పువ్వుల టీపాయ్‌ అదిరిందోయ్‌..!

అతిథులకు స్వాగతం పలికే కాఫీ టేబుల్‌- అందమైన పూలబొకేలానూ మారిపోతే... చూసేవారికి ఆనందంతోపాటూ ఆశ్చర్యంగానూ ఉండదా మరి. ఆ అనుభూతిని ఇవ్వడానికే ‘ఎపోక్సీ రెజిన్‌ ఫ్లవర్‌ టేబుళ్లు’ మార్కెట్లోకి వచ్చేశాయి.

Published : 30 Jun 2024 00:17 IST

అతిథులకు స్వాగతం పలికే కాఫీ టేబుల్‌- అందమైన పూలబొకేలానూ మారిపోతే... చూసేవారికి ఆనందంతోపాటూ ఆశ్చర్యంగానూ ఉండదా మరి. ఆ అనుభూతిని ఇవ్వడానికే ‘ఎపోక్సీ రెజిన్‌ ఫ్లవర్‌ టేబుళ్లు’ మార్కెట్లోకి వచ్చేశాయి. సౌందర్యోపాసకుల మనసును దోచేస్తూ ఇంటి అలంకరణలో ముందు వరసలోకి చేరిపోయాయి!

రాధనగా ఇష్టదైవాన్ని పూజించాలన్నా, ప్రత్యేకసందర్భాల్లో సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పాలన్నా, అతిథులకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలకాలన్నా... ఆఖరికి ప్రియురాలితో ప్రేమ ఊసులు పంచుకోవాలన్నా... మనసులో ముందుగా మెదిలేది రంగుల పూలగుత్తులే. మాటలకందని హాయినిస్తూ, చూడగానే ఆనందాన్నిచ్చే పూల ప్రత్యేకతే అందుకు కారణం. అందుకేమరి, అంతటి అందాన్ని సొంతం చేసుకున్న పువ్వుల సోయగాల్ని నట్టింట్లోని టీపాయ్‌లోకి చొప్పించేశారు డిజైనర్లు. తీరొక్క పూలను చక్కని చిత్రంలా చూపిస్తూ ఈ ‘ప్రిజర్వ్‌డ్‌ ఫ్లవర్‌ ఎపోక్సీ రెజిన్‌ టేబుల్స్‌’ను తీసుకొచ్చారు. సాధారణంగా ఫర్నిచర్‌లో భాగమైన కాఫీ టేబుల్‌- ఇప్పుడు ఇంటీరియర్‌లోకీ చేరిపోయి ఇంటికి సరికొత్త లుక్కును తెచ్చేస్తోంది. అందుకే కదా, గృహిణులూ ఇంటికి తగ్గ టీపాయ్‌ని ఎంచుకోవడమే కాదు... ఫ్లవర్‌వాజులూ టేబుల్‌ క్లాత్‌తో దాన్ని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు. చుట్టూ సోఫాల మధ్యలో చక్కగా ఒదిగి ఉండే ఆ కాఫీ టేబులే- అందమైన కళాఖండంగానూ మారిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నారేమో కానీ- ఇక అదనపు అలంకరణలు ఏమాత్రం అవసరంలేని ఈ పూల టీపాయ్‌లకు రూపమిచ్చేశారు.

ఎన్ని రకాలో...

ఫ్లవర్‌ కాఫీ టేబుళ్లు అనగానే అవేవో ఉత్తుత్తి పువ్వులనుకునేరూ. ప్రకృతిలో దొరికే నిజమైన పూలతో తీర్చిదిద్దినవే ఇవి. నచ్చిన పువ్వుల్ని రెజిన్‌లో భద్రపరుస్తూ పెండెంట్ల దగ్గర్నుంచి సెల్‌ఫోన్‌ కవర్ల వరకూ బోలెడన్ని రెజిన్‌ ఫ్లవర్‌ ఆర్ట్‌ ఉత్పత్తులొచ్చాయి కదా. అదే తరహాలో గులాబీలూ, చామంతులూ, ఆర్కిడ్లూ... ఇలా ఎన్నెన్నో పువ్వుల్ని ఉపయోగించి, మెరిసే జిగురు లాంటి ఎపోక్సీ, రెజిన్‌ పదార్థాల్ని జత చేస్తూ ఈ పూల కాఫీ టేబుళ్లను తయారుచేస్తున్నారన్నమాట. ప్రత్యేక పద్ధతిలో పువ్వుల్ని ఎండబెట్టి, ఆ తర్వాత పూల ఆకారం పాడవ్వకుండా వాటిని జాగ్రత్తగా రెజిన్‌ ఇంకా ఎపోక్సీ పదార్థాల్లో అమర్చి- ఇదిగో ఇలా ‘రంగుల పువ్వుల గుత్తులన్నీ టీపాయ్‌లోకి దూరిపోయాయా’ అన్నట్టుగా ఎంతో అందంగా సిద్ధం చేస్తారు. హాలుకు నప్పేలా బోలెడన్ని రూపాల్లో అందుబాటులో ఉన్నాయివి. పారదర్శకంగా గాజులా కనిపించే ఈ ఎపోక్సీ ఫ్లవర్‌ టేబుళ్లలోని రంగుల పూలు- మరింత మెరిసి పోయేలా వీటి లోపల లైట్లనూ అమర్చుతారు. అటు లైట్ల కాంతులూ, ఇటు పూల రంగులూ కలగలిసిపోతూ ఈ పూల కాఫీ టేబుల్‌ ఇంటికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. అంతేనా, దీన్ని చూసిన అతిథులు సంభ్రమాశ్చర్యాలతో- ‘టీపాయ్‌లో దాగున్న పూలెంతో అతిశయం’ అంటూ రాగం తీయకమానరంటే నమ్మండి...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..