Real Estate: బడ్జెట్‌పై రియల్‌ ఆశలు

ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఇటీవలి సమావేశంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

Updated : 29 Jun 2024 10:10 IST

పరిశ్రమ హోదా కోసం దీర్ఘకాలంగా డిమాండ్‌ 
ఈనాడు, హైదరాబాద్‌

ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఇటీవలి సమావేశంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆశించిన వృద్ధిరేటును కొనసాగించాలంటే బడ్జెట్‌లో ప్రధానంగా దీనిపై దృష్టి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీడీపీ ఆశించిన వృద్ధి రేటు సాధించడంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా కీలకమే కాబట్టి ఎంతోకాలంగా ఆశిస్తున్న పలు ప్రోత్సాహకాలను 2024-25 పూర్తి కాల బడ్జెట్‌ నుంచి పరిశ్రమ వర్గాలు కోరు  తున్నాయి.

రుణాల లభ్యత పెరిగేలా 

రియల్‌ ఎస్టేట్‌ రంగం మన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది. సహజంగానే కొత్త ప్రభుత్వ హయాంలో రాబోయే బడ్జెట్‌లో గణనీయమైన సంస్కరణలు ఉంటాయని రియాల్టీ రంగం ఆశిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న పూర్తి స్థాయి పరిశ్రమ హోదా దక్కితే చాలా అవసరమైన పన్ను ప్రయోజనాలతో పాటూ చట్టపరమైన, పన్ను ప్రోత్సాహకాలు, ప్రాధాన్యక్రమంలో రుణాల లభ్యత ఉంటుందని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద 3 కోట్ల సరసమైన గృహాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రశంసనీయమే అయినా పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని పీఎంఏవైని మరిన్ని వర్గాలకు వర్తించే వెలుసుబాటు ఉండాలని కోరుతున్నారు.

రూ.5 లక్షలకుపెంచాలి

చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్న అంశాల్లో గృహ రుణాలపై పన్ను రాయితీల ప్రయోజనం పెంపు ఒకటి. దీంతో ఇటు గృహ కొనుగోలుదారులకు, అటు పరిశ్రమకు మేలు జరుగుతుంది. గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను రాయితీ ప్రస్తుతం రూ.2 లక్షల వరకే ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని స్థిరాస్తి పరిశ్రమ ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తోంది. బడ్జెట్‌కు ముందు మరోసారి వారు ఇదే వాదనను వినిపిస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం గృహ నిర్మాణ మార్కెట్‌ వృద్ధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. 

  • వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌లలో మార్పులు చేయడం ద్వారా రియల్‌ ఎస్టేట్, అనుబంధ  రంగాలతో సహా వేర్వేరు రంగాలకు మేలు జరుగుతుందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి.
  • 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రిట్‌లు, ఇన్విట్‌లో ఎక్కువ రిటైల్‌ మదుపరులు వచ్చే విధంగా ప్రోత్సాహకాలు ఉండాలని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యగ్నిక్‌ అన్నారు.

చోదకశక్తిగా 

ఎన్‌డీఏ ప్రభుత్వం వరసగా మూడోసారి అధికారంలోకి రావడంతో.. రాబోయే ఐదు సంవత్సరాల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను డెవలపర్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించే, దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఏ) ప్రవాహాలను పెంచే విధానాలను ఉంటాయని భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గృహాల స్థిరమైన డిమాండ్‌ కొనసాగించడం చాలా కీలకమని.. ఈ రంగం 200 అనుబంధ రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని చెబుతున్నారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణానికి తోడ్పడటానికి రియల్‌ ఎస్టేట్‌ రంగం దోహదం చేస్తుందని అంటున్నారు.

ఇళ్లకు డిమాండ్‌ పెరిగేలా

పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ.. డిమాండ్‌ పెంచే, స్థిరమైన వృద్ధిని నడిపించే బడ్జెట్‌ను ఆశిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు,  2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దీన్ని సాధించడంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పాత్ర కీలకం. వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ ఉంటుందని భావిస్తున్నాం. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం గృహ రుణాలకు పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే రెసిడెన్షియల్‌ యూనిట్లకు డిమాండ్‌ మరింత పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదాను మంజూరు చేస్తే నిధుల లభ్యత సులభతరం అవుతుంది. విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. 

శ్రీనివాస్‌రావు, సీఈవో, వెస్టియన్‌


కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ కోసం  కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల   నేపథ్యంలో గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటిలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగం విత్త మంత్రి నుంచి పలు ప్రోత్సాహకాలను ఆశిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని