kids story: ఈ నాట్యమయూరి సేవాగుణం అద్భుతం..!

హాయ్‌ నేస్తాలూ! డాన్స్‌ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి.. అందులోనూ శాస్త్రీయ నృత్యం అంటే.. అందరికీ ప్రత్యేక అభిమానం.

Published : 01 Jul 2024 01:04 IST

హాయ్‌ నేస్తాలూ! డాన్స్‌ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి.. అందులోనూ శాస్త్రీయ నృత్యం అంటే.. అందరికీ ప్రత్యేక అభిమానం. అలాంటి నృత్యం చేస్తూనే ఓ అమ్మాయి.. రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ఇంతకీ తనెవరు? ఆ వివరాలేంటో.. తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే వెంటనే ఈ కథనం చదివేయండి!

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సింగమశెట్టి హేమసాయికి పదమూడేళ్లు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న జైఆంధ్ర ఉద్యోగి. అమ్మ జగదీశ్వరి గృహిణి. నృత్యం మీద ఉన్న ఆసక్తితో తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఈ అమ్మాయి ఇప్పటి వరకు 500 ప్రదర్శనలు ఇచ్చి.. అందరినీ ఔరా అనిపించింది.

అమ్మ ఆశయం..!

హేమసాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు తన మొదటి ప్రదర్శన ఇచ్చిందట. వాళ్లమ్మకు నృత్యం చాలా ఇష్టం ఉండేదట. ఆమె అందులో రాణించకపోవడంతో.. ఆ కలను ఈ చిన్నారి ద్వారా సాకారం చేసుకోవాలనుకున్నారు. ఆ చిన్నారి కూడా క్రమశిక్షణతో సాధన చేస్తూ అతి తక్కువ కాలంలోనే.. అందులోని మెలకువలపై పట్టు సాధించింది. ఆరేళ్లప్పుడే కూచిపూడిలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అన్నమయ్య కీర్తనలు, శబ్దాలతో పాటు ఫోక్‌ డాన్సుల్లోనూ పట్టు సాధించింది. అలా 2015 మార్చిలో ఒంగోలులో నిర్వహించిన ఉగాది సమ్మేళనంలో ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకుంది. 2016 మేలో చిలకలూరిపేటలో కళా నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ అఖిల భారత సంగీత, నృత్య పోటీల్లో నాట్యమయూరి బిరుదు పొందింది. చిన్నారి ప్రతిభకు 2020లో ఫిబ్రవరిలో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ లోనూ చోటు దక్కింది.

చేయూతనివ్వాలని..!

గత ఏడాది డిసెంబరులో బెంగళూరులో క్యాన్సర్‌ పేషంట్లకు ఆర్థిక సాయం అందించేందుకు.. శరణ్య డాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన నృత్య ప్రదర్శనల్లో పాల్గొని తన వంతు సాయంగా, ఆ ప్రదర్శనకు వచ్చిన డబ్బు క్యాన్సర్‌ బాధితులకు అందజేసింది. అది తనను ఎంతగానో ప్రభావితం చేసింది. దీంతో అప్పటి నుంచి తన నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బంతా క్యాన్సర్‌ బాధితులకు, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది హేమసాయి. ఈ ఏడాది మార్చిలో ఒంగోలులో జరిగిన బాలోత్సవం పోటీల్లో బంగారు పతకం సాధించింది. విదేశాల్లో నృత్య ప్రదర్శనలివ్వాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. నృత్యమే కాకుండా.. హేమసాయి చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం పొందింది. చిన్న వయసులోనే సేవా పథంలో నడవాలనే ఆకాంక్షతో అడుగులేస్తున్న ఈ నాట్యమయూరి నిజంగా గ్రేట్‌ కదూ!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని