RERA: రెరాలో ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకుందామిలా

ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన అపార్టమెంట్లతో నగరంలో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో సరికొత్త హంగులతో భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

Updated : 22 Jun 2024 07:24 IST

కొనుగోలుకు ముందే జాగ్రత్తలు

కాశహర్మ్యాలు, విలాసవంతమైన అపార్టమెంట్లతో నగరంలో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో సరికొత్త హంగులతో భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగరంలో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిపోవడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే క్రమంలో అవగాహన రాహిత్యంతో కొందరు కొనుగోలుదారులు అనుమతులు లేని ప్రాజెక్టులో కొని నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఇల్లు/ఫ్లాట్, స్థలం కొనుగోలు చేసేముందే జాగ్రత్తలు పాటించాలని స్థిరాస్తి నిపుణులు సూచిస్తున్నారు. నిర్మాణ అనుమతుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని చెబుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రాజెక్ట్‌కు రిజిస్ట్రేషన్‌ నంబరును కేటాయిస్తుంది. వీటిలో ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రెరా రిజిస్ట్రేషన్‌ నంబరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తుంటాయి. వీటితో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ప్రాజెక్టుకు రెరా ఆమోదం ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి.

ప్రాజెక్టు స్థితిని తెలుసుకోవడం ఎలా..

ఫ్లాట్‌/ప్లాట్‌ను కొనుగోలు చేసే ముందే టీజీ రెరాలో సంబంధిత ప్రాజెక్టు స్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మోసపోయే అవకాశం ఉండదు.

  • ముందుగా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ https://rera.telangana.gov.in/Home/ OrdersofAuthority ను సందర్శించాలి.
  •  సర్వీసెస్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
  • అనంతరం సెర్చ్‌ ప్రాజెక్టు డీటెయిల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ప్రాజెక్టు పేరు, ప్రమోటర్‌ పేరు లేదా రిజిస్ట్రేషన్‌ నంబరును నమోదు చేసి సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో ప్రాజెక్టు వివరాలు, రిజిస్ట్రేషన్‌ స్థితిని తెలిపే పట్టిక కనిపిస్తుంది. 

ఫిర్యాదు చేయడం ఇలా..

నమోదిత రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బిల్డర్లు, డెవలపర్‌లపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు టీజీరెరా వెబ్‌సైట్‌లో కల్పించారు. వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయడానికి కింది దశలను అనుసరించాలి.

  • తెలంగాణ రెరా వెబ్‌సైట్‌ని సందర్శించి సర్వీస్‌లలోని రిజిస్టర్‌ కంప్లెయింట్‌పై క్లిక్‌ చేయాలి.
  • తదుపరి పేజీలో ఫిర్యాదు ఫారమ్‌ని ఉపయోగించి లాగిన్‌ అవ్వాలి. మీరు కొత్త వినియోగదారుడు అయితే.. ముందుగా పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి https://rerait.telangana.gov.in/?MenuID=50 లింక్‌ను ఓపెన్‌ చేయాలి. 
  • మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు ఫారంని పూరించాలి.
  • అవసరమైన పత్రాలు, ఆధారాలతో పాటు ఫిర్యాదును సమర్పించాలి. అనంతరం తెలంగాణ రెరా అథారిటీ సంబంధిత ఫిర్యాదును సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

రెరా నిబంధనలు..

  • రెరా గుర్తింపు లేకుండా 8 ఫ్లాట్లు/500 చ.మీ.దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు. ముందస్తుగా ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదు. దరఖాస్తు చేసే సమయంలోనే ఈ రంగంలో ఉన్న అనుభవం, నిర్మాణానికి కావాల్సిన మూలధన వివరాలను రెరాకు వెల్లడించాలి.
  •  కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములో 70 శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. దానికి అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. ప్రతి త్రైమాసిక జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాలి.
  •  కొనుగోలుదారుడి వద్ద ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా అడ్వాన్స్‌ తీసుకుంటే ఇరువురి మధ్య ఒప్పదం కుదుర్చుకోవాలి. అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడే ఇంటిని స్వాధీనపర్చే తేదీని లిఖితపూర్వకంగా తెలపాలి. సకాలంలో నిర్మాణం పూర్తికాకపోతే రెరా సిఫార్సు చేసిన వడ్డీని ప్రతీనెల కొనుగోలుదారుడికి సమర్పించాలి. 
  • ప్లాన్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా బిల్డర్‌ నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయాలనుకున్నప్పుడు ముందుగా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి.
  • నిర్మాణంలో ఉన్న ఇల్లు/ఫ్లాట్‌ పురోగతిని ప్రతీ మూడు నెలలకు ఒకసారి నివేదిక, నిర్మాణ ఫొటోల ద్వారా.. రెరా వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి. 
  • నిర్మాణ/నాణ్యత లోపాలకు 5 ఏళ్ల వరకు బిల్డరే బాధ్యుడిగా రెరా చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా లోపాలను కొనుగోలుదారుడు బిల్డర్‌ దృష్టికి తీసుకెళితే.. ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా మరమ్మతులు చేసి అప్పగించాలి.
  •  నిర్మాణం చేపట్టేటప్పుడు దాని వివరాలను ముందుగా రెరాలో నమోదు చేయాలి. నమోదు చేయకుండా ప్రాజెక్టుకు సంబంధించి మీడియాలో ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర ప్రకటనలు చేయకూడదు.

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని