బాల్యం... యవ్వనం... మళ్లీ యవ్వనం!

మనిషి ఆజన్మ శత్రువు.. మరణం. ఆ ప్రత్యర్థి ప్రతినిధిగా తలుపుతట్టే ప్రత్యేక రాయబారి వృద్ధాప్యం. మలిసంధ్యను నిలువరించగలిగితే.. మరణాన్నీ సవాలు చేయొచ్చు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వరకు.. ఆ దిశగా అడుగేస్తున్న వేదికలు అనేకం.

Updated : 30 Jun 2024 08:45 IST

మనిషి ఆజన్మ శత్రువు.. మరణం. ఆ ప్రత్యర్థి ప్రతినిధిగా తలుపుతట్టే ప్రత్యేక రాయబారి వృద్ధాప్యం. మలిసంధ్యను నిలువరించగలిగితే.. మరణాన్నీ సవాలు చేయొచ్చు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వరకు.. ఆ దిశగా అడుగేస్తున్న వేదికలు అనేకం. నోబెల్‌ విజేత వెంకీ రామకృష్ణన్‌ తన తాజా పుస్తకం ‘వై వియ్‌ డై’లోనూ వృద్ధాప్యంపై మనిషి యుద్ధాన్ని లోతుగా విశ్లేషించారు. 

సంపాదనలో పడిపోయి.. యవ్వనాన్ని ఖర్చు చేసుకుంటాడు. మళ్లీ ఆ సంపదనే ఖర్చుపెట్టి యవ్వనాన్ని కొనాలనుకుంటాడు. ఎంత విచిత్రం, మనిషి స్వభావం! అందులోనూ వృద్ధాప్యం అతని కళ్లకు మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కసారి ముదిమి ముప్పేట దాడిచేస్తే.. ఎన్ని సంపదలున్నా అనుభవించలేడు. ఎన్ని సౌఖ్యాలు కన్నుగీటుతున్నా ఆస్వాదించలేడు. ఒంటి బిగువు సడలుతుంది. బుర్ర పదును తగ్గుతుంది. బతుకు బరువుగా సాగుతుంది. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికుడిలా.. మృత్యువు పిలుపు కోసం కాచుకుని కూర్చోవడం.. చావును మించిన విషాదమే. వృద్ధాప్య ప్రభావాన్ని జయించాలంటే, తదుపరి మలుపు అయిన చావు మూలాలూ తెలుసుకోవాలి.ఆ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు. నిజానికి, మృత్యువు అనేది అత్యంత గుహ్యమైన అంశం. ఎన్ని చిక్కులు విప్పినా, ఇంకో ముడి సిద్ధంగా ఉంటుంది. అందుకేనేమో, శాస్త్రవేత్తలు మరణానికి కచ్చితమైన నిర్వచనమూ ఇవ్వలేక పోతున్నారు. వాడుక భాషలో మరణమంటే నిర్జీవ స్థితి. కానీ, ఊపిరి ఆగిన తర్వాత కూడా.. కొన్ని గంటలపాటు శరీరంలోని కోట్లకొద్దీ కణాలు చైతన్య స్థితిలో ఉంటాయి. కీలక భాగాలు ఇతరులకు అమర్చడానికి అనువుగా ఉంటాయి. అలాంటప్పుడు, ఆ శరీరం నిర్జీవమని ఎలా చెప్పగలం? అలా అని సజీవమనీ అనలేం. కారణం, మునుపట్లా వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం ఉండదు. అటు సజీవమూ, ఇటు నిర్జీవమూ కాని ఆ వింత పరిస్థితికి కారణాన్ని కనిపెట్టే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఆ రహస్యం వీడిపోతే.. వృద్ధాప్యానికి సంబంధించిన నిగూఢమైన కోడ్‌ బట్టబయలు అవుతుంది. దాదాపు ఏడొందల స్టార్టప్స్‌ ఆ పనిమీదే ఉన్నాయి. ఎలన్‌ మస్క్‌, లారీ పేజ్‌, జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ జుకెర్‌బర్గ్‌.. తదితర టెక్‌ కుబేరులు యాంటీ ఏజింగ్‌ పరిశోధనల మీద వేలకోట్లు గుమ్మరిస్తున్నారు.

