Sunday Story: అందమైన జీవితం

‘‘నందూ... మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా. వచ్చి వారం రోజులయిందట’’ అంది రోహిణి కొడుకుతో.

Updated : 20 Aug 2023 08:03 IST

- సి.ఎన్‌.చంద్రశేఖర్‌

‘‘నందూ... మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా. వచ్చి వారం రోజులయిందట’’ అంది రోహిణి కొడుకుతో.

‘‘అలాగా, ఎలా ఉంది మనూ?’’ నందూ అడిగాడు.

‘‘ఎప్పటిలా లేదు. ఎందుకో కాస్త డల్‌గా కనిపించింది. మనిషి కూడా తగ్గింది.’’

‘‘అయ్యో... నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను.’’

‘‘అంత అవసరం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మరచిపోయావా?’’

‘‘అమ్మా, తను నా భార్య కాకున్నా మామ కూతురేగా. మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మా... నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఉంటావు. మనూ విషయంలో మాత్రం వేరేగా ఉంటావు. చిన్నప్పట్నుంచీ నాతో కలసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది. ఆ కారణం సబబుగానే ఉంది కదా.’’

‘‘ఉంది. కానీ దాన్ని నా కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా!’’

‘‘అవన్నీ ఇప్పుడెందుకమ్మా. తనకు పెళ్ళైంది, నాకూ పెళ్ళైంది. అందరం హాయిగా ఉన్నాం. బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం.’’

శ్యామల కొడుకు వైపు అభినందన పూర్వకంగా చూస్తూ ‘‘నీకు ఇంత మంచితనం ఎక్కడ నుంచి వచ్చిందిరా?’’ అంది.

‘‘మీ నుంచే అమ్మా. నన్ను బాధపెట్టిన వారిపట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావుగానీ నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా... నీకంటే మంచివారు. ఎవరి జోలికీ పోరు. తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు.’’

‘‘నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే! మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది.’’

‘‘పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది’’ అన్నాడు నవ్వుతూ.

‘‘రేయ్‌... నేనూ పుస్తకాలు చదువుతాను!’’ చిరుకోపంతో అంది రోహిణి.

‘‘నాన్నంత కాదులే’’ అంటూ నవ్వి, ‘‘నేను వెళ్ళి మనూతో మాట్లాడి వస్తాను అమ్మా’’ అంటూ బయలుదేరాడు ఆనంద్‌.

ఆనంద్‌ వెళ్ళేసరికి మంచంపై పడుకుని ఉంది మానస. ఆనంద్‌ని చూడగానే లేచి నిలబడి ‘‘హాయ్‌, నందూ... రా కూర్చో’’ అంది అక్కడున్న కుర్చీ లాగుతూ.

ఆనంద్‌ కూర్చున్నాక ‘‘అదేమిటి మనూ, అలా అయిపోయావు? ఆరోగ్యం బాగాలేదా?’’ అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ.

‘‘నీకూ అలాగే కనపడుతున్నానా?’’ అంది నవ్వుతూ.

‘‘ఏం జరిగింది మనూ?’’

‘‘నువ్వు మేడ మీదికెళ్ళి కూర్చో. నేను కాఫీ తీసుకొస్తాను’’

మానసకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టంలేక తనని మేడ పైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది.

ఆ ఇంటి మేడ పైన బాల్కనీ అతనికి చిన్నప్పట్నుంచీ ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండమీది మెట్ల మార్గం కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది.

‘‘నందూ... కాఫీ’’ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు.

మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది.

‘‘థాంక్యూ’’ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత ‘‘రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం’’ అంటూ అక్కడ ఉన్న సిమెంటు బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది.

‘‘చెప్పు మనూ... ఏమైంది?’’

‘‘రాజుకూ నాకూ అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందూ. అతనితో ఇక ఉండలేను. డైవోర్స్‌కి అప్లై చెయ్యాలనుకుంటున్నాను. నువ్వుండగా వేరే లాయరెందుకని నీతో మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు.’’

‘‘అంత తొందరెందుకు మనూ?’’

‘‘తొందరా... మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా?’’

‘‘అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు.’’

‘‘చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ.’’

‘‘ఓకే. ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్‌ గురించి మాట్లాడదాం, సరేనా?’’ అలాగేనన్నట్టు తలూపింది మానస.

‘‘అతను అందగాడు. అవునా?’’ మళ్ళీ తలూపింది మానస.

‘‘చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు.’’

‘‘అవును. ఇవే అతనిలోని పాజిటివ్‌ అంశాలు.’’

‘‘ఇవి చూసే మీ అమ్మానాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్ళి చేయాలనుకుని ఉంటారు.

ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా!’’

‘‘అంతేగా! ఇవి చూసే నేనూ ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని.’’

‘‘సరే. ఇప్పుడు అతని నెగటివ్‌ క్వాలిటీస్‌ గురించి చెప్పు.’’

‘‘నన్ను బయటికి తీసుకెళ్ళడు. నా వంటని మెచ్చుకోడు. ఎంతసేపూ పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్సు వేసుకుంటే బాగుందని చెప్పడు. ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చినా, మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు.’’

‘‘అంతేనా?’’ ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్‌.

‘‘ఇంకా ఉన్నాయి. గుర్తు రావడం లేదు.’’

‘‘సరే. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను... జవాబివ్వు.’’ అడగమన్నట్టు చూసింది మానస.

‘‘అతనికి సిగరెట్టు, మందు తాగడం అలవాటుందా?’’

‘‘అస్సలు లేదు.’’

‘‘అమ్మాయిల పిచ్చి?’’

‘‘లేదు’’

‘‘ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా?’’

‘‘వంటపనిలో చేయడు. అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కంప్లైంట్స్‌ లేవు.’’

‘‘అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్‌ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతోందా మనూ?’’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్‌.

‘‘నువ్వు మగవాడివి నందూ. ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థం అయ్యేది.’’

‘‘నిన్ను నేను అర్థం చేసుకున్నాను మనూ. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరినవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో రాజీపడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావొచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్నచిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ‘ఈమాత్రం దానికే విడాకులు తీసుకుందామనుకున్నానే’ అని నువ్వు నవ్వుకోవచ్చు.’’

‘‘నాకంత ఓపికలేదు. మా కొలీగ్స్‌ భర్తల్ని చూస్తూంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యని షాపింగ్‌కి తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం, ఊళ్లు తిప్పడం, పదిమంది ముందూ భార్యని పొగడటం చేస్తుంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు’’ కళ్ళనీళ్ళతో అంది మానస.

‘‘పక్కవాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళమధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం. తర్వాతేం చేస్తావు? ఇంకొకర్ని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి. అప్పుడేం చేస్తావు? పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో... అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా.’’

మానస ఆలోచిస్తూ ఉండిపోయింది.

‘‘అతను తాగుబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు.’’

‘‘అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతు కాకపోవచ్చు. కానీ, మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ‘ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను’ అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగినవాడిని, మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం.’’

‘‘పెళ్ళికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప, విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది. నీలోని అసంతృప్తి నీచేత ఇలా అనిపిస్తోంది కానీ, విడాకుల వరకూ వస్తే నువ్వే బాధపడతావు.’’

‘‘అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?’’

‘‘నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా?’’ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస.

‘‘అయితే ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేనోసారి హైదరాబాద్‌ వస్తాను. అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం. అంతవరకూ అతనిలోని పాజిటివ్‌ విషయాల గురించే ఆలోచించు, అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాకరాక పుట్టింటికి వచ్చావు, హాయిగా ఎంజాయ్‌ చెయ్యి’’ అంటూ లేచాడు ఆనంద్‌.

ఆనంద్‌ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస. రాజేష్‌ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్‌పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమవల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు. కానీ, నందూ ఎంత బాగా సమస్యని విశ్లేషించాడు! అతను చెప్పినట్లు తను కొద్దిరోజులు ఆగడం మంచిది.

నందూ తనని పెళ్ళి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే, చిన్నప్పట్నుంచీ కలసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది. నందూ తప్పక బాధపడి ఉంటాడు. కానీ, ఇప్పుడు తను బాధలో ఉంటే ‘తనను కాదన్నందుకు అనుభవించనీ’ అని ఊరుకోలేదు అతను. రాజేష్‌పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. పైగా లాయరుగా అతనికి ఓ కేసు కూడా దొరికేది. కానీ, తామిద్దరూ కలసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు. రాజేష్‌లో తనకు కనిపించని కొత్త కోణాల్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు.

‘నందూ... నీ మంచితనానికీ మనిషితనానికీ హ్యాట్సాఫ్‌’ అనుకుంది మానస.

* * * * *

తను ప్రయాణిస్తున్న ట్రైన్‌ హైదరాబాదుకు దగ్గరవుతూంటే ‘స్టేషన్‌కి వచ్చి రిసీవ్‌ చేసుకుంటాడేమో’ అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు.

నిరుత్సాహంగా క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్‌ కళ్ళలో వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెష్‌అప్‌ అయి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుంది.

అతను కాఫీ తయారుచేసి ఆమె చేతికిచ్చాడు. ‘‘థాంక్యూ’’ అంటూ ఆనందంగా అందుకుంది.

‘‘రాజూ... కాస్త టిఫిన్‌ ఆర్డర్‌ చేస్తారా?’’ అని అడిగింది కాఫీ తాగుతూ.

‘‘నేను ఉప్మా చేశాను.’’

ఆశ్చర్యంగా అతనివైపు చూసి ‘‘మీకు ఉప్మా చేయడం వచ్చా?’’ అని అడిగింది.

‘‘నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను’’ అన్నాడు.

తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్‌కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది. ‘తనకంటే అతనికి ఆఫీసు పని ఎక్కువ. తనని రిసీవ్‌ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి. అంత దూరం ప్రయాణించాలి. తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకూ పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్‌ ఉంటాయి. అందుకే అతను స్టేషన్‌కి రాలేదు. కాల్స్‌ చూసుకుంటూ కాఫీ, టిఫిన్‌ చేయడం వల్ల తనకు పని తగ్గింది. ఎటూ క్యాబ్‌ బుక్‌ చేసుకుని తను రాగలదు’ అనుకుంది.

చాలాకాలం తర్వాత ఓరోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీసు పని చేసింది ఇన్నాళ్ళూ. ఆ రోజంతా తన కొలీగ్స్‌తో మాట్లాడుకుంటూ, పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది.

‘‘కొవిడ్‌ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్ళి చేసేసుకున్నావ్‌. కాబట్టి, మాకు పార్టీ ఇవ్వాలి’’ అంది కొలీగ్‌ మమత.

‘‘ఇంకా కొవిడ్‌ పూర్తిగా పోలేదుగా. నెమ్మదిగా ఇస్తాలే’’ అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది.

లంచ్‌ సమయంలో కొలీగ్స్‌ మాటల వల్ల వాళ్ళలో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్దిరోజుల్లోనే అర్థమైంది ఆమెకి.

సరయు భర్త తాగుబోతు. సంపాదించిన డబ్బంతా తాగుడుకే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త కేబరే డ్యాన్స్‌లు చూడ్డానికి వెళ్తూంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న లత అత్తమామల ఆరళ్ళకు గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్‌ చేస్తుంటాడు.

చాలామంది మగ కొలీగ్స్‌ భేషజాలకు పోయి తమ ఆదాయంకంటే ఖర్చులు ఎక్కువ చేసి, మానసను అప్పు అడగటం, ఆమె లేదని చెప్పడం జరుగుతోంది.

అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్‌ గుర్తొస్తున్నాడు. ‘రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు చెయ్యడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్‌ చేస్తాడు’ అనుకుంది.

* * * * *

ఓరోజు మానస గర్భవతని తెలిసింది.

ఈ వార్త తెలియగానే మానసకంటే ఎక్కువగా రాజేష్‌ ఆనందించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడటానికి వచ్చారు.

‘‘అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను. ఇంటిపనీ ఆఫీసుపనీ ఈ పరిస్థితుల్లో చేసుకోలేను’’ అంది రాజేష్‌తో మానస.

‘‘మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికీ ఇక్కడ శ్రమ ఎక్కువవుతుంది. డెలివరీకి మూడు నెలల ముందు రమ్మని చెబుదాం.

అంతవరకూ నీకేం సహాయం కావాలన్నా నన్నడుగు’’ అన్నాడు రాజేష్‌.

తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్‌ చూసి ఆశ్చర్యపోయింది మానస.

అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్‌. డాక్టర్‌ దగ్గరకి చెకప్‌కు తీసుకెళ్ళడం, మందులూ పండ్లూ తెచ్చివ్వడం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం, జ్యూస్‌ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్దిరోజుల్లో అర్థమైంది ఆమెకి.

ఆ విషయం తల్లికి ఫోన్‌ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది.

‘‘కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమని వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంత మంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యలకుండాలి’’ అంది ఆమె తల్లి సుమతి.

ఓరోజు బయటికి వెళ్దామని రాజేష్‌ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది.

ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్‌మెంట్‌ దగ్గరికి తీసుకెళ్ళి మోడల్‌ హౌస్‌ చూపించి, ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు. కొద్దిరోజులు ఆలోచించి, కొందామని ఇద్దరూ నిర్ణయించుకుని, వెళ్ళి అడ్వాన్స్‌ కట్టారు.

ఆ ఇంటిని తన పేరుమీదే కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్‌ వినలేదు.

మరుసటిరోజు ‘‘మిమ్మల్ని ఓ మాట అడుగుతాను. నిజాయతీగా జవాబు చెప్పాలి’’ అంది మానస రాజేష్‌తో.

‘‘అడుగు’’ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు.

‘‘నేను మీకు భార్యగా తగినదానినని మీరు భావిస్తున్నారా?’’

‘‘నాకు ఇంతవరకూ అటువంటి ఆలోచనే రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవముంది. ఒకసారి పెళ్ళి అంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాల్ని వెతకకూడదు. రోజురోజుకూ ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాల్ని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్న రోజూ మనసులో మెదుల్తూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటివాళ్లలో అన్నీ లోపాలే కనిపిస్తాయి.’’

చెంపపై ఛెళ్ళున కొట్టినట్లు ఫీలయింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పట్నుంచీ ఆమె రాజేష్‌లో లోపాల్ని వెతకడం మానేసింది.

కొన్నాళ్ళకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవు అయ్యాక కూడా ఇంట్లో నుంచి పని చేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవడం సులువయింది.

* * * * *

ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది. మాటల్లో ‘‘విశాల్‌ ఈమధ్య బాగా మారిపోయాడు మనూ. ఇంట్లో ఒక్క పనీ ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపూ టీవీ చూడటం లేదా సెల్‌ చూడటం. బిడ్డ ఏడుస్తున్నా, కిందపడిపోతున్నా పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులూ చేసుకోవడం నావల్ల కావడం లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదలుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికీ అతన్ని అడుక్కుంటూ ఉండాలి’’ అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది సౌజన్య.

స్నేహితురాలి పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది.

ఆరోజు రాత్రి భోజనాలయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ ‘‘మనూ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్‌ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు! ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు.

రాజేష్‌ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అంది. అవునన్నట్టు తలూపింది మానస.

బాబుకు రెండేళ్ళు దాటాయి.

‘‘వాణ్ణి ఎంతసేపూ ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయటి ప్రపంచం ఎలా తెలుస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం’’ అంది మానస రాజేష్‌తో ఓ రోజు. రాజేష్‌ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పట్నుంచీ ఆరు నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు.

* * * * *

కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస-రాజేష్‌లు.

‘‘నేను నలభై అయిదేళ్ళప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు ముప్ఫై ఏళ్ళకే ఇంటి ఓనరువయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు మానస తండ్రి భాస్కర్‌.

‘‘మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్నా. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు. అందుకే కొనగలిగాం’’ అంది మానస.

‘‘సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా. అయినా ఇది అల్లుడి గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్‌ ఉంది అతనికి’’ అన్నాడు భాస్కర్‌.

తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసకు గర్వంగా అనిపించింది.

గృహప్రవేశానికి ఆనంద్‌ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్‌ అయ్యాక అందరూ కలసి మాట్లాడుకుంటూంటే ఆనంద్‌ ‘‘మానసా, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు. ఇక నీ కెరీర్‌పైన దృష్టి పెట్టు’’ అన్నాడు మానసతో.

‘‘తను ఇప్పుడు మేనేజర్‌ అండీ. చాలామందికి తను బాస్‌. ఇంటి పనీ బాబు పనీ చేసుకుంటూనే ఆఫీసు పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తనకు ఎంత టాలెంట్‌ ఉందో’’ అన్నాడు రాజేష్‌.

‘‘మానస టాలెంట్‌ గురించి నాకు తెలియదా... షి ఈజ్‌ ఎ జెమ్‌ ఆఫ్‌ ఎ పర్సన్‌’’ అన్నాడు ఆనంద్‌.

తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు ‘‘దట్సాల్‌ యువర్‌ ఆనర్‌’’ అన్నాడు ఆనంద్‌ నవ్వుతూ.

మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..