varshini rajput: కష్టమైనా.. ఇష్టంగా కూచిపూడి..!

హాయ్‌ నేస్తాలు..! డాన్స్, పాటలు అనేవి ప్రతిఒక్కరి జీవితంలో భాగమే.. అందులోని మెలకువలు, నియమాలు ఏమీ తెలియకపోయినా.. ఎప్పుడో ఒకసారి కచ్చితంగా.. డాన్స్‌ చేయడం, పాట పాడటం చేసే ఉంటాం.. అంతే కదా! కానీ అందులో శాస్త్రీయ నృత్యానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.

Published : 26 Jun 2024 00:38 IST

హాయ్‌ నేస్తాలు..! డాన్స్, పాటలు అనేవి ప్రతిఒక్కరి జీవితంలో భాగమే.. అందులోని మెలకువలు, నియమాలు ఏమీ తెలియకపోయినా.. ఎప్పుడో ఒకసారి కచ్చితంగా.. డాన్స్‌ చేయడం, పాట పాడటం చేసే ఉంటాం.. అంతే కదా! కానీ అందులో శాస్త్రీయ నృత్యానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అంత సులభంగా నేర్చుకోలేము. కానీ అందులోనే ఓ చిన్నారి అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. మరి తనెవరో? నృత్యంతో తన ప్రయాణమేంటో తెలుసుకుందామా..!

సంగారెడ్డికి చెందిన ఆర్‌.వర్షిణి రాజ్‌పుత్‌కు పన్నెండు సంవత్సరాలు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న పురాన్‌సింగ్‌ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ శశికళ గృహిణి. ఈ చిన్నారి.. కూచిపూడి అంటే ఇష్టంతో ఏడేళ్ల వయసులోనే నేర్చుకోవడం ప్రారంభించిందట. సంగారెడ్డిలోని ఓ డాన్స్‌ అకాడమీలో.. జ్యోతి కులకర్ణి దగ్గర శిక్షణ తీసుకుంది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడం కష్టమే.. అయినా తను మాత్రం చాలా తక్కువ కాలంలోనే అందులో మెలకువలన్నీ నేర్చుకుందట.

నానమ్మ కోరిక కూడా..!

శిక్షణలో చేరిన మొదట్లో స్కూల్‌కి వెళ్లడం.. మళ్లీ డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం.. రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమే అయినా, తల్లిదండ్రుల సహకారంతో మెల్లగా అలవాటు చేసుకుందీ చిన్నారి. తను శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనేది వాళ్ల నానమ్మ కోరిక కూడా. మొదటి ప్రదర్శనలోనే.. ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది వర్షిణి. ఆ తర్వాత చాలా ప్రదర్శనలు ఇచ్చిందట. బంగారు తెలంగాణ జానపద కళల అకాడమీ జాతీయ నృత్యోత్సవం-2023 పోటీలో పాల్గొని బహుమతి, సర్టిఫికేట్‌ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు దేవాలయాల్లో, ఇతర కార్యక్రమాల్లో దాదాపు 40కి పైగా ప్రదర్శనలు ఇచ్చి.. ప్రముఖుల మన్ననలు పొందింది. పదుల సంఖ్యలో బహుమతులూ సాధించి, అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కూచిపూడి మాత్రమే కాకుండా తను కరాటేలోనూ ప్రావీణ్యం సంపాదించింది. భవిష్యత్తులో కూచిపూడిలో జాతీయస్థాయి గుర్తింపు సాధించడం.. అలాగే బాగా చదువుకొని డాక్టర్‌ అవ్వడమే తన లక్ష్యమట. ఈ చిన్నారి తన లక్ష్యాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుదామా!

మంత్రి భాస్కర్, ఈటీవీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని