బుల్లెట్‌ బండిని బతికించాడు!

‘రాయల్‌ఎన్‌ఫీల్డ్‌.. స్టేటస్‌ సింబల్‌నిచ్చే బైక్‌... ధడ్‌ధడ్‌ మంటూ వచ్చే ఆ బండి శబ్దం ఇచ్చే కిక్కే వేరు... వాహనాల్లో తిరుగులేని బ్రాండ్‌... దాన్ని కొనడం ఓ కల...’ ఇలా ఆ బండి గురించి బోలెడన్ని విషయాలు చెప్పేస్తారు అబ్బాయిలు. అలాంటి మోటార్‌సైకిల్‌ తయారీని ఒకప్పుడు ఆపేయాలనుకున్నారట.

Updated : 30 Jun 2024 16:49 IST

‘రాయల్‌ఎన్‌ఫీల్డ్‌.. స్టేటస్‌ సింబల్‌నిచ్చే బైక్‌... ధడ్‌ధడ్‌ మంటూ వచ్చే ఆ బండి శబ్దం ఇచ్చే కిక్కే వేరు... వాహనాల్లో తిరుగులేని బ్రాండ్‌... దాన్ని కొనడం ఓ కల...’ ఇలా ఆ బండి గురించి బోలెడన్ని విషయాలు చెప్పేస్తారు అబ్బాయిలు. అలాంటి మోటార్‌సైకిల్‌ తయారీని ఒకప్పుడు ఆపేయాలనుకున్నారట. ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం తొమ్మిది లక్షల మోటార్‌సైకిళ్ల వరకూ అమ్ముడుపోయే స్థాయికి చేరుకున్న ఈ సంస్థ విజయం వెనుక ఉన్నది దాని సీఈవో, ఎండీ సిద్ధార్థ లాల్‌.

‘సంస్థను అమ్మేస్తే నష్టాలు తగ్గుతాయి. అయితే కుటుంబం పరువు పోతుంది. కానీ ఏదో ఒకటి తప్పదు’... అంటూ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతుంటే సిద్ధార్థ లాల్‌ మాత్రం తనకు కొంత సమయం ఇమ్మంటూ తండ్రిని అభ్యర్థించాడు. అన్నట్టు గానే దశాబ్దం తిరిగేసరికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ దిశనే మార్చేశాడు. అబ్బాయిలు ఇష్టపడే బండిగా దానికో క్రేజ్‌ను తీసుకొచ్చాడు. అయితే ఇదంతా ఏదో మ్యాజిక్‌ చేసినట్లుగా జరిగిపోలేదు. సిద్ధార్థ లాల్‌ స్వస్థలం దిల్లీ. తండ్రి విక్రమ్‌ లాల్‌ ఐషర్‌ మోటార్స్‌ వ్యవస్థాపకుడు. ట్రాక్టర్ల తయారీ, వాహనాలకు సంబంధించిన కాంపోనెంట్లు, ట్రక్కులు, ఆహారం, బండ్లు, వస్త్రాలు, చెప్పులు... ఇలా దాదాపు పదిహేను రకాల వ్యాపారాలకు అధిపతి. రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ అందులో ఒకటి. నిజానికి ఈ బండిని మొదటిసారి ఇంగ్లండ్‌లో తయారుచేసినా కొన్నాళ్లకు చెన్నైలోని సుందరం మోటార్స్‌ ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తరువాత విక్రమ్‌లాల్‌ టేకోవర్‌ చేయడంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఐషర్‌ మోటార్స్‌లో భాగమైంది. అయితే వీటి అమ్మకాలు పెద్దగా లేక ఒకానొక సమయంలో ఇరవైకోట్ల రూపాయల నష్టం రావడంతో సంస్థను మూసేయడమా లేక కొనసాగించడమా అనే చర్చ మొదలైంది. సరిగ్గా అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చిన సిద్ధార్థలాల్‌ సంస్థ బాధ్యతల్ని తీసుకున్నాడు. ‘మా ఇంట్లో ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. అందుకే ఏం చేసైనా సరే సంస్థను కాపాడాలనుకున్నా. మా నాన్నతో అదే చెప్పి
సంవత్సరం టైమ్‌ కావాలంటూ అడిగా’... అనే సిద్ధార్థ చిన్నచిన్న ప్రయోగాలు చేస్తూనే అనుకున్నది సాధించాడు.

వాటిని అమ్మేశాడు...

సిద్ధార్థ డూన్‌ స్కూల్‌లో చదివి ఎకనమిక్స్‌లో డిగ్రీ చేశాడు. ఆ తరువాత ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నాడు. ఇరవై ఆరేళ్లకు వ్యాపారంలోకి వచ్చేసరికి ఐషర్‌ మోటార్స్‌ సంస్థ రాయల్‌ఎన్‌ఫీల్డ్‌తో కలిపి దాదాపు పదిహేను రకాల వ్యాపారాలు నిర్వహించేది. వీటన్నింటితో వచ్చే అరకొర లాభాలతో సమయం వృథా చేసుకోకూడదనుకున్న సిద్ధార్థ వాటిల్లో పదమూడు వ్యాపారాలను వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. అది చూసి డైరెక్టర్లు ఉడుకు రక్తం, తొందరపాటు నిర్ణయం, జోకర్‌ అంటూ విమర్శించారు. అవేవీ పట్టించుకోకుండా తన సమయాన్నంతా కేవలం ట్రక్కులు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కోసం కేటాయించాడు. తనకెంతో ఇష్టమైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పైన కిలోమీటర్ల కొద్దీ రోడ్లమీద ప్రయాణించాడు. దారిపొడవునా అపరిచితులతో మాట్లాడుతూ బండ్ల గురించి వాళ్ల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకుని సమస్యల్ని అర్థంచేసుకున్నాడు.

సాంకేతిక లోపాలు సరిదిద్ది...

‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంజిన్‌ ఇట్టే పాడైపోతుంది. గేర్లు నాసిరకం. పెట్రోల్‌ లీకేజీ ఎక్కువ. చిన్న రిపేరు వచ్చినా బోలెడు ఖర్చు...’ ఇలా కస్టమర్ల నుంచి వచ్చే ప్రతి సమస్యనూ పరిగణించాడు. ఇంజిన్‌ను ఎక్కువకాలం మన్నేలా చేశాడు. బాడీకోసం స్టీలును ఎంచుకున్నాడు. గేర్లను ఎడమవైపు మార్చాడు. యాక్సిలరేటర్‌, క్లచ్‌, కేబుళ్లు, గేర్లు.. ఇలా ప్రతిదాన్నీ మార్చేందుకు ప్రయత్నిస్తూనే రంగుల్లోనూ ప్రయోగాలు చేశాడు. బండ్లకు థండర్డ్‌ బర్డ్‌, ఎలెక్ట్రా ఎక్స్‌, హిమాలయన్‌, హంటర్‌ 350, క్లాసిక్‌ 359, షాట్‌గన్‌.. వంటి పేర్లతో కొత్త మోడళ్లను ఆవిష్కరించాడు. సేల్స్‌ తగ్గుతాయని డీలర్లు హెచ్చరిస్తున్నా కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్‌లను పూర్తిగా ఆపేశాడు.  కంపెనీ అధ్వర్యంలోనే షోరూంలను తెరిచేందుకు ప్రయత్నించాడు. క్రమంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ ఉంటే... ఓ స్టేటస్‌ సింబల్‌ అనే స్థాయికి తీసుకురావడంతో నాలుగేళ్లకు అంటే... 2010కి యాభైవేల బైకుల్ని అమ్మగలిగాడు. మరో నాలుగేళ్లకు అంటే 2014కి 702 కోట్ల టర్నోవరునూ సాధించాడు. అందులో 80 శాతం రాయిల్‌ఎన్‌ఫీల్డ్‌ నుంచి వచ్చిన లాభాలేనట. ‘ఒకప్పుడు కేవలం మరో అయిదు వందలు బైకుల్ని అమ్మితే చాలనుకున్న నేను ప్రస్తుతం తొమ్మిదిలక్షల వాహనాలను అమ్మే స్థాయికి చేరుకున్నా. 2023-2024 మార్చికి దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల టర్నోవరు సాధించాం. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం...’ అనే సిద్ధార్థ కొత్తగా ఏ మోడల్‌ను తీసుకొచ్చినా తనే ముందు నడిపి సంతృప్తి చెందాకే మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అవుతాడట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..