ఇప్పటి కల కాదు..

ఇంత సాంకేతికత లేని రోజుల్లోనూ.. భవిష్యత్తులో ఎవరో ఒకరు చావును ఓడించకపోతారా, మళ్లీ బతికించక పోతారా అనే నమ్మకంతో.. తమ దేహాల్ని భద్రంగా లిక్విడ్‌ నైట్రోజన్‌ బాక్స్‌లో దాచుకున్నవారు ఎంతోమంది. ఆ బాపతు వ్యక్తుల కోసం 1976లోనే రాబర్ట్‌ ఎటింగర్‌ అనే పెద్ద మనిషి అమెరికాలోని డెట్రాయిట్‌ కేంద్రంగా క్రయోనిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాడు. ఆ ఆవరణలో ఇప్పటికీ అనేక పార్థివ దేహాలు శాస్త్రవేత్తల తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ జాబితాలో చివరి కస్టమర్‌ కూడా రాబర్టే. జీవితమంటేనే.. జ్ఞాపకాలూ, ఆలోచనలూ, అనుభవాల సమాహారం. ఇవన్నీ మెదడులోనే నిక్షిప్తమై ఉన్నప్పుడు, మిగతా శరీరంతో ఏం పని? మెదడును మాత్రం భద్రపరిస్తే సరిపోతుందని కొందరి వాదన. భవిష్యత్తులో ఏదైనా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. పాత మెదడులోని డేటాను ఏదో ఓ శరీరానికి అనుసంధానించ వచ్చని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి ఆలోచనల్ని తీవ్రంగా ఖండించేవారూ ఉన్నారు. ఎందుకంటే, మెదడు పరాధీనమైన వ్యవస్థ. శరీరంలో విడుదలయ్యే వివిధ హార్మోన్లు దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడు నుంచి శరీరాన్ని వేరు చేస్తే..

ఆ హార్మోన్ల ఊట ఆగిపోతుంది. మెదడు మొత్తంగా మొరాయిస్తుంది. అయినా సరే, పేపాల్‌ వ్యవస్థాపకుడు పీటర్‌ థీల్‌ లాంటివారు తమ మెదడును భద్రపరిచే బాధ్యతను రకరకాల కంపెనీలకు అప్పగిస్తున్నారు. చాట్‌ జీపీటీని ఆవిష్కరించిన ఓపెన్‌ ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు ఆల్ట్‌మాన్‌ కూడా మెదడు- కంప్యూటర్‌ కనెక్టివిటీపై పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. మెదడును డిజిటలైజ్‌ చేయడం సాధ్యమేననీ, అదీ తన జీవితకాలంలోనే జరిగితీరుతుందనీ అతను వాదిస్తున్నాడు. ‘నా మెదడును క్లౌడ్‌లో అప్‌లోడ్‌ చేసేవరకూ నేను మరణించే ప్రసక్తే లేదు’ అని మహానమ్మకంగా ప్రకటించాడు కూడా. మొత్తానికి అమరత్వాన్ని ఆశిస్తున్నవారిలో రెండు రకాలవారు ఉన్నారు. ఒక వర్గమేమో ఆరునూరైనా సరే, సశరీరంగా బతకాలనుకుంటోంది. మరో వర్గం మాత్రం తమ మెదడూ, మెదడులోని ఆలోచనలూ, జ్ఞాపకాలూ సజీవంగా ఉంటే చాలని సర్దుకుపోతోంది. కానీ, సమీప భవిష్యత్తులో ఈ రెండు కలలూ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఇక మూడో దారి.. సాధ్యమైనంత కాలం వృద్ధాప్యాన్ని వాయిదావేయడం. బతికినన్నాళ్లూ పరిపూర్ణ ఆరోగ్యంతో బతికేయడం. ఈ దిశగా మాత్రం వేగంగా అడుగులు పడుతున్నాయి.

‘సూపర్‌’ శతాధికులు

మనిషి ఆయువుకు సంబంధించినంత వరకూ వంద ఓ అందమైన స్కోరు. ఆధునిక నాగరికత ఇంతగా నాటుకుపోని రోజుల్లో పరిపూర్ణ ఆయుర్దాయమంటే.. నూట ఇరవై ఏళ్ల నిండు జీవితమనీ  చెబుతారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ భూమి మీద సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి వయసు.. నూట ఇరవై రెండు. ఆ గణాంకాలన్నీ పరిగణనలోకి తీసుకునే శాస్త్రవేత్తలు శతాధికుల్ని మూడురకాలుగా వర్గీకరించారు.

ఒకటి..సాధారణ శతాధికులు.
వందేళ్ల మైలురాయిని చేరుకునేవారు.
రెండు.. సెమీ శతాధికులు.
నూట అయిదేళ్ల వరకూ బతికేవారు.
మూడు.. సూపర్‌ శతాధికులు.
నూట ఇరవై ఏళ్లు జీవించేవారు.
సాధారణ శతాధికుల వృద్ధాప్యం
ఏమంత సాఫీగా సాగిపోదు. ఎనభై, తొంభై నిండగానే రకరకాల రుగ్మతలు చుట్టుముడతాయి. అయినా, ఆ అవరోధాల్ని తట్టుకుని, భారం భారంగా సెంచరీ కొడతారు. దీర్ఘకాలిక రోగాలతోనే ప్రాణాలు విడుస్తారు.సెమీ శతాధికులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. వీరిది మంచి స్కోరే కానీ, చురుకైన జీవితం ఉండదు. పడక మీదే పావుశాతం జీవితం గడిచిపోతుంది. సూపర్‌ శతాధికుల కథ వేరు. ఉన్నంతకాలం గుండ్రాయిలా ఉంటారు. బతికినంత కాలం ఆరోగ్యంగా బతుకుతారు. హఠాత్తుగా శరీర వ్యవస్థ మొరాయిస్తుంది. అంతే, అకస్మాత్తుగా మరణిస్తారు. ఏ ముషాయిరాకో వెళ్లినట్టు.. శుభ్రంగా గెడ్డం చేసుకుని, ఇస్త్రీ బట్టలేసుకుని, అత్తరు చల్లుకుని, కాళ్లకు కొత్తచెప్పులు తొడుక్కుని మరీ.. తెలియని లోకాలకు బయల్దేరతారు. ఆ ’శతాధిక జీవితమూ, అనాయాస మరణమూ కొందరికే ఎలా సాధ్యం అవుతుంది?’ అనే ప్రశ్నకు జవాబు తెలిస్తే.. వృద్ధాప్య రహస్యం తెలిసిపోయినట్టే. ఇప్పటికే శాస్త్రవేత్తలు ‘సూపర్‌’ తాతయ్యలూ, జేజమ్మల జీవితాల్ని అధ్యయనం చేస్తున్నారు. వాళ్ల జన్యు చరిత్రను విశ్లేషిస్తున్నారు. మనిషి ఆయుర్దాయానికి ఏ ఒక్క జన్యువో కారణం కాకపోవచ్చు. కొన్ని జన్యువుల సముదాయమూ ప్రభావితం చేయవచ్చు. శరీరం అంటేనే.. కణాలూ కణజాలాల సమూహం. మనిషికి వృద్ధాప్యం వచ్చిందంటే కణాలకూ వచ్చినట్టే. అంటే, కణాలను యవ్వనంగా ఉంచుకున్నంత కాలం ముదిమి మనిషికి చేరువ కాలేదు. ఇది కణకేంద్ర సిద్ధాంతం. పాశ్చాత్య పరిశోధకులు ఆయువును డీఎన్‌ఏతోనూ ముడిపెడుతున్నారు. కొన్ని శరీరాలకు తమ డీఎన్‌ఏకు మరమ్మతులు చేసుకునే శక్తి ఉంటుంది. దీంతో క్యాన్సర్‌లాంటి రోగాలు దాడి చేసినా.. వ్యాధి ప్రభావాలు తొలిదశలోనే మటు మాయం అవుతాయి. ఆ ప్రత్యేకతను డీఎన్‌ఏ ఎడిటింగ్‌ ద్వారా ఇతరులకూ అందించగలిగితే.. ఎవరికివారు శతాధికులు అయిపోవచ్చు. మనిషి డీఎన్‌ఏలో టెలోమీర్స్‌ అనే ఏజ్‌ మార్కర్స్‌ ఉంటాయి. వీటికి వృద్ధాప్యంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆ మధ్య అంతరిక్ష యాత్రకు వెళ్లొచ్చిన వ్యోమగాములకు వైద్య పరీక్షలు జరిపినప్పుడు.. కొందరి వయసు అమాంతంగా తగ్గిపోయిన దాఖలాలు కనిపించాయి. అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు టెలోమీర్స్‌ పరిమాణం కొంతమేర పెరగడమే దీనికి కారణం. వయసు పైబడేకొద్దీ సహజంగానే వాటి పనితనం తగ్గుతుంది. అప్పుడే మనిషిలో వృద్ధాప్య లక్షణాలు బయటపడతాయి. అందుకే, టెలోమీర్స్‌ పలచబడిపోకుండా ఉండటానికి కొత్త ఉపాయాలు ఆలోచిస్తున్నాయి యాంటీ ఏజింగ్‌ కంపెనీలు. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు టెలోమీర్స్‌ కుంచించుకు పోతాయని కూడా కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే, ఒత్తిడిని అధిగమించ గలిగితే వృద్ధాప్యాన్నీ కొంతమేర నిలువరించవచ్చు.

‘యవ్వన’ ఇన్‌ఫ్లుయెన్సర్లు

ఇప్పటికే వృద్ధాప్యంపై పోరు ఊపందుకుంది. అనేక పుస్తకాలు వచ్చాయి. పరిశోధనలకైతే లెక్కేలేదు. ముసలితనాన్ని నిలువరించే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు శరీరంలోని 78 కీలక భాగాలపై దృష్టి సారించారు. వీటికి కనుక పునరుత్తేజాన్ని ప్రసాదించగలిగితే.. ముదిమిని ఓ మూలన కూర్చోబెట్టొచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిలికాన్‌వ్యాలీ కుబేరుడు బ్రైన్‌ జాన్సన్‌.. వార్ధక్యంపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఆయన చుట్టూ ప్రతినిత్యం ముప్పైమంది వైద్యులు ఉంటారు. బ్రైన్‌ శరీర వ్యవస్థలోని 78 భాగాలు ఎలా పనిచేస్తున్నాయనేది ప్రతిక్షణం గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం, అతని వయసు నలభై ఆరు. జీవశాస్త్ర పరంగా పద్దెనిమిదేళ్లకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆ ప్రయత్నంలో టీనేజ్‌లో ఉన్న తన కన్నకొడుకు ప్లాస్మాను తరచూ ఎక్కించుకుంటాడు. రోజూ ఓ చుక్క పాము విషాన్నీ తీసుకుంటాడని అంటారు. ‘ప్రాజెక్ట్‌ బ్లూ ప్రింట్‌’ బ్రైన్‌ నిత్య యవ్వన ప్రణాళిక. చర్మ ఆరోగ్యానికి ఒకటి, కణాల పునరుజ్జీవానికి ఒకటి, కంటి చూపుకు ఒకటి, పంటి బలానికొకటి.. ఇలా రోజుకు వంద మాత్రలు మింగుతాడు. కచ్చితమైన భోజన సూత్రాన్ని పాటిస్తాడు. ముసలితనాన్ని ఓడించడంలో కొంతమేర విజయం సాధించాననీ.. తన అవయవాల వయసును మొత్తానికి ఓ ఆరేళ్లు తగ్గించుకోగలిగాననీ ఈ మధ్యే ప్రకటించాడు.  ‘ఈ రోజు ఆరేళ్లు.. ఇంకో ఏడాదికి అరవై ఏళ్లు. ఏదో ఒకనాటికి మొత్తంగా మరణాన్నే జయిస్తాను’ అని మహానమ్మకంగా చెబుతాడు. ఆ గొంతులో కొందరికి అతిశయం గోచరిస్తుంది. కొందరికి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఏదేమైనా నమ్మకమే మనిషిని నడిపిస్తుంది.. కొన్నిసార్లు బతికిస్తుంది కూడా! ఇందులో మార్కెట్ కోణమూ ఉంది. తన ప్రయోగాల ఆధారంగా.. యాంటీ ఏజింగ్‌ చికిత్సల్ని రూపొందించి.. నిత్య యవ్వన వ్యాపారంపై ఏకఛత్రాధిపత్యం సాధించాలన్నది ఆలోచన. పీటర్‌ ఆటియా అనే క్యాన్సర్‌ సర్జన్‌ కూడా శతమాన వైద్యుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికే, ఓ వందమంది విశ్వకుబేరులు ఆయన సలహాలూ సూచనలూ తీసుకుంటున్నారు. కాకపోతే, పీటర్‌ కణవిభజనను మందగింపజేసే రాపామైసిన్‌ అనే వివాదాస్పద ఔషధాన్ని సిఫార్సు చేస్తాడనే విమర్శ ఉంది. ‘మీ వయసును ఓ ఇరవై ఏళ్లు తగ్గించే బాధ్యత నాదీ’ అంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు మరో యవ్వన ప్రేమికుడు.. డేవిడ్‌ సిన్‌క్లెయిర్‌. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ పల్లీలు, రెడ్‌ వైన్‌, బెర్రీ పండ్ల మిశ్రమంతో తనకోసమే ఓ టానిక్‌ రూపొందించు కున్నాడు. దాన్ని రోజూ మూడుపూటలా పుచ్చుకుంటాడు. దాంతోపాటూ రెండు భోజనాల మధ్య కనీసం పద్నాలుగు గంటల విరామం పాటించడం, చక్కెరను దూరం పెట్టడం, మాంసాహారాన్ని ముట్టుకోకపోవడం.. తన విజయ రహస్యాలని చెబుతాడు. 

బయో హ్యాకింగ్‌..

ఖరీదైన ఔషధాలతో సంబంధం లేకుండా.. జీవనశైలిలో కొద్దిపాటి సర్దుబాట్లతో వృద్ధాప్యాన్ని ఓడించడం సాధ్యమేనని నమ్మేవారంతా బయో హ్యాకింగ్‌కు ఓటేస్తున్నారు. బండి మైలేజీ పెంచుకోడానికి చిట్కాలు ఉన్నట్టే.. శరీర వ్యవస్థను మెరుగుపరుచుకోడానికి కూడా కొన్ని మార్గాలున్నాయని వీళ్లు నమ్ముతారు. కాకపోతే, హ్యాకర్లు కంప్యూటర్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్టు.. శరీర వ్యవస్థను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, న్యూరోసైన్స్‌, మానసిక శాస్త్రం, రోగ నిర్ధారణ సాంకేతికత.. తదితర అంశాల కలబోత ఇది. అవసరమైతే సంప్రదాయ విధానాలనూ, తాజా పరిశోధనల ఫలితాలనూ జోడిస్తారు. శరీర వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడానికి.. మాత్రల రూపంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు తీసుకుంటారు. శరీరంలో ఏ మూలన ఏం జరుగుతోందో తెలుసుకోడానికి వేరబుల్‌ టెక్నాలజీని వాడతారు. రెడ్‌లైట్‌ థెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీ, క్రయో థెరపీ, బాడీ వైబ్రేషన్‌ థెరపీ.. తదితర విధానాలనూ జోడిస్తారు. దీనివల్ల కొందర్ని అకాల వృద్ధాప్యం వైపూ, మరికొందర్ని సహజ వృద్ధాప్యం వైపూ తీసుకెళ్లే దీర్ఘకాలిక రుగ్మతలను నియంత్రించవచ్చని వాళ్ల నమ్మకం. కానీ, ఇక్కడో సమస్య ఉంది. ఇలాంటి పద్ధతుల్లో.. బతుకంతా జాగ్రత్తలతోనే సరిపోతుంది. ప్రతిక్షణం చావును తలుచుకున్నట్టే ఉంటుంది. ‘ఇన్ని కష్టాలు అవసరం లేదు. నిద్ర, పోషకాహారం, వ్యాయామం.. పరిపూర్ణ ఆయుర్దాయానికి ఈ మూడూ సరిపోతాయి. ఇవే సామాన్యుల బయో హ్యాకర్స్‌’ అంటారు వెంకీ రామకృష్ణన్‌ తన ‘వై వియ్‌ డై’ పుస్తకంలో.   

*        *         *

‘‘శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకుందాం. వైద్య విజ్ఞానం మరింత వికసిస్తుందనీ, టెక్నాలజీ అద్భుతాల్ని ఆవిష్కరిస్తుందనీ నమ్ముదాం. వీటన్నింటి వల్ల ఆయుర్దాయం పెరగొచ్చు. నూట ఇరవై ఏళ్లు బతకొచ్చు. మనిషి అత్యాశ అక్కడితో ఆగిపోతుందా? తక్షణం, టార్గెట్‌-150 సిద్ధం చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత టార్గెట్‌-200 అంటూ కొత్త పల్లవి అందుకుంటాడు. ఉన్న రోగాలకు మందులిస్తారు సరే.. కొత్త రోగాల మాటేమిటి? వాటికి చికిత్స కనిపెట్టడానికి ఇంకో శతాబ్దం పట్టొచ్చు. అంతవరకూ రుగ్మతలతో కునారిల్లాల్సిందేనా? మనిషిని బతికించగానే సరిపోతుందా? బతికే మార్గమూ చూపాలిగా. వయోధికులు కుర్చీలను పట్టుకుని వేలాడితే.. యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అయినా, ఎన్నేళ్లు బతికామనేది ఎవరికి కావాలి? ఎంత తృప్తిగా బతికామనేది కీలకం. పెంచుకోవాల్సింది ఆయువును కాదు.. అనుభూతులను.

వందేళ్ల జీవితంలో నూటయాభై ఏళ్ల అనుభూతులను ఆస్వాదించగలిగితే.. అన్నేళ్లూ బతికినట్టే.. ఏ మందూమాకూ తినకుండానే, ఏ మ్యాజిక్‌ పిల్స్‌ వేసుకోకుండానే!’’ అంటూ నిత్య యవ్వనానికి వెంపర్లాడే వ్యక్తులపై సుతిమెత్తని చురక వేస్తారు వెంకీ రామకృష్ణన్‌. ఓ పాత హిందీ సినిమాలో రాజేశ్‌ ఖన్నా డైలాగూ ఇలాంటిదే..

జిందగీ
బడీ హోనా చాహియే..
లంబీ నహీ!


శతమాన సూత్రాలు

1. ఆరోగ్యకరమైన జీవితం
  మంచి అలవాట్లను పెంచుకోవాలి. వ్యసనాలను వదులుకోవాలి.

2. పాజిటివ్‌ దృక్పథం
  మనం జీవితాన్ని ప్రేమిస్తే, జీవితమూ మనల్ని ప్రేమిస్తుంది.

3. అనుబంధాలు
  స్నేహితులతో కాలక్షేపం, కుటుంబంతో సత్సంబంధం కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.  

4. వ్యాయామం
  నడక, పరుగు, ఈత, యోగా.. ఏదైనా కావచ్చు. రోజూ అరగంట నుంచి గంట వరకు..  ఎంత సేపైనా కావచ్చు.

5. ఆహారం
  పోషక పదార్థాలు తీసుకోవాలి. పొట్టలో మూడోవంతు ఖాళీగా ఉంచుకోవాలి. పుష్కలంగా నీళ్లు తాగాలి.  

6. వ్యాపకం
పనిలో రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దీనివల్ల బద్ధకం దరిచేరదు.

7. నిద్ర
  ఇదీ ఓ చికిత్స లాంటిదే. ఆ సమయంలో శరీర వ్యవస్థ పునరుత్తేజాన్ని పొందుతుంది.


భారత్‌లోనూ...

భారతదేశం కూడా వృద్ధాప్యంపై యుద్ధంలో భాగస్వామి అవుతోంది. తాజాగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ‘ప్రాజెక్ట్‌ దీర్ఘాయువు’ పేరుతో ఓ అధ్యయనం ప్రారంభించింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌ కూడా ముసలితనం గుట్టు విప్పితీరాలనే పట్టుదలతో ఉంది. ఆ ప్రయత్నంలో మనిషిపై జన్యువులు, జీవనశైలి, పర్యావరణం, సంస్కృతి-సంప్రదాయాల ప్రభావాన్నీ బేరీజు వేస్తోంది. వైద్యులు, బయో ఇంజినీర్లు, గణిత శాస్త్రవేత్తలు .. ఇలా భిన్న రంగాల నిపుణులను ఈ ప్రాజెక్టులో భాగం చేసింది. ఇందుకు వందకోట్ల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలన్నది ఆలోచన. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ పరిశోధనలు జరుగుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..