పనీర్‌ కూర... ఓ పట్టు పట్టేద్దామా!

పనీర్‌తో ఏం చేసినా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు కదూ. రోటీ, పులావ్‌, బిర్యానీ.. ఇలా దేనికైనా నప్పే పనీర్‌తో మరికొన్ని వెరైటీలూ చేస్తే ఎలా ఉంటుందంటారూ...

Published : 30 Jun 2024 00:14 IST

పనీర్‌తో ఏం చేసినా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు కదూ. రోటీ, పులావ్‌, బిర్యానీ.. ఇలా దేనికైనా నప్పే పనీర్‌తో మరికొన్ని వెరైటీలూ చేస్తే ఎలా ఉంటుందంటారూ...


బుర్జీ పనీర్‌

కావలసినవి: మెత్తగా మెదిపిన పనీర్‌: కప్పు, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, కసూరీమేథీ: టేబుల్‌స్పూను, నూనె: పావుకప్పు, కారం: టేబుల్‌స్పూను, పెరుగు: అరకప్పు, దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: చెంచా, పావ్‌భాజీ మసాలా: చెంచా, పసుపు: పావుచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, చాట్‌మసాలా: చెంచా, ఉల్లిపాయలు: మూడు, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, బిర్యానీ ఆకులు: రెండు, పచ్చిమిర్చి: మూడు, టొమాటోలు: మూడు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: పావుకప్పు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి సెనగపిండి, కసూరీమేథీ వేసి రెండు నిమిషాలు వేయించి తరువాత కారం, పెరుగు, దనియాలపొడి, జీలకర్రపొడి, పావ్‌భాజీ మసాలా, పసుపు, మిరియాలపొడి, చాట్‌మసాలా వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం  ఉడుకుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద మళ్లీ కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి ఎర్రగా వేగుతున్నప్పుడు టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మగ్గాక చేసిపెట్టుకున్న మసాలా మిశ్రమం, మెత్తగా మెదిపిన పనీర్‌ వేసి అరకప్పు నీళ్లు పోసి కలపాలి. ఇది ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే చాలు.


పనీర్‌ దోప్యాజా

కావలసినవి: పనీర్‌ముక్కలు: కప్పు, నూనె: అరకప్పు, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, జీలకర్ర: చెంచా, యాలకులు: రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, పసుపు: పావుచెంచా, దనియాలపొడి: చెంచా, కారం: ఒకటిన్నర చెంచా,
కసూరీమేథీ: చెంచా, గరంమసాలా: అరచెంచా, క్రీమ్‌: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేసి ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, యాలకులు, మిగిలిన ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు, పసుపు, దనియాలపొడి, కారం, కసూరీమేథీ, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి కలిపి అరకప్పు నీళ్లు పోయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు పనీర్‌ ముక్కలు, వేయించిన
ఉల్లిపాయముక్కలు, క్రీమ్‌ వేసి కలిపి రెండు నిమిషాల తరవాత స్టవ్‌ని కట్టేస్తే చాలు.


మసాలా పనీర్‌ కర్రీ

కావలసినవి: పనీర్‌ ముక్కలు: పెద్ద కప్పు, కొత్తిమీర తరుగు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, మిరియాలు: అరచెంచా, నూనె: పావుకప్పు, ఉల్లిపాయలు: మూడు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, పెరుగు: అరకప్పు, నిమ్మకాయ: సగం, క్రీమ్‌: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు, మిరియాలను మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కొత్తిమీర పేస్టు వేసి అన్నింటినీ వేయించాలి. తరవాత పెరుగు, తగినంత ఉప్పు, పనీర్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇది ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం, క్రీమ్‌ వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


మేథీ పనీర్‌

కావలసినవి: మెంతికూర తరుగు: కప్పు, పనీర్‌ముక్కలు: కప్పు, జీలకర్ర: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, అల్లం తరుగు: చెంచా, జీడిపప్పు: పావుకప్పు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి జీలకర్రను వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి కాస్త రంగు మారుతున్నప్పుడు టొమాటో ముక్కలు, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మగ్గాక దింపేసి... చల్లారాక మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద మళ్లీ కడాయిని పెట్టి మరో పెద్ద చెంచా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి మెంతికూర తరుగు, పసుపు, కారం, దనియాలపొడి, మరికొంచెం ఉప్పు వేసి కలపాలి. మెంతికూర వేగాక చేసి పెట్టుకున్న  మసాలా వేసి, ముప్పావుకప్పు నీళ్లు పోసి కలపాలి. ఇది ఉడుకుతున్నప్పుడు పనీర్‌ ముక్కలు వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక స్టవ్‌ని కట్టేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..