kids story: ఇది ఇవాన్‌ పుస్తకం..!

హాయ్‌ నేస్తాలూ..! స్కూల్‌ ప్రారంభమైందిగా.. ఎంచక్కా అందరూ వెళ్తున్నారు కదూ! మళ్లీ హోంవర్క్స్‌ రాయడం మొదలుపెట్టారా మరి?

Published : 14 Jun 2024 00:04 IST

హాయ్‌ నేస్తాలూ..! స్కూల్‌ ప్రారంభమైందిగా.. ఎంచక్కా అందరూ వెళ్తున్నారు కదూ! మళ్లీ హోంవర్క్స్‌ రాయడం మొదలుపెట్టారా మరి? మనకు స్కూల్లో ఇచ్చిన వర్క్‌ రాయడానికే బద్ధకిస్తాం. కానీ ఓ బుడతడు ఏకంగా పుస్తకమే రాసేశాడు. మరి తన వివరాలేంటో వెంటనే తెలుసుకుందామా..!

గురుగ్రాంకు చెందిన ఇవాన్‌ పరాశర్‌కు ఆరేళ్లు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ వయసులో ఒక పుస్తకం చదవడమే చాలా కష్టం. కానీ ఈ బుడతడు మాత్రం డైనోసార్ల గురించి ఏకంగా పుస్తకమే రాసేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ.. దానికి ‘బిగ్‌ బ్రో ఇవాన్‌: టైం ట్రావెల్స్‌ టు ది ల్యాండ్‌ ఆఫ్‌ ది డైనోసార్‌’ అని పేరు పెట్టాడు.

విని.. చదివి..!

మనం ఏదైనా అంశం గురించి రాయాలంటే.. దానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే.. సరైన సమాచారాన్ని అందించలేము కదా! అందుకే మన ఇవాన్‌ కూడా డైనోసార్లకు సంబంధించి చాలా కథలు విన్నాడట. కొన్ని చోట్ల చదివాడట. దాని కోసం తన తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారట. అలా తను సేకరించిన విషయాలనే పుస్తకంగా మలిచాడట. మరో విషయం ఏంటంటే.. డైనోసార్ల గురించి పుస్తకం రాసిన అతి చిన్నవయస్కుడిగా నిలిచాడు ఇవాన్‌. అవి ఎలా పుట్టాయి.. ఎలా ఉండేవి.. వాటికి ఏమంటే ఇష్టం..? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఈ పుస్తకంలో పొందుపరిచాడు. ఈ బుడతడి ప్రతిభను గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు, అందులో స్థానం కూడా కల్పించారు. భవిష్యత్తులో మంచి రచయిత అవ్వడమే తన లక్ష్యమట. మరి తను కోరుకున్నట్లు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని