Wonder kid: కష్టమైనా.. ఇష్టంతో సాధించింది..!

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ చేయడం కష్టమే అయినా.. చాలా మంది అందులో రాణిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు.

Published : 03 Jul 2024 00:41 IST

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ చేయడం కష్టమే అయినా.. చాలా మంది అందులో రాణిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అలాంటి ఓ చిన్నారి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి..!

తిరుపతికి చెందిన కామిసెట్టి ఖ్యాతికి పన్నెండు సంవత్సరాలు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న రెడ్డి పవన కృష్ణ తితిదేలో ఉద్యోగి. అమ్మ తేజశ్విని గృహిణి. ఖ్యాతి ఎల్కేజీలో ఉన్నప్పుడే.. తనను స్కేటింగ్‌ శిక్షణలో చేర్పించారట. అప్పటి నుంచే.. స్కేటింగ్‌ తన దినచర్యలో భాగమైంది. మొదట్లో సాధన చేస్తున్న సమయంలో ఎన్ని గాయాలైనా.. వదిలేయకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించేదట. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదుల సంఖ్యలో పోటీల్లో పాల్గొంది.

చదువులోనూ ముందే..!

మన ఖ్యాతి.. ఉదయం 3:30 గంటలకే నిద్ర లేచి, స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభిస్తుందట. అంతేకాకుండా తను చదువులోనూ ముందే ఉంటుందట నేస్తాలూ..! ఇటీవల జరిగిన ‘ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొని బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది నిర్వహించిన.. ‘ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ వైజాగ్‌’లో రింక్‌ ఎలిమినేషన్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో 4 బంగారు, 9 వెండి, 6 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. స్కేటింగ్‌తో పాటుగా తనకు స్విమ్మింగ్‌ చేయడం, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ చేయడం, పియానో వాయించడం అంటే ఎక్కువ ఆసక్తట. భవిష్యత్తులో క్రీడల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొంది.. పైలట్‌ అవ్వాలన్నదే తన లక్ష్యమట. మరి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!

పిల్లనగోయిన రాజు,
ఈనాడు డిజిటల్, తిరుపతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు