MULTI TASKING DHANVIKA: ఔరా.. ధన్విక మల్టీటాస్కింగ్‌..!

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ చేయడం అంటేనే.. చాలా కష్టంతో కూడుకున్నది. కానీ  కళ్లకు గంతలు కట్టుకొని, తల మీద కుండ పెట్టుకొని కిలో మీటర్ల దూరం వరకు స్కేటింగ్‌ చేస్తే ఎలా ఉంటుంది.

Published : 25 Jun 2024 04:30 IST

హాయ్‌ నేస్తాలూ..! స్కేటింగ్‌ చేయడం అంటేనే.. చాలా కష్టంతో కూడుకున్నది. కానీ  కళ్లకు గంతలు కట్టుకొని, తల మీద కుండ పెట్టుకొని కిలో మీటర్ల దూరం వరకు స్కేటింగ్‌ చేస్తే ఎలా ఉంటుంది. ఇది అసాధ్యమే అనిపిస్తుంది కదూ! కానీ ఓ చిన్నారి దీన్ని సుసాధ్యం చేసి.. రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా.. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి!

శ్చిమగోదావరి జిల్లా అలంపురం గ్రామానికి చెందిన ఎం.ధన్వికకు ఏడు సంవత్సరాలు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న శ్రీనివాస్‌ ఉద్యోగి.. అమ్మ శిరీష గృహిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్నారి ధన్విక స్కేటింగ్‌లో చాలా బాగా రాణిస్తోంది. చిన్నప్పటి నుంచే తనకు స్కేటింగ్‌ మీద ఎక్కువ ఆసక్తి చూపేదట. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ.. స్కేటింగ్‌ చేయడానికి ప్రయత్నించేదట. దాంతో ఆమె ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు.. తణుకులోని ఓ స్కేటింగ్‌ శిక్షణ కేంద్రంలో చేర్పించారు. ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం మొదటిసారి, రాజమండ్రిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఆ తర్వాత మరెన్నో పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. అటు చదువును నిర్లక్ష్యం చేయకుండా.. ఇటు స్కేటింగ్‌లోనూ పతకాలు సాధిస్తోంది. 

మల్టీటాస్క్‌ స్కేటింగ్‌..!

స్కేటింగ్‌ అంటే తెలుసు గానీ.. ఈ మల్టీటాస్క్‌ స్కేటింగ్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? స్కేటింగ్‌ చేస్తూనే.. వేరే పనులు కూడా చేస్తే దాన్నే ‘మల్టీటాస్క్‌ స్కేటింగ్‌’ అంటారు. మన ధన్విక ఇందులో ప్రపంచ రికార్డు సాధించింది. తణుకు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు ఉన్న జాతీయ రహదారి మీద 18 కిలో మీటర్ల దూరం మల్టీటాస్క్‌ స్కేటింగ్‌ చేసింది. కళ్లకు గంతలు కట్టుకొని.. తల మీద జ్యోతి వెలిగించిన కుండను పెట్టుకొని.. కర్రసాము చేస్తూ, జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ.. రోల్‌ బాల్‌ ఆడుతూ.. ఒక చేతిలో రింగ్‌ మరో చేతిలో కుండ పెట్టుకొని, ట్యూబ్‌ లైట్లను పగలగొడుతూ.. స్కేటింగ్‌ కొనసాగించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ.. మరో విషయం ఏంటంటే.. తను బ్యాక్‌ స్కేటింగ్‌ కూడా చేసింది. ఇంతటి ప్రతిభ కనబర్చిన చిన్నారిని గుర్తించిన ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇంటర్నేషనల్‌ జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కల్పించారు. భవిష్యత్తులో ఆర్మీ అధికారి కావాలన్నదే తన లక్ష్యమట. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ!

మురళి, న్యూస్‌టుడే, తణుకు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని