Inspiring story: ఇది అక్కాతమ్ముళ్ల విజయం..!

హాయ్‌ నేస్తాలూ..! కరాటేలో అవార్డులు సాధించిన వాళ్లను.. మనం చాలామందినే చూసుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అందులో రికార్డు సాధించిన వాళ్ల గురించే.. కానీ వీరు కవలలు అవ్వడమే విశేషం.

Published : 19 Jun 2024 00:47 IST

హాయ్‌ నేస్తాలూ..! కరాటేలో అవార్డులు సాధించిన వాళ్లను.. మనం చాలామందినే చూసుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అందులో రికార్డు సాధించిన వాళ్ల గురించే.. కానీ వీరు కవలలు అవ్వడమే విశేషం. ఇద్దరూ ఒకే రంగంలో రాణించడం ప్రత్యేకమే కదా! వెంటనే ఈ కథనం చదివి ఆ వివరాలేంటో తెలుసుకోండి మరి!

తిరుపతికి చెందిన కవలలు పుట్టా కీర్తిక శెట్టి, కీర్తన్‌ శెట్టిలకు ఎనిమిది సంవత్సరాలు. ప్రసుత్తం నాలుగో తరగతి చదువుతున్నారు. వాళ్ల నాన్న నవీన్‌ ఉద్యోగి. అమ్మ ప్రవళిక గృహిణి. ఈ అక్కాతమ్ముళ్లిద్దరూ కరాటేలో విశేష ప్రతిభ కనబరుస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వారికి అయిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. కరాటే మాస్టర్‌ శేఖర్‌ దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించారట. తక్కువ సమయంలోనే కరాటేలో మెలకువలన్నీ నేర్చేసుకున్నారట ఈ బుడతలు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. పతకాల పంట పండిస్తున్నారు. కీర్తిక ఇప్పటి వరకు.. 15 బంగారు, 2 వెండి, 1 కాంస్య పతకం సాధించింది. కీర్తన్‌ 15 బంగారు, 3 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు.

అదే లక్ష్యం..!

స్కూల్‌కి వెళ్లే ముందు.. వచ్చాక ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటారట. ఒకరికి ఒకరు కరాటేలోని మెలకువలు వివరించుకుంటూ.. సాధన కొనసాగిస్తారట. కరాటేతో పాటుగా.. పాటలు పాడటం, నృత్యం చేయడం అంటే కీర్తికకు చాలా ఇష్టమట. అలాగే.. కీర్తన్‌కు కూడా డాన్స్‌ అంటే ఆసక్తి ఎక్కువట. వీళ్లు చదువులోనూ.. ముందే ఉంటారట నేస్తాలూ..! భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడమే వారి లక్ష్యమట. దాంతో పాటు.. ఉచితంగా కరాటే శిక్షణ అందించాలనేది కూడా వీరి ఆలోచనట. ఎంతైనా ఈ చిన్నారులు చాలా గ్రేట్‌ కదూ.. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!

పిల్లనగోయిన రాజు, ఈనాడు డిజిటల్, తిరుపతి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు