గృహమే కదా స్వర్గసీమ

‘‘మీ అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి సాకేత్‌ కూడా అంగీకారం తెలిపాడు. ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి’’ అన్నారు వెంకట్రావు, రామనాధంగారి కేసి తిరిగి. ఆయన మాటలకు రామనాధం-వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లి విరిసింది.

Updated : 30 Jun 2024 01:29 IST

- ఎం.ఆర్‌.వి.సత్యనారాయణ మూర్తి

‘‘మీ అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి సాకేత్‌ కూడా అంగీకారం తెలిపాడు. ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి’’ అన్నారు వెంకట్రావు, రామనాధంగారి కేసి తిరిగి. ఆయన మాటలకు రామనాధం-వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లి విరిసింది.

అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వసంతలక్ష్మి భర్త వైపు చూసి, కళ్ళతోనే సైగ చేసింది, మిగతా విషయాలు అడగమని

‘‘అయితే కట్న కానుకల గురించి ఒకమాట అనుకుంటే...’’ రామనాధం గారు నెమ్మదిగా అన్నారు.

‘‘చూడండి బావగారూ, మేము కట్న కానుకలకు వ్యతిరేకం. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు.

అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ‘ఖరీదైన సూట్‌ పెట్టాలీ... పది జతలు బ్రాండెడ్‌ బట్టలే పెట్టాలీ’ అని మేం కోరం. పంతులుగారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు. మీకు ఎలా వీలయితే అలా పెట్టండి. సంప్రదాయాన్ని పాటించండి. అది చాలు. ఏమంటారు?’’ ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు.

ఆయన మాటలకు రామనాధం-వసంతలక్ష్మి చాలా సంతోషించారు.

‘‘మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం. మీకు ఎక్కడా మాట రానీయం’’ అన్నారు రామనాధం.

‘‘ఆఁ ఇంకో విషయం బావగారూ, మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం. అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం. సరేనా?’’ చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు.

‘అలాగే’ అన్నట్టు తలూపారు రామనాధం.

కల్యాణ మండపం అద్దె, వీడియోలు, ఫొటోల ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాధం. తర్వాత పంతులుగారిని పిలవడం, పెళ్ళి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి.

సాకేత్‌-సుధారాణిల పెళ్ళి వైభవంగా, ఏ విధమైన అలకలూ ఇబ్బందులూ లేకుండా జరిగింది. నూతన దంపతులు ఒక వారంరోజులు ‘హనీమూన్‌’కి వెళ్ళి వచ్చారు. ఇద్దరూ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. రామనాధం-వసంతలక్ష్మి బెంగుళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావాల్సినవి అన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు.

రోజూ వియ్యాలవారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాధం-వసంతలక్ష్మి.

‘‘ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్ళి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావుగారు చాలా గొప్పవారు.

ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంతా’’ అన్నారు రామనాధం భార్యకేసి తిరిగి.

‘‘అవునండీ. వారు ఏ గొంతెమ్మ కోర్కెలూ కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు. చాలా సహృదయులు ఇద్దరూ’’ అంది వసంతలక్ష్మి. ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురి పెళ్ళి ఘనంగా ఏ విధమైన ఆటంకాలూ లేకుండా జరిగినందుకు.

పెళ్ళి అయిన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి-సాకేత్‌ శివపురం రావడం వెళ్ళడం జరిగింది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెలతప్పడంతో వెంకట్రావు- వసుంధర దంపతులూ రామనాధం-వసంతలక్ష్మి దంపతులూ చాలా ఆనందించారు. ఐదో నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులని చూడటానికి శివపురం వచ్చింది. సాకేత్‌కి ఆఫీస్‌లో పని ఉండడం వలన అతను రాలేదు.

* * * * *

ఓ ఆదివారంనాడు సాకేత్‌ స్నేహితుడు సుధీర్‌ ఫ్లాట్‌లో కలిశారు మిత్రబృందం అందరూ. సుధీర్‌ భార్య పురిటికి వెళ్ళింది. అతను ఒక్కడే ఉంటున్నాడు.

‘‘సుధీర్‌ మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్ళలేదా?’’ వెంకటపతి రాజు అడిగాడు.

‘‘లేదు రాజూ, పై వారం వెళ్ళాలి’’ అన్నాడు సుధీర్‌.

‘‘నువ్వు విజయవాడ వెళ్తే మీ మావ బస్టాండ్‌కి వస్తాడా?’’ అడిగాడు రాజు.

‘‘విజయవాడ తెలియని ఊరా ఏమిటి? బస్సు దిగి, ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్‌.

‘‘అదే తప్పు. మనం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లం. అందరం నెలకు రెండు లక్షల వరకూ సంపాదిస్తున్నాం. మన పెద్దవాళ్ళు, వాళ్ళ రిటైర్మెంట్‌ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు.

వాళ్ళ అదృష్టంకొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం. మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు. అది మనం వాళ్ళకి తెలియచెప్పాలి. లేకపోతే మరీ చులకన అయిపోతాం’’ గొప్ప ధర్మసూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు.
సుధీర్‌ ఆలోచనలో పడ్డాడు. చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు. సిగరెట్‌ తీసి వెలిగించాడు.

రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్‌ కేసి చూశాడు. ‘‘మన సాకేత్‌ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది. వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడు. అత్తింటివారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా... అంటే అదీ లేదు. ఏరా మీ మావ ఎప్పుడైనా, తణుకు రైల్వేస్టేషన్‌కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడా?’’ అడిగాడు రాజు.

సాకేత్‌ లేదు అన్నట్టు తలూపాడు. గట్టిగా నవ్వాడు రాజు.

‘‘చూశారా ఫ్రెండ్స్‌ వీడి పరిస్థితి. వీడు బెంగుళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి, ఆటోనో బస్సో పట్టుకుని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి. వెరీ బాడ్‌... వెరీ బాడ్‌...’’ అన్నాడు రాజు. మరోసారి సిగరెట్‌ గట్టిగా దమ్ము లాగి పొగ వదిలాడు. ‘మరి, నీ సంగతి ఏమిటి?’ అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్‌, సాకేత్‌.

‘‘మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్‌. నేను ఇక్కడ ఫ్లైట్‌ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ టాక్సీతో ఎయిర్‌పోర్ట్‌ దగ్గర రెడీగా ఉంటాడు. అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను.

మా మావకి ఖాళీ లేకపోతే మా బావమరిది టాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి. ఐదు ఏళ్ళ నుంచీ అలా మెయింటెయిన్‌ చేస్తున్నాను. అదీ మన స్టైల్‌. అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మావకి’’ కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు. సుధీర్‌, సాకేత్‌ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు.

కొద్దిసేపు అయ్యాక ఆఫీస్‌ గురించీ, క్రికెట్టూ సినిమాల గురించీ కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురూ. మధ్యాహ్నం హోటల్‌లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఫ్లాట్‌కి వచ్చాక సాకేత్‌ ఆలోచనలో పడ్డాడు. ‘నిజంగా తానంటే అత్తింటివారికి తగిన గౌరవం లేదా?’ అన్న అనుమానం కలిగింది. మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తానూ గమనించాడు. చాలామంది తమ బంధువులని రిసీవ్‌ చేసుకుని ఆటోల్లోనూ టాక్సీల్లోనూ తీసుకెళ్ళారు.

సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తానూ ఆమెని బాగా ఇష్టపడి ‘కట్నం’ వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్‌కి వచ్చింది. ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది. రెండు రోజులు గడిచాక మావగారికి ఫోన్‌ చేశాడు సాకేత్‌. కుశల ప్రశ్నలు అయ్యాక ‘‘సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్ట’’మని చెప్పాడు.

‘‘రిజర్వేషన్‌ దొరకాలిగా’’ నెమ్మదిగా అన్నారు రామనాధం.

‘‘అదేమీ నాకు తెలీదు. రేపు పొద్దున్నకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి’’ అని విసుగ్గా అన్నాడు సాకేత్‌. అల్లుడు ఏదో జాబ్‌ టెన్షన్‌లో ఉన్నాడని భావించారు రామనాధం. అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్‌ చేయించి, కూతుర్ని తీసుకుని బెంగుళూరు వచ్చారు. సాకేత్‌ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు బయల్దేరి శివపురం వచ్చేశారు రామనాధం.

* * * * *

సుధారాణికి నెలలు నిండాక బెంగుళూరు వెళ్ళారు రామనాధం-వసంతలక్ష్మి. అప్పుడు కూడా సాకేత్‌ ముభావంగానే ఉన్నాడు.

డెలివరీకి మంచి హాస్పిటల్‌లో జాయిన్‌ చేయమని మాత్రం చెప్పాడు.

రోజు విడిచి రోజు భార్యకి ఫోన్‌ చేసేవాడు సాకేత్‌. అది చూసి రామనాధం కొద్దిగా సంతృప్తి చెందారు. అల్లుడు ఫోన్‌లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకిగానీ కూతురికిగానీ చెప్పలేదాయన.

రోజులు వేగంగా గడిచిపోయాయి.

సుధారాణికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్‌ కామేశ్వరి హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. పండంటి బాబు పుట్టాడు.

వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు- వసుంధర చాలా సంతోషించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి మనవడిని చూసి వెళ్ళారు. సాకేత్‌ అంతకుముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు.

పెద్ద హాస్పిటల్‌లో కాకుండా చిన్న హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారని మావగారిని విసుక్కున్నాడు సాకేత్‌. అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది. అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది. ‘మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్‌ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా’ అని సాకేత్‌ అన్నమాట వారిద్దరినీ బాధించింది.

బాబుకి ఐదో నెల వచ్చాక, కూతుర్నీ మనవడినీ తీసుకువెళ్ళి బెంగుళూరులో దిగబెట్టి వచ్చారు రామనాధం-వసంతలక్ష్మి. సుధ ఆఫీస్‌కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటోంది.

వెంకట్రావు-వసుంధర బెంగుళూరు వెళ్ళి నెల్లాళ్ళు ఉండి, మనవడితో గడిపి వచ్చారు.

బాబుకి ఏడాది నిండింది. సుధారాణి మరలా నెల తప్పింది. అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద. మూడోనెల వచ్చాక రామనాధం-వసంతలక్ష్మి బెంగుళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు. అప్పుడు కనిపెట్టింది సుధ, తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటంలేదని.

‘‘మీరు, మా అమ్మానాన్నలతో సరిగా మాట్లాడలేదు ఎందుకని?’’ అడిగింది భర్తని.

‘‘ఏం? మీ వాళ్ళు నీకు కంప్లైంట్‌ చేశారా?’’ మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్‌.

‘‘మావాళ్ళు అటువంటి మనుషులు కారు’’ నెమ్మదిగా అంది సుధ.

‘‘అంటే, మావాళ్ళు కంప్లైంట్‌ నేచర్‌ ఉన్నవాళ్ళు అని అర్థమా?’’ వెటకారంగా అన్నాడు సాకేత్‌.

అతని మాటలకి ఆమె చాలా బాధపడింది. ‘‘నేను ఇప్పుడు అత్తయ్యా, మావయ్యల గురించి ఏమీ అనలేదుగా?’’ అంది నెమ్మదిగా. భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది.

‘‘చూడు సుధా. నా ఆఫీస్‌ వర్క్‌ టెన్షన్‌ నాకు ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా?’’ అన్నాడు లాజిక్‌గా. సుధారాణి ఇంక సంభాషణ పెంచకుండా మౌనం వహించింది.

వెంకట్రావు-వసుంధర వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో! తనే ఒకటి రెండుసార్లు, ‘మావయ్యగారి భోజనానికి ఆలస్యం అవుతోంది, భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి’ అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారాణికి. మొత్తానికి ఏదో జరిగింది, అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది.

మరుసటి నెలలో వంటమనిషిని పెట్టాడు సాకేత్‌. ‘‘చూడు సుధా, వంట చెయ్యడానికి మనిషి ఉంది, పని చెయ్యడానికి పనిమనిషి ఉంది. నువ్వు బాబుని చూసుకుంటూ, నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు’’ అన్నాడు సాకేత్‌. ‘అలాగే’ అంది చిన్నగా నవ్వుతూ.

కూతురికి ఏడోనెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాధం-వసంతలక్ష్మి.

‘‘మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నటిలా కాకుండా టౌన్‌లో మంచి హాస్పిటల్‌లో జాయిన్‌ చెయ్యండి. డబ్బు కావలిస్తే ఫోన్‌ చెయ్యండి నేను పంపుతాను’’ అన్నాడు నిష్టూరంగా సాకేత్‌.

‘‘అలాగే బాబూ, నువ్వు చెప్పినట్టే చేస్తాం’’ చాలా నెమ్మదిగా అన్నారు రామనాధం. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ. మర్నాడే బయల్దేరి శివపురం వచ్చారు ముగ్గురూ. రెగ్యులర్‌గా డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్ళి చెక్‌ అప్‌ చేయిస్తున్నారు. తొమ్మిదో నెల రాగానే, డాక్టర్‌ చెప్పిన డేట్‌కి పదిహేను రోజులముందే తణుకులో పెద్ద నర్సింగ్‌ హోమ్‌లో చేర్పించారు. ‘‘ఇంతముందు ఎందుకు నాన్నా?’’ అని కూతురు అంటే, ‘‘మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా’’ అన్నారు రామనాధం.

కొద్ది రోజులు గడిచాయి. సుధకి ఆడపిల్ల పుట్టింది. అల్లుడికి ఫోన్‌ చేసి చెప్పారు రామనాధం.

సాయంత్రం ఫ్లైట్‌కి రాజమండ్రి వచ్చి అక్కడినుంచి టాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్‌. నర్సింగ్‌ హోమ్‌ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు. పాపని చూసి మర్నాడు బెంగుళూరు వెళ్ళిపోయాడు.

తర్వాత పాప బారసాల రోజున మావగారినీ అత్తగారినీ అకారణంగా విసుక్కున్నాడు సాకేత్‌. వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చెయ్యడానికి రాజమండ్రి నుండి వచ్చింది. సాకేత్‌ ప్రవర్తన చూసి విస్తుపోయింది. మూడు నెలలు అయినా పిల్ల ఒళ్ళు చేయలేదనీ, అక్కాబావలు చంటిపిల్లని సరిగా చూడలేదనీ సాకేత్‌ నిష్టూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది. కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు, మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు. ఇంత చిన్న విషయానికి సాకేత్‌ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది. ఆ మాటే అక్కగారితో అంది. ‘‘నువ్వు ఊరుకోవే బాబూ, అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువయ్యింది. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది. అందుకే మేం ఏం మాట్లాడటం లేదు’’ అంది చిన్నగా వసంతలక్ష్మి. ‘పెళ్ళిలో ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత వందనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి?’ అని వాపోయింది సుహాసిని.

* * * * *

కాలచక్రంలో రెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలికి ఫోన్‌ చేసింది... ‘‘సుధా పిల్లలూ బెంగుళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు. నువ్వు కూడా శివపురం రా. నాకు తోడుగా ఉందువుగాని, మనవల్ని చూసినట్టూ ఉంటుంద’’ని. సాకేత్‌ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది. కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది.

మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది. గేటు తీసుకుని లోపలకు వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యింది. హాలులో కూర్చుని సాకేత్‌ పూరీలు వత్తుతున్నాడు. చప్పుడు చెయ్యకుండా అలాగే నిలబడి చూస్తోంది. అయిదు నిమిషాలు అయ్యేసరికి పేపర్‌ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్‌. అప్పటికే స్టవ్‌ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు. పది నిమిషాలలో పూరీలు తయారయ్యాయి. ఈలోగా నెమ్మదిగా వచ్చి హాలులో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని.

‘‘అత్తయ్యా, నా టిఫిన్‌ అయిపోయింది.

మీ వంట ఇంకా మొదలుపెట్టలేదు. అది కూడా నేను చేసెయ్యనా?’’ వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్‌.

‘‘నా పూజ అయ్యాకా వంట నేనే చేస్తాను. ఆ టిఫిన్‌ నువ్వూ నీ పిల్లలూ తినండి.

పూరీ కూర చేసి బేసిన్‌లో పెట్టాను తీసుకో. ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు’’ ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి.

‘పిల్లలూ టిఫిన్‌ రెడీ, రండి రండి’’ అంటూ హాలులోకి వచ్చిన సాకేత్‌, సుహాసినిని చూసి ‘‘చిన్నత్తయ్య గారూ బాగున్నారా? ఎంతసేపు అయ్యింది వచ్చి?’’ అని పలకరించాడు.

‘బాగున్నాను’ అన్నట్టు తలాడించింది సుహాసిని. ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది. ఎప్పుడు ఏం అంటాడోనని. బెడ్‌రూమ్‌లో నుంచి, పిల్లలతో వచ్చిన సుధ ‘‘పిన్నీ, బాగున్నావా?’’ అని పలకరించి లోపలకు వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి. పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్‌ కోసం. వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్‌.

ఇది కలో, నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని. ‘నేను చెబుతాను’ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధ. పిల్లల టిఫిన్‌ అయ్యాక తనూ టిఫిన్‌ తిన్నాడు సాకేత్‌. కాసేపటికి రామనాధం స్కూటర్‌ మీద కూరలూ సరుకులూ తెచ్చారు. సాకేత్‌ వెళ్ళి గబగబా సంచీ అందుకున్నాడు ఆయన చేతిలోంచి. ‘‘నేను తెస్తానన్నాను కదా, మీరెందుకు వెళ్ళారు?’’ అన్నాడు నెమ్మదిగా మావగారితో. హాలులో ఉన్న సుహాసినిని పలకరించారు రామనాధం. లోపలకు వెళ్ళి ప్లేటులో పూరీలు తెచ్చి మావగారికి ఇచ్చాడు సాకేత్‌.

‘‘ఇవాళ టిఫిన్‌ నేనే చేశాను మావయ్యా- ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభంలేదని, నేనే రంగంలోకి దిగాను. టిఫిన్‌ తిని చెప్పండి ఎలా ఉందో?’’ అన్నాడు. ఒక పూరీ తిని, ‘‘చాలా బాగుంది అల్లుడూ’’ అని మెచ్చుకున్నారు రామనాధం.
‘‘నాన్నా, కూర అమ్మ చేసింది. ఈయన పూరీలు మాత్రమే చేశారు’’ అంది గారంగా సుధ, తండ్రి పక్కన చేరి. దానికి ఆయన నవ్వుతూ ‘‘కూర ఒకటే తినలేం కదా బంగారం. అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్‌ తయారయ్యింది, చాలా బాగుంది కూడా’’ అన్నారు.

‘‘ఫో నాన్నా, నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావ్‌’’ అంది బుంగమూతి పెట్టి సుధ.

‘‘మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లీ’’ అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాధం. సాకేత్‌, సుధ వైపు తిరిగి ‘‘నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను’’ అని చెప్పి ‘‘మావయ్యా, స్కూటర్‌ నేను తీసుకెళ్తాను’’ అని బయటకు వెళ్ళాడు.

అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని, సుధారాణితో ‘‘నేను ఈ సస్పెన్స్‌ భరించలేకపోతున్నాను, ఏం జరిగిందో చెప్పు’’ అంది ఆత్రుతగా.

‘‘ముందు టిఫిన్‌ తిందువుగాని రా, ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను’’ అని టిఫిన్‌ తీసుకువచ్చి సుహాసినిని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళింది సుధ.

‘‘మావారు నాన్న మీదా, నామీదా అకారణంగా చిరాకుపడటం, సూటిపోటి మాటలనడం మా మావయ్య గారికి తెలిసింది. రెండేళ్ళక్రితం మా అత్తయ్యగారు హార్ట్‌ అటాక్‌ వచ్చి పోయారు కదా. ఆరు నెలలక్రితం ఆయన బెంగుళూరు వచ్చారు. నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్‌ చేస్తూ. మావారూ మావయ్యగారూ ఏదో మాట్లాడుకుంటున్నారు. టిఫిన్‌ తయారయ్యాక ప్లేటులో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది ఇవతలే ఆగిపోయాను. ‘చూడు సాకేత్‌, కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క. పెళ్ళి కాగానే తన ఇంటి పేరు, తన గోత్రం అన్నీ వదులుకుని అత్తారింటికి వస్తుంది.

మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. అప్పుడే రెండు కుటుంబాలూ ఆనందంగా సంతోషంగా ఉంటాయి.

మా తరం అయిపోయింది, మీ తరం వచ్చింది. తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. కానీ విలువలూ సంప్రదాయాలూ పెద్దల పట్ల గౌరవాలూ నిరంతరం కొనసాగాలి. అది మరచిపోకు. నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను. నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్నీ ప్రేమనీ ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా. ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో, కొత్తగా
ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా తప్పు. వెంటనే సరిదిద్దుకో. మన ప్రవర్తన నలుగురికీ ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు. నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు. నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను... కాదూ నేనిలాగే ఉంటానూ అంటావా.. నీ ఇష్టం. నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను. ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను’ అన్నారు మావయ్యగారు. ఒక నిమిషం మౌనంగా ఉన్నాక... ‘స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్నా. మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను’ అని మావారు అనడం నాకు వినిపించింది. రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్‌ తీసుకెళ్ళి మావయ్యగారికి ఇచ్చాను.

అప్పటినుండీ మావారిలో మార్పు వచ్చింది. మా పెళ్ళి అయిన కొత్తలో మా అందరిపట్లా ఎంత ప్రేమగా ఉండేవారో, దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు. మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు. అదీ సంగతి పిన్నీ’’ అంది సుధారాణి. అప్పటికి సుహాసిని టిఫిన్‌ తినడం పూర్తి అయ్యింది.

‘‘ఏమైతేనేం, మీరు ‘కష్టాల పర్వం’ నుండి ‘సుఖాల పర్వం’లోకి అడుగుపెట్టారు. సంతోషం’’ అంది సుహాసిని.

వీళ్ళు ఇద్దరూ బెడ్‌రూమ్‌లోంచి బయటకు వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని. సాకేత్‌ కత్తిపీట దగ్గర కూర్చుని పనసపండుని ముక్కలుగా తరుగుతున్నాడు. రెండు నిమిషాలలో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు. చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనసతొనలు తీస్తున్నాడు. ఇంతలో టీపాయ్‌ మీద ఫోన్‌ మోగింది ‘సంసారం... సంసారం, ప్రేమసుధా పూరం... నవజీవన సారం’ అంటూ. ‘‘నాన్నా, నీ ఫోన్‌’’ అంటూ సాకేత్‌ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్‌ పట్టుకొచ్చింది. ‘‘ఆన్‌ చేసి, నా చెవి దగ్గర పెట్టరా బంగారం’’ అన్నాడు సాకేత్‌ పనసతొనలు తీసే పని కొనసాగిస్తూ. అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాధం-వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..