Inspiring story: ఈ చిన్నారి కరాటేలో చిరుత!

హాయ్‌ నేస్తాలూ! ఈ చిచ్చరపిడుగు కరాటేలో అద్భుతంగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది.

Published : 23 Jun 2024 00:18 IST

హాయ్‌ నేస్తాలూ! ఈ చిచ్చరపిడుగు కరాటేలో అద్భుతంగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది. పోటీ ఎక్కడైనా సరే.. బరిలో దిగితే ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే! మరి ఆ చిరుత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

న్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన బి.తేజశ్వినికి పదేళ్లు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతోంది. అబ్బాయిలతో ధీటుగా పోటీల్లో పాల్గొంటోంది. పతకాలు సాధిస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. తండ్రి శివప్రసాద్, తల్లి చంద్రకళ తితిదేలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు తమ చిన్నారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

గెలిచినా.. ఓడినా..!

గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడిపోయినప్పుడు డీలా పడిపోకుండా.. తేజశ్విని, ఈ ఆత్మరక్షణ విద్యలో ముందుకు సాగుతోంది. ‘కరాటేతో మనల్ని మనమే కాకుండా, ఇతరులనూ రక్షించవచ్చు’ అని పీఈటీలు చెప్పిన మాటలు, ఈ చిన్నారిలో బలంగా నాటుకుపోయాయి. ఇలా ప్రేరణ పొంది, శిక్షణ తీసుకుంటున్న తేజశ్విని కొన్ని నెలల్లోనే ఎన్నో మెలకువలు నేర్చుకుంది.

రోజూ సాధన!

శిక్షకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రోజుకు నాలుగు గంటలపాటు కరాటే సాధన చేస్తోంది. మరోవైపు చదువునూ అశ్రద్ధ చేయడం లేదు. గతేడాది జూన్‌లో కర్ణాటకలో జరిగిన 17వ నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అండర్‌-7 విభాగంలో బరిలోకి దిగి రజత పతకం సాధించింది. ఆగస్టు 17న జరిగిన ఏపీ నేషనల్‌ లెవెల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం సొంతం చేసుకుంది. నవంబర్‌లో ఊటీలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజతం పొందింది. సెప్టెంబర్‌లో నిర్వహించిన ఫస్ట్‌ ఏపీ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది.

వెనకడుగు వేయకుండా...

తాజాగా ఈ ఏడాది జూన్‌ 7న న్యూ ఢిల్లీ స్కూల్‌ గేమ్స్‌ అండ్‌ యాక్టివిటీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ వారు నిర్వహించిన పోటీల్లో అండర్‌ 8 విభాగంలో తేజశ్విని రజత పతకం కైవసం చేసుకుంది. జనవరి 7వ తేదీన గోవాలో జరిగిన ఫస్ట్‌ నేషనల్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుపొందింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులో ఒకీనవా గోజిరియో కరాటే డూ ఫెడరేషన్‌ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తొలి రెండు రౌండ్లలో ఓడిపోయినా, వెనకడుగు వేయకుండా పట్టుదలతో తలపడి, కాంస్య పతకం సాధించింది. భవిష్యత్తులో ఈ చిన్నారి ఇలాగే మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి.

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు