సమీక్ష

ఇవి పేరుకు వ్యాసాలే కానీ సాహిత్యమూ, సంగీతమూ, సినిమాలూ, మానవ సంబంధాలూ ... ఇలా అన్నిటినీ స్పృశిస్తూ పేరుకు తగ్గట్టే పువ్వుల్లా మృదువుగా హృదయాన్ని తాకుతాయి.

Updated : 12 May 2024 07:31 IST

కదంబమాల

వి పేరుకు వ్యాసాలే కానీ సాహిత్యమూ, సంగీతమూ, సినిమాలూ, మానవ సంబంధాలూ ... ఇలా అన్నిటినీ స్పృశిస్తూ పేరుకు తగ్గట్టే పువ్వుల్లా మృదువుగా హృదయాన్ని తాకుతాయి. చలం చెప్పిన స్వేచ్ఛ ఏమిటో తారాశశాంకం నేపథ్యంలో వివరించారు రచయిత్రి. ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం, కానీ దాన్ని పక్కనపెట్టడం ఎంత సులువో మునిపల్లె వారి ‘మేజర్‌ మూర్తి’ కథ చెబుతుందంటారు. కథాంశంతోపాటు శిల్పనైపుణ్యాన్నీ వివరిస్తారు. కృష్ణశాస్త్రి కవిత్వంలోని గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ‘కవికి పర్యాయపదాలు లేవు. ప్రతి పదానికీ ప్రత్యేకమైన రంగూ రుచీ ఉన్నాయి...’ అన్న ఆయన మాటల్నే ఉదహరిస్తారు. జయదేవుడు, నన్నయ, కాళిదాసులే కాదు టాల్‌స్టాయ్‌ లాంటి రచయితలూ కనిపిస్తారు ఈ శేఫాలికల్లో.

కొన్ని శేఫాలికలు; రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 240; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 9848016442


వైవిధ్యభరితం

సమకాలీన పరిస్థితులను భిన్నకోణాల్లో చర్చించిన కథలివి. ఇంటినుంచి పనిచేసుకునే అవకాశాన్ని ఆఫీసు ఇచ్చినా అద్దెగది తీసుకుని మరీ ఆఫీసు పని చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితిని ఆలోచింపజేసేలా రాసిన కథ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’. చంద్రమండల వాసుల తిరుగుబాటు కథ ‘అంతరిక్ష దేశం’- గ్రహాంతరయానం భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. చందమామ కథల్లా అమెరికా వెళ్లి వచ్చి చెప్పేవారి కథలూ అపురూపంగానే ఉంటాయని చెబుతుంది ‘ప్రవాస చందమామ కథలు’. తనకి సన్మానం జరుగుతోందనీ, ముఖ్యఅతిథిగా వచ్చి ‘సెలెబ్రిటీ’ల సరసన వేదికను అలంకరించమనీ స్నేహితుడు ఆహ్వానిస్తే ఉబ్బితబ్బిబ్బైన కుమార్‌కి ఎదురైన అనుభవం- నేటి రికార్డులూ సన్మానాల మోజుపై విమర్శ.
ప్రవాస చందమామ కథలు
రచన: సతీష్‌ గొల్లపూడి; పేజీలు: 144; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


మూడుతరాల కథలు

రచయిత్రి రాసిన మూడు నవలలూ డెబ్భై కథల ఈ సంకలనంలో పల్లెల నుంచి ప్రవాసం వరకూ భిన్నమైన కథావస్తువులు కనిపిస్తాయి. ‘ఆలంబన’ నవలలో పెళ్లి చేసుకుని మెట్టినింట అడుగిడిన కథానాయిక షాలిని ఉమ్మడి కుటుంబాన్ని నియంతలా శాసిస్తూ సంపాదన లేని చిన్నకొడుకుని చీటికీ మాటికీ చిన్నబుచ్చే తాతగారిని చూసి విస్తుపోతుంది. చిన్నత్తగారికి అండగా నిలవడంతో మొదలెట్టిన షాలిని ప్రయాణం అమెరికాలో కూతురికి తోడు దొరికేవరకూ సాగుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమెకు ఆలంబనగా ఉన్నదేమిటీ అన్నదే కథ. పిల్లలు విదేశంలో స్థిరపడినా స్వదేశీయులనే పెళ్లి చేసుకోవాలనుకునే తల్లి దండ్రుల మనస్తత్వాన్ని చర్చిస్తుంది ‘వారసుడు’. మారుతున్న మానవ సంబంధాలూ, తరాల మధ్య అంతరాల లాంటి అంశాలతో కథలన్నీ చదివిస్తాయి.
ఎ.అన్నపూర్ణ సాహిత్యం (కథలు, నవలలు)
పేజీలు: 640; వెల: రూ. 450/-
ప్రతులకు: 9490295170


రైతు శాస్త్రవేత్త ఆత్మకథ

ప్రయోగశీలి అయిన ఒక రైతు ఆత్మకథ ఇది. అటు గాంధీనీ ఇటు కమ్యూనిజాన్నీ ఒంటపట్టించుకున్న ఈ ఆదర్శవాది గొప్ప చదువరీ, సంపద సృష్టిపై దృష్టిపెట్టిన అభ్యుదయవాదీ. గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో పుట్టిన కన్నెగంటి పాపారావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకున్నారు. పై చదువులకో ఉద్యోగానికో వెళ్లకుండా పొలాన్నే ప్రయోగ శాలగా మార్చి శాస్త్రవేత్త అవతారం ఎత్తారు. తన లాభం కోసం కాక ఊరి బాగుకోసం తపించారు. కర్ణాటక వెళ్లి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటుచేసి వర్షాభావ ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, కొత్త పత్తి వంగడాన్ని విజయవంతంగా పండించి ‘వరలక్ష్మి పాపారావుగా మారిన వైనం... ఇలా పుస్తకంలోని ప్రతి ఘట్టమూ ఆసక్తికరం.  
విత్తనంలో విశ్వం (కన్నెగంటి పాపారావు ఆత్మకథ)
రచన: అరుణ పప్పు; పేజీలు: 195; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9844033367


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..