హాబీ టూర్‌లకు వెళ్తున్నారు!

కొందరికి వంటచేయడమంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. కొత్తకొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మరికొందరు.

Updated : 10 Dec 2023 12:16 IST

కొందరికి వంటచేయడమంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. కొత్తకొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మరికొందరు. సాహసాలు చేయడం, ఫొటోగ్రఫీ, కళాకృతుల తయారీ, తోటపని... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. మరి ఆ అభిరుచులకు మెరుగులు దిద్దుకోగలిగితే... తమలాంటి ఆసక్తులు ఉన్నవారితో మాట్లాడగలిగితే... భలే ఉంటుంది కదూ. దీన్ని గుర్తించే కొన్ని సంస్థలు ఇప్పుడు ‘హాబీ టూర్స్‌’ను అందుబాటులోకి తెస్తున్నాయి.

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రయాణాల్లోనూ రకాలు ఉన్నాయి. ఒకే వయసువాళ్లు కలిసి వెళ్లేవి, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసే టైలర్‌మేడ్‌ టూర్లు, శారీరక -మానసిక ఆరోగ్యాన్ని పెంచే వెల్‌నెస్‌ ట్రిప్స్‌... ఇలా చాలానే చెప్పొచ్చు. ఆ జాబితాలో ఇప్పుడు ‘హాబీ టూర్లు’ కూడా చేరాయి. వంటల్లో ప్రయోగాలు, చిత్రలేఖనం, డిజైనింగ్‌, సాహస యాత్రలు, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఫొటోగ్రఫీ... ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. వాటన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలనుకునేవారికీ, తమ హాబీని ఉపాధిగా మార్చుకోవాలనుకునేవారికీ ఈ టూర్లు సరైన పరిష్కారాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు చాలామంది వంటల్లో ప్రయోగాలు చేస్తుంటారు. వాళ్ల ఆసక్తికి తగినట్లుగా ఎన్నో వెబ్‌సైట్లూ, యూట్యూబ్‌ ఛానళ్లూ అందుబాటులో ఉన్నాయిప్పుడు. అయినా కూడా ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దొరికే కొన్నిరకాల వంటకాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి కలినరీ/కుకింగ్‌ టూర్లు సరైన ఎంపికవుతాయి. వీటిద్వారా దిల్లీ, ముంబయి, జైపూర్‌, లఖనవూ, దక్షిణభారతదేశం... ఇలా వివిధ ప్రాంతాల్లో తయారుచేసే ప్రత్యేకమైన వంటకాల గురించి తెలుసుకుంటూనే స్థానిక షెఫ్‌లతో శిక్షణా తీసుకోవచ్చన్నమాట. ఈ యాత్రల్లో  స్ట్రీట్‌ఫుడ్‌ వాక్స్‌ కూడా ఉంటాయి. ఇలాంటి టూర్లు ఏర్పాటు చేసే సంస్థల్లో - టూర్‌ రాడార్‌, ఇండియా ఫుడ్‌ టూర్‌, ఇండియా టూర్స్‌... వంటి సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా సరదాగా ఫొటోలు తీసేవారికీ, అడవుల్లోని వన్యమృగాలను కెమెరాల్లో బంధించే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లకీ తేడా ఉంటుంది. అలాంటి వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లకోసం- వైల్డ్‌లైఫ్‌ ఫొటో టూర్స్‌, నేచర్‌ సఫారీ ఇండియా, నేచర్‌ వాండరర్స్‌... వంటివి ప్రత్యేకమైన టూర్లు ఏర్పాటుచేస్తాయి. వీటిద్వారా కజిరంగా సఫారీ, కెన్యా, జిమ్‌కార్బెట్‌ వైల్డ్‌లైఫ్‌ సఫారీ... వంటివాటికి వెళ్లొచ్చు. పది నుంచి పదిహేను రోజులపాటు ఉండే ఈ టూర్లు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లకు ఎన్నో విషయాలను నేర్పిస్తాయని అంటారు ఆ సంస్థల నిర్వాహకులు.

సాహసాలూ చేసేలా...

పెర్‌ఫ్యూమ్స్‌ను కేవలం వాడటమే కాకుండా వాటి తయారీ గురించి తెలుసుకోవాలనుకునేవారికీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్‌ స్వాగతం పలుకుతుంది. పెర్‌ఫ్యూమ్‌ల తయారీకి ప్రసిద్ధి అయిన కనౌజ్‌కు చెందిన ప్రణవ్‌ కపూర్‌ అనే వ్యాపారవేత్త పెర్‌ఫ్యూమ్‌ టూరిజం పేరుతో ఈ టూర్స్‌ను ప్రారంభించాడు. అక్కడికి వెళ్లి ఒకటి రెండు రోజులు ఉంటూనే పూల తోటల్ని చూడొచ్చు. పూలు కోయడం, వాటిని ప్రాసెస్‌ చేయడం నుంచీ అత్తర్ల తయారీ వరకూ అన్ని అంశాల్లో శిక్షణ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ టూర్స్‌లో కలంకారీ, గాజుల తయారీ, రగ్గుల తయారీ, నేతపని నేర్పించేవీ, డిజైనింగ్‌పైనా చిత్రలేఖనంపైనా అవగాహన కల్పించే టూర్లూ ఉన్నాయి. అలాగే వ్యవసాయం, తోటపని వంటివాటిపైన ఆసక్తి ఉన్నవారు టూర్‌ దె ఫార్మ్‌, రాయల్‌ ఎక్స్‌పెడిషన్స్‌- ఫార్మ్‌ టు టేబుల్‌ ఇండియా టూర్స్‌ని ఎంచుకోవచ్చు. ఇక, కొందరికి స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడం, సాహసాలు చేయడమంటే చెప్పలేంత ఆసక్తి. అలాంటివారి కోసం బైక్‌టూర్స్‌ కూడా ఉన్నాయిప్పుడు. అంటే... అవసరాన్ని బట్టి బైక్‌లు ఇస్తూనే... అన్నిరకాల ఏర్పాట్లూ చేసే సంస్థలన్నమాట.  ఇలాంటి హాబీ టూర్లను ఎంచుకోవడం వల్ల బస, ఆహారం, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వాహనాలూ, గైడ్‌ ఇలా అన్నిరకాల ఏర్పాట్లూ ఆ సంస్థలే చూసుకుంటాయి. పైగా ఒకేలాంటి అభిరుచులు ఉన్నవారితో పరిచయాలూ పెంచుకోవచ్చు కాబట్టే ఇప్పుడు చాలామంది ఈ హాబీటూర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి మీ అభిరుచి ఏంటీ... ఏ టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..