అడవిలో ఆటాపాటకి సిద్ధమా?

అడవి ఆకర్షణ అంతా ఇంతా కాదు. చుట్టూ విచ్చుకున్న పచ్చదనం, గాలి మోసుకొచ్చే పసరు సుగంధం, కాలుష్యం అంటని కొండలూ గుట్టలూ, జంతుజాలాల గుట్టుమట్లూ... ఇవన్నీ మనసుకి అచ్చంగా సూదంటురాళ్లు! ‘కానీ అడవుల్లోకెళ్ళడం సగటు నగరజీవికి అయ్యే పనేనా?!’ అనుకునేవాళ్ళకి సాధ్యమేనని చెబుతోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

Published : 29 Jun 2024 23:31 IST

అడవి ఆకర్షణ అంతా ఇంతా కాదు. చుట్టూ విచ్చుకున్న పచ్చదనం, గాలి మోసుకొచ్చే పసరు సుగంధం, కాలుష్యం అంటని కొండలూ గుట్టలూ, జంతుజాలాల గుట్టుమట్లూ... ఇవన్నీ మనసుకి అచ్చంగా సూదంటురాళ్లు! ‘కానీ అడవుల్లోకెళ్ళడం సగటు నగరజీవికి అయ్యే పనేనా?!’ అనుకునేవాళ్ళకి సాధ్యమేనని చెబుతోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ. సాహసికులే కాదు సామాన్యులూ ఆనందించేలా హైదరాబాద్‌కి అతిదగ్గర ‘ఫారెస్ట్‌ క్యాంప్‌’ని పరిచయంచేసింది. దాని విశేషాలివి...

హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌) పక్కన నార్సింగి-తెలంగాణ పోలీసు అకాడమీ సర్వీస్‌ రోడ్డుకి దగ్గర్లో ఉంటుంది ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్క్‌. లోపలికి అడుగుపెట్టగానే అక్కడున్న ఊడలమర్రి ఆహ్వానం పలుకుతుంది. ఆ చెట్టు రచ్చబండ దగ్గరే పర్యటకులందరినీ సమావేశపరిచి క్యాంప్‌ తాలూకు వివరాలని వెల్లడిస్తారు అటవీ సిబ్బంది. ఆ తర్వాత చెక్‌డ్యామ్‌ దగ్గరకి తీసుకెళ్ళి అడవుల్లో టెంట్‌లు వేయడం ఎలాగో నేర్పిస్తారు. పడక వసతితో కూడిన గుడారాల్ని మనమే సిద్ధం చేసుకున్నాక రాత్రి భోజనం పెడతారు. తర్వాత, ప్రతి ఒక్కరికీ ఓ లాంతర్‌ ఇచ్చి అడవిలోకి తీసుకెళతారు. నేలకి దిగివస్తున్నట్టున్న నక్షత్రాలూ, కీచురాళ్ళ రొదల మధ్య చీకట్లో ఒకటిన్నర కిలోమీటరు దాకా నడిపిస్తారు. రాత్రి క్యాంప్‌ఫైర్‌ ఆటాపాటల తర్వాత అలసిపోయి నిద్రపోతే... ఉదయం ఐదుగంటలకల్లా నిద్రలేపి పక్షుల సందర్శనకు తీసుకెళతారు. ఆషామాషీగా కాదు... ఇందుకోసం ప్రత్యేకంగా పక్షిశాస్త్రవేత్తల్నే రప్పిస్తున్నారు. పర్యటకులు ప్రతి ఒక్కరికీ బైనాక్యులర్స్‌ ఇచ్చి పక్షిజాతుల్ని పరిచయం చేసుకోమంటారు. ఒక్క చిలుకూరు అడవిలోనే సుమారు 250 పక్షి జాతులుంటే... వాటిలో కనీసం 20  పక్షులకి సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత సైనికుల్లా తీగలతో వేలాడుతూ చెరువునీ, పక్కనే ఉన్న లోయనీ దాటిస్తారు. ఈ సరదా సాహసం తర్వాత అల్పాహారం అందించి... అడవి తరపున అందరికీ వీడ్కోలు పలుకుతారు అటవీ సిబ్బంది!

ఓ నగరానికి దగ్గరగా ఇటువంటి ఫారెస్ట్‌ క్యాంప్‌ నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ ‘ఫారెస్ట్‌ క్యాంప్‌’ శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం దాకా ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు 9493549399, 9346364383 నంబర్‌లకి ఫోన్‌ చేసి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఐదు-పన్నెండేళ్ళ మధ్య వయసున్నవారికి రూ.1500, ఆపైన వయసులవారికి రూ.1800 వసూలు చేస్తున్నారు. స్కూళ్లూ, కాలేజీ బృందాలకి ప్రత్యేక రాయితీలూ ఉన్నాయి. ఏదేమైనా హైదరాబాద్‌ నగర శివారులోనే అడవి అందాలని ఆస్వాదించడానికి... ఇది చాలా చక్కటి అవకాశమని చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..