది. ఈ గోళ్ల రంగు ధర కోటిరూపాయలకు పైనే ఉంటుంది. ఎంత బంగారమైనా అంత ఖరీదు ఎందుకు అంటే... పసిడి ఛాయ కోసం బంగారాన్నీ, అదనపు మెరుపుల కోసం వజ్రాల పొడినీ కలిపి చేశారు మరి.

ప్లాటినం కూడా...

నగల్లో అందాన్ని తీసుకొచ్చే ప్లాటినం గోళ్లపైన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదూ... ప్లాటినం పొడికి జతగా రకరకాల రంగుల్నీ కలుపుతూ ఎల్లే కాస్మెటిక్స్‌ సంస్థ- ‘ఎల్లే నెయిల్‌పాలిష్‌’ను తీసుకొచ్చింది. దీని ధర ఇంచుమించు 50 లక్షల రూపాయలు. ఇవేకాదు, ఇంకా లక్షల రూపాయల ఖరీదు చేసే పది క్యారెట్ల వజ్రాలతో తయారు చేసిన ‘ఐస్డ్‌ నెయిల్‌ పాలిష్‌’... వజ్రాలూ, నీలాలూ, కెంపులూ వాడి చేసిన ‘డైమండ్‌ సఫైర్‌ అండ్‌ రుబీ నెయిల్‌ పాలిష్‌’... 24 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ‘పింక్‌ కార్పెట్‌ పాలిష్‌ జెల్‌’... లాంటివీ చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా, జ్యువెలరీగా మారిన ఈ నెయిల్‌ పాలిష్‌లు మాత్రం భలే ఉన్నాయి కదూ!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